Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
- ఎనిమిది ఏండ్లలో ఐదు కోట్ల ఉద్యోగాలు పీకిన మోడీ
- ఆత్మగౌరవంతో బతకాలంటే సామాజిక న్యాయం అవసరం
- మునుగోడులో బీజేపీని బొంద పెట్టడం ఖాయం
- పాషా నరహరి 33వ వర్ధంతి సభలో తమ్మినేని
నవతెలంగాణ- రంగారెడ్డి ప్రతినిధి
భూములను కొనుగోలు చేసి పేదలకు పంపిణీ చేయడం చరిత్రలో చూడలేదని, భూస్వాముల కోరలు పీకి భూములు పంపిణీ చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎనిమిదేండ్లలో ఐదు కోట్ల ఉద్యోగాలు ఊడబీకింద చెప్పారు. సీపీఐ(ఎం) రంగారెడ్డి సారధులు పాషా, నరహరి 33వ వర్ధంతి సభను బుధవారం రంగారెడ్డి జిల్లాలోని జాపాల గ్రామంలో నిర్వహించారు. జిల్లా కార్యదర్శి కాడిగళ్ల భాస్కర్‌తో కలిసి వారికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదలకు భూములు పంపిణీ చేయాలంటే.. కోట్ల విలువ చేసే భూములను కోనుగోలు చేయలేకపోతున్నామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. భూస్వాముల కోరలు పీకి ఆ భూములను పేదలకు పంపిణీ చేసినప్పుడే భూపంపిణీ సాధ్యమవుతుందన్నారు.
రాష్ట్రంలో 16 లక్షల భూమిలేని దళిత కుటుంబాలు ఉన్నాయని చెప్పారు. వారందరికీ భూ పంపిణీ చేయాలంటే భూస్వాముల వద్ద ఉన్న భూములను స్వాధీనం చేసుకోవాలని సూచించారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించకపోగా ఇప్పటివరకు ఐదు కోట్ల ఉద్యోగులను తీసేసిందని చెప్పారు. స్వయం ఉపాధి పథకాలు లేకుండా పోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మగౌరవంతో బతికే సామాజిక న్యాయం అవసరమని, అది భూములతోనే సాధ్యమవుతుందని చెప్పారు. అది కమ్యూనిస్టుల పాలన సాగుతున్న దేశాల్లోనే కొనసాగుతున్నదన్నారు. మరోవైపు దేశంలో అధికారానికి రావడానికి అడ్డదారులు తొక్కుతున్న బీజేపీని తెలంగాణలో అడుగుపెట్టనీయబోమని స్పష్టం చేశారు. మునుగోడులో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీని బొంద పెట్టడం ఖాయమన్నారు. గ్రామ గ్రామాన బీజేపీ అభ్యర్థిని ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు.
విద్యా, వైద్యం, విద్యావంతులకు ఉద్యోగాలు, వారికి కనీస వేతనాలు అమలైనప్పుడే పేదల కొనుగోలు శక్తి పెరుగుతుందన్నారు. తద్వారా ఉపాధినిచ్చే పరిశ్రమల స్థాపన కూడా సాధ్యమవుతుందని సూచించారు. నేడు విద్యా, వైద్యం సేవా రంగం నుంచి వ్యాపార రంగంలోకి మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో జరిగే భూపోరాటాలకు ప్రజలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఎర్రజెండా నాయకత్వంలో జరిగే పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు. జిల్లా కమిటీ సభ్యులు రావుల జంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పగడాల యాదయ్య, మండల కార్యదర్శి శ్యాంసుందర్, జిల్లా కమిటీ సభ్యులు శ్రీనివాసరెడ్డి, కందుకూరి జగన్, మాజీ ఎంపీపీ శ్రీనివాస్ నాయక్, సర్పంచ్ సయ్యద్ నహిదా రహుఫ్, ఎంపీటీసీ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.