Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లును రద్దుచేయాలంటూ శుక్రవారం చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తలపెట్టినట్టు తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ప్రకటించారు. అదేరోజు హైదరాబాద్‌లోని మింట్‌కంపౌండ్ నుంచి లక్డికాపూల్ మీదుగా ఖైరతాబాద్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్ వరకు భారీ ప్రదర్శన నిర్వహిస్తామనీ, అనంతరం సదస్సు ఉంటుందని అన్నారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో జేఏసీ నేతలు పి రత్నాకర్‌రావు, సాయిబాబు, శ్రీధర్ తదితరులు పోస్టర్‌ను ఆవిష్కరించారు. మీడియాతో వారు మాట్లాడుతూ విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా, రాష్ట్రస్థాయిలో సదస్సులు నిర్వహించాలన్న నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీవోఈఈఈ) పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో భారీ ప్రదర్శనతోపాటు సదస్సును నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సదస్సుకు ఆలిండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షుడు శైలేంద్ర దూబే, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ సెక్రెటరీ జనరల్ మోహన్‌శర్మ, ఆలిండియా ఫెడరేషన్ ఆఫ్ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ సెక్రెటరీ జనరల్ అభిమన్యు ధన్కర్, మరోనేత అశోక్రావుతోపాటు రైతు ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన నాయకులు సైతం హాజరవుతారని వివరించారు. అంబానీ, అదానీ వంటి కార్పొరేట్ శక్తులకు విద్యుత్ రంగాన్ని కట్టబెట్టేందుకే మోడీ ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లును రూపొందించిందని విమర్శించారు. విద్యుత్‌రంగం ప్రయివేటుపరం అయితే క్రాస్ సబ్సిడీ, ఉచిత విద్యుత్ వంటివి వినియోగదారులకు అందించేందుకు అవకాశం ఉండబోదని చెప్పారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే రైతులపై పెనుభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే విద్యుత్ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
23న చలో ఢిల్లీ
విద్యుత్ సవరణ బిల్లును వెనక్కితీసుకోవాలన్న ప్రధాన డిమాండ్‌తో దేశ వ్యాప్తంగా క్రాంతియాత్రను చేపట్టనున్నట్టు విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ కన్వీనర్ రత్నాకర్‌రావు చెప్పారు. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి ఆ యాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఆ బిల్లును రద్దు చేయాలంటూ మోడీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నవంబర్ 23న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అన్నారు. జంతర్‌మంతర్‌లో నిర్వహించే ఆందోళనకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగులు, ఇంజినీర్లు, కార్మికులు, రైతులు, ప్రజలు పాల్గొంటారని వివరించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పి సదానందం, బీసీ రెడ్డి, వెంకన్నగౌడ్, సుధాకర్‌రెడ్డి, వజీర్, సాయిలు, గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.