Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాటకు జేజేలు థీమ్‌తో హైదరాబాద్‌లో నిర్వహణ
- వాగ్గేయకారులు, కవులతో సమ్మేళనాలు, సెమినార్లు:
- తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో వచ్చే నెల 20, 21, 22 తేదీల్లో తమ సంఘం ఆధ్వర్యంలో లిటరరీ ఫెస్ట్‌ను నిర్వహించబోతున్నట్టు తెలంగాణ సాహితి ప్రధాన కార్యదర్శి కె.ఆనందాచారి ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎస్వీకేలో ఫెస్ట్‌కు సంబంధించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పాటకు పుట్టినిల్లు అయిన నేపథ్యంలో ఈ ఏడాది పాటకు జేజేలు అనే థీమ్‌తో ఫెస్ట్‌ను నిర్వహిస్తామని తెలిపారు. తొలి టాకీ సినిమాకు పాటను అందించిన వ్యక్తి తెలంగాణ రచయితనే అని గుర్తుచేశారు. పలుకే బంగారమాయోనా కోదండపాణి అని భక్తుడు పిలిచిందీ, పల్లెటూరి పిల్లా కన్నీళ్లను తూడ్చిందీ, అగ్నిధారలు కురిపించి రుద్రవీణలు మోగించిందీ..నిరంకుశత్వానికి గోరీ కడతామని నినదించిందీ..ధీరులకు మొగసాలరా! తెలంగాణ వీరులకు కాణాచిరా! అంటూ మాతృగీతికై గొంతెత్తిందీ ఇక్కడి పాటేనననీ, అందుకే ఈసారి తెలంగాణ సాహితీ సాహితీత్యోత్సవం పాటనెత్తుకున్నదని వివరించారు. 20వ తేదీన ప్రసిద్ధ వాగ్గేయకారులు, రచయితలు, సాహితీవేత్తలతో ప్రారంభ సభ ఉంటుందని చెప్పారు. ఆ సభలోనే సాహితీ పరిశోధన విద్యార్థులు కలిసి రాసిన 'సినీ గీత సాహిత్యంపై విశ్లేషణా వ్యాస సంకలనం' ఆవిష్కరిస్తామని తెలిపారు. తెలుగు సాహితీ చరిత్రలో సినిమా పాటల మీద విశ్లేషణా వ్యాసాల సంకలనం తేవడం ఇదే మొదటిసారి అన్నారు. మూడు విభాగాలలో వాగ్గేయ కారుల, రచయితల సమావేశాలు, గాయకుల పరిచయం, పాటలగానం, సంత్కార కార్యక్రమాలు ఉంటాయన్నారు. రెండో రోజు సెమినార్లు ఉంటాయని తెలిపారు. చివరిరోజైన 22న కవిసమ్మేళనం, ముగింపు సభ ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి ఉపాధ్యక్షులు రాంపల్లి రమేశ్, తంగిరాల చక్రవర్తి, సహాయకార్యదర్శి ఎస్కే సలీమా, కోశాధికారి మోహన్‌కృష్ణ, హైదరాబాద్ నగర కార్యదర్శి శరత్ సుదర్శి, నాయకులు రామకృష్ణ చంద్రమౌళి, ఎమ్.రేఖ, పి.రాము, ప్రభాకరాచారి, తదితరులు పాల్గొన్నారు.