Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర..
- నలుగురు ప్రజా ప్రతినిధుల కొనుగోలుకు స్కెచ్
- నోట్ల కట్టలతో పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు
- పూర్తిస్థాయి విచారణ : హైదరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర
- తెలంగాణలో మోడీ, షా ఆటలు సాగవు : మంత్రి వేముల
- బీజేపీవి క్షుద్ర రాజకీయాలు : ఎంపీ రవిచంద్ర
బీజేపీ బరితెగింపు పరాకాష్టకు చేరింది. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటం ద్వారా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలదోసిన ఆ పార్టీ... ఇప్పుడు తెలంగాణలోనూ అదే తతంగానికి తెరలేపింది. ఇతర రాష్ట్రాల్లో అలాంటి చర్యల వల్ల అప్రతిష్ట పాలైనప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా ఇక్కడా ఎమ్మెల్యేల కొనుగోళ్ల పర్వానికి తెరతీసి.. అడ్డంగా బుక్కయింది. నిత్యం లేస్తే జ్ఞానం, శీలం, నైతికత గురించి మాట్లాడే ఆ పార్టీ... టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేద్దామని భావించి అభాసుపాలయింది. చివరకు తాను తీసిన గోతిలో తానే పడి పోలీసులకు అడ్డంగా దొరికింది.
నవతెలంగాణ - మొయినాబాద్,
రంగారెడ్డి ప్రతినిధి, హైదరాబాద్ బ్యూరో
బీజేపీ వేసిన ఈ ట్రాప్‌లో రెడ్ హ్యాండెడ్‌గా బుక్కయిన వారిలో ఒకరు కేంద్ర మంత్రికి అత్యంత సన్నిహితులు కాగా... మిగతా స్వామీజీలు, సింహయాజులు కమలం గూటి పక్షులేనని తేలిపోయింది. మరోవైపు అధికార టీఆర్ఎస్ బీజేపీ కుట్రలు, కుతంత్రాలు, లోబర్చుకునే యత్నాలను తీవ్రంగా ఖండించింది. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా తెలంగాణలో ఎమ్మెల్యేల కొనుగోళ్లు సాగబోవని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఇక్కడ మోడీ, అమిత్ షా ఆటలు సాగబోవని తెలిపారు. బీజేపీ కొనుగోళ్ల కుట్రను భగం చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేలకు సెల్యూట్ చేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి మాదిరిగా తమ పార్టీ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు లొంగబోరని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్‌కు దేశవ్యాప్తంగా వస్తున్న ఆదరణను చూసి ఓర్వలేకే బీజేపీ ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నదని విమర్శించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిఖార్సైన తెలంగాణ బిడ్డలంటూ వ్యాఖ్యానించారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ... బీజేపీ రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి రాజ్యాంగం పట్ల ఎలాంటి గౌరవమూ లేదని అన్నారు. ఇలాంటి క్షుద్ర రాజకీయాలను ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ వల నుంచి బయటపడ్డ నలుగురు ఎమ్మెల్యేలు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిశారు. సంఘటన పూర్వాపరాలను వారు ఆయనకు వివరించినట్టు తెలిసింది.
మునుగోడు ఉప ఎన్నికవేళ తెలంగాణ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు కలకలం సృష్టించాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి అజీజ్ నగర్‌లోని ఫామ్ హౌస్‌లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు దొరికినవారిలో దక్కన్ ప్రైడ్ హౌటల్ యజమాని నందకుమార్ కూడా ఉన్నారు. ఈయన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని సమాచారం. స్వామి రామచంద్రభారతి ఢిల్లీ నుంచి రాగా, సింహయాజులు తిరుపతికి చెందిన వారని పోలీసులు తెలిపారు.టీఆర్ఎస్కు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకే వీరు ఫామ్ హౌస్‌లో దిగారనే పక్కా సమాచారం అందటంతో పోలీసులు వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు తెలిసింది. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు వీరు ప్రయత్నించినట్టు పోలీసులు వెల్లడించారు. రెండు రోజులుగా వీరంతా ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. వీరి నుంచి కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మెయినాబాద్‌లోని ఫామ్‌హౌస్ వద్దకు చేరుకుని పరిశీలించారు. నోట్ల కట్టలతో పట్టుబడిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు.