Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరు కానున్న సీఎం కేసీఆర్
- లక్ష మంది టార్గెట్..
నవ తెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం మరో వారం రోజుల్లో ముగింపు కానుంది. ఈ క్రమంలో అధికార టీఆర్ఎస్ పార్టీ తన ప్రచారానికి మరింత పదును పెడుతోంది. వచ్చే నెల 1న ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో ఈ నెల 30న చండూరు మండలం బంగారి గడ్డలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ ఏర్పాటుకు పార్టీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఇప్పటికే నియోజకవర్గాన్ని దాదాపు 86యూనిట్లుగా టీఆర్ఎస్ విభజించుకుంది. ఆ యూనిట్లో ప్రతి ఓటరును పార్టీ ప్రతినిధి కలిసేలా ప్రణాళిక చేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావుతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మెన్లు, కీలక నేతలంతా ఈ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నారు.
బంగారిగడ్డలో ఎన్నికల ప్రచార బహిరంగ సభ స్థలాన్ని బుధవారం మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో పాటుగా ఇతర ఎమ్మెల్యేలు, నేతలు పరిశీలించారు. యూనిట్ ఇన్‌చార్జీలుగా ఉన్న నాయకులంతా ప్రచారం చివరి నిముషం వరకు వారి వారికి కేటాయించిన గ్రామాల్లోనే ఉండాలని సీఎం ఇప్పటికే ఆదేశించారు. ఎన్నికల ఇన్‌చార్జీలుగా పనిచేస్తున్న వారి పనితీరుపై ఎప్పటికప్పుడూ ప్రభుత్వ ఇంటెలిజెన్స్, ప్రయివేటు సర్వే సంస్థలు సీఎంకు నివేదికన అందజేస్తున్నాయి. వాటి ఆధారంగానే ప్రచార సరళిలో చేయాల్సిన మార్పులు, వ్యుహ, ప్రతి వ్యూహాలను రచించి అమలు చేసే పనిలో మంత్రి కేటీఆర్ ఉన్నారు.
సభకు లక్ష మంది లక్ష్యం
చండూరులో నిర్వహించే బహిరంగ సభకు దాదాపు లక్ష మందిని రప్పించేలా టీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది. మంత్రి జగదీశ్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే చౌట్పుల్, గట్టుప్పల్, మునుగోడు మండల కేంద్రాల్లో కేటీఆర్ రోడ్ షోలు నిర్వహించారు. ఈ రెండు రోజుల్లో కూడూ సమీప ప్రాంతాల్లో పర్యటనలు చేసి సభ విజయవంతానికి అవసరమైన విధంగా జనాన్ని తరలించేందుకు చర్యలు తీసుకోనున్నారు.