Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వృద్ధులు, వికలాంగులపై ఫోకస్..
- పోస్టల్ బ్యాలెట్‌కు రూ.5వేలు
నవతెలంగాణ-నల్లగొండ
మునుగోడు ఉపఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు రకరకాల ప్రచార అస్త్రాలు సంధిస్తున్నాయి. ఇదే క్రమంలో పోస్టల్ బ్యాలెట్‌పై ప్రత్యేక దృష్టి సారించాయి. పెద్దమొత్తంలో ఓటర్లను ప్రలోభపెడుతున్నాయి. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓటర్లపై ఫోకస్ పెట్టి వారికి పెద్ద మొత్తంలో డబ్బును ఆఫర్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒక్కో పోస్టల్ బ్యాలెట్ ఓటును రూ.5వేలకు కొనుగోలు చేస్తున్నట్టు సమాచారం. సాధారణంగా 80 ఏండ్లు దాటిన వృద్ధులు, వికలాంగులతో పాటు ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే అవకాశం ఉంటుంది. అయితే, మునుగోడు ఉప ఎన్నికల్లో స్థానిక ఉద్యోగులను కాకుండా ఇతర ప్రాంతాల ఉద్యోగులను ఎన్నికల విధులకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటువేసే ఎన్నికల సిబ్బంది ఎవరూ లేరు. ఇక మిగిలింది.. వృద్ధులు, వికలాంగులే కావడంతో.. వారిపై అన్ని పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.
మునుగోడు నియోజకవర్గంలో 80 ఏండ్లు పైబడిన వారు 394 మంది, ప్రత్యేక అవసరాల వికలాంగులు 345 మంది ఉన్నారు. ఇక్కడ మొత్తం 739 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలూ పోటీ పడుతుండటంతో వీటికి డిమాండ్ పెరిగింది. ఓటర్లే డబ్బులను డిమాండ్ చేస్తున్నారు. ఇన్ని డబ్బులిస్తే మీ ముందే ఓటు వేస్తామని చెబుతున్నారు. అన్ని పార్టీలతోనూ మాట్లాడి ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికే ఓటు వేస్తున్నారు. ఇప్పటికే పలువురు డబ్బులు తీసుకొని ఓటు వేసినట్టు తెలిసింది. పోలింగ్ సమీపించే కొద్దీ డిమాండ్ పెరుగుతుందని, అప్పుడు ఎక్కువ డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్నారు. మునుగోడులో సోమవారం వరకు 318 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోస్టల్ బ్యాలెట్ కోసం ఎన్నికల సంఘం ఏడు బృందాలను నియమించింది. మొదటి దశలో ఆదివారం నుంచి మంగళవారం వరకు ఆయా బృందాలు ఓటర్ల ఇంటికి వెళ్లి ఓటును నమోదు చేశాయి. రెండో దశలో ఈ నెల 27, 28 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ బృందాలు ఓటర్ల ఇండ్లకు వెళ్లి ఓట్లను నమోదు చేస్తాయి. పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లూ జరుగుతున్నాయని అభ్యర్థులు, వారి ఏజెంట్ల సమక్షంలో ఈవీఎంల కమిషనింగ్ పూర్తయిందని బృందాలు వెల్లడించాయి. 5శాతం మాక్ పోలింగ్ కూడా విజయవంతంగా జరిగిందని పేర్కొన్నారు. మునుగోడులో ప్రచారానికి మరో వారం మాత్రమే ఉంది. నవంబరు 1న ప్రచారానికి తెరపడుతుంది. నవంబర్ 3న పోలింగ్ నిర్వహిస్తారు. 6న ఓట్లను లెక్కించి ఫలితాన్ని ప్రకటిస్తారు.