Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రశ్నార్థకంగా ఆ రంగం మారింది : కేటీఆర్
- టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో వ్యవసాయం తర్వాత అత్యంత మందికి ఉపాధి కల్పించే చేనేత, జౌళి శాఖ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఓ పాలసీ లేకుండా పోయిందనీ, దీంతో ఆ రంగం ఉనికే ప్రశ్నార్థకంగా మారిందని రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ...ఫామ్ టూ ఫ్యాబ్రిక్ ఫామ్ టూ ఫ్యాషన్ అంటూ ప్రకటనలు ఇవ్వడానికే కేంద్ర ప్రభుత్వం పరిమితమైందని విమర్శించారు. చేనేత రంగం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వద్ద ఒక పాలసీ లేకపోవడంతో మన దేశం చాలా వెనుకబడిపోయిందనీ, చిన్న దేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక లు దుస్తుల తయారీలో వస్రోత్పత్తిలో మనకంటే ఎంతో ముందున్నాయని తెలిపారు. ప్రపంచానికి అవసరమైన 34 శాతం వస్త్రాలను చైనానే ఉత్పత్తి చేస్తున్నదని చెప్పారు. బంగారం లాంటి పత్తి పండే మన దేశంలో చేనేత రంగానికి కొద్దిగా ఊతమిస్తే అద్భుతాలు చేయొచ్చని కేంద్రానికి చెబుతున్నా పట్టించుకోవటం లేదని విమర్శించారు. కేంద్రం తీరుతో ఎంతో నైపుణ్యం ఉన్న లక్షలాది మంది చేనేత కళాకారులు మన దేశంలో ఉన్నా ప్రయోజనం లేకుండా పోతున్నదని వాపోయారు. జనగామ నుంచి ఏ నేతన్నలైతే సూరత్‌కి వలస పోయారో వాళ్ళు తిరిగి రప్పించాలన్నదే సీఎం కేసీఆర్ కల అనీ, దానికి తగిన కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తమిళనాడులోని తిరుప్పూర్ అనే ఒక చిన్న పట్టణంలోని నేతన్నల సమిష్టి కృషితో రూ. 40,000 కోట్ల ఉత్పత్తులు సాలీన చేస్తున్నారని తెలిపారు. అక్కడ సాధించిన విజయాలను స్ఫూర్తిగా తీసుకుని సీఎం కేసీఆర్ కాకతీయ మెగా టెక్సటైల్ పార్కు, గద్వాలలో చేనేత పార్కు, నారాయణపేటలో మరో పార్కు, సిరిసిల్లలో అపెరల్ పార్కులను ఏర్పాటు చేశారన్నారు. చేనేత మిత్ర కార్యక్రమం కింద 40 శాతం సబ్సిడీ నూలు, రసాయనాల మీద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. నేతన్నలకు చేయూత, థ్రిఫ్ట్ కింద పొదుపు పథకాలను నిర్వహిస్తున్నామన్నారు. నరేంద్ర మోడీ తప్ప చేనేత ఉత్పత్తి ఉత్పత్తులపై ఏ ప్రధానమంత్రి కూడా పన్నులు వేయలేదన్నారు. రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ..తెలంగాణ భూ గర్భాన్ని నదీ జలాలుగా మార్చిన, వ్యవసాయాన్ని అన్నదాతకు లాభసాటిగా చేసిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అవమానాలకు గురైన విషయాన్ని గుర్తుచేశారు. బీజేపీలో తనకు కనీస గౌరవం ఇవ్వలేదనీ, హింసించారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఎం.శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.