Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మిషన్ భగీరథతో ఫ్లోరోసిస్ సమస్యకు చెక్..
- పుర పాలకశాఖ మంత్రి కేటీఆర్
- మన్నెగూడలో గొల్లకురుమల, ముదిరాజ్‌ల ఆత్మీయ సమ్మేళనాలు
నవతెలంగాన-తుర్కయంజాల్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వీరుడు దొడ్డి కొమరయ్య జయంతిని అధికారికంగా జరపాలన్న డిమాండ్లను పరిశీలిస్తుందని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. అలాగే, సదర్ పండుగను కూడా అధికారికంగా జరపాలన్న యాదవుల డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేరుస్తుందన్నారు. మునుగోడులో ఫ్లోరోసిస్ సమస్యకు మిషన్ భగీరథ ద్వారా చెక్ పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, ప్రజా సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా ఉందని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ పరిధి మన్నెగూడలోని వేద కన్వెన్షన్ హాల్లో బుధవారం ఏర్పాటు చేసిన గొల్ల కురుమలు, ముదిరాజ్ ఆత్మీయ సమ్మేళనాల్లో కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కరెంటు, తాగు, సాగు నీటి సమస్య తీవ్రంగా ఉండేదని, నేడు పరిస్థితులు పూర్తిగా మారిపోయిన విషయం ప్రజలు యాదుంచుకోవాలని కోరారు. 67 ఏండ్లలో పరిష్కారం కాని అనేక సమస్యలు ఈ ఎనిమిదేండ్లలో సమసి పోయాయని చెప్పారు. కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చే కార్యక్రమం ముదిరాజ్‌ల నుండే ప్రారంభమైందన్నారు. 63 వేల మందికి లూనాలు, మోపెడ్ వాహనాలను అందించడంతోపాటు, ఏటా రూ.110 కోట్లతో రాష్ట్రంలోని చెరువుల్లో 28 కోట్లకుపై చిలుకు చేప పిల్లలను వదిలేందుకు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వాటి ద్వారా వచ్చే ఆదాయంతో ముదిరాజ్‌లే లాభం పొందుతున్నారని చెప్పారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరే ఇతర రాష్ట్రాల్లో అమలు కావడం లేదని చెప్పారు. ముదిరాజ్‌ల సభలో పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, మునుగోడు జడ్పీటీసీ స్వరూపారాణి, చండూరు మున్సిపల్ చైర్పర్సన్ చంద్రకళ, నల్లగొండ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు రవి తదితరులు పాల్గొన్నారు.
సబ్సిడీ డబ్బులు ఫ్రీజ్ అవుతాయన్న ప్రచారం నమ్మొద్దు
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు
రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టిన ఘనత కేసీఆర్‌దేనని, గొల్లకురుమలు కేసీఆర్‌కే మద్దతు ఇవ్వాలని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. యాదవ-కురమ సభలో మంత్రి ప్రసంగించారు. ధర్మం వైపు నిలబడే జాతి గొల్ల కురమ జాతి అన్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా సీఎం కేసీఆర్ గొల్ల కురమల అభివృద్ధికి పాటుపడ్డారని చెప్పారు. వారిని ఆర్థికంగా నిలబెట్టారని తెలిపారు. గొల్ల కురమలలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకంటే ఎక్కువ తెలివి తేటలు ఉంటాయని, గతంలో సీఎం అసెంబ్లీలో చెప్పిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వంలో, చట్టసభల్లో గొల్ల కురమలకు భాగస్వామ్యం కల్పించారని చెప్పారు. టీఆర్ఎస్ పాలనలోనే కురుమలకు, యాదవులకు ఆత్మగౌరవ భవనాలు నిర్మితమవుతున్నాయని చెప్పారు. గొల్ల కురుమలు గొర్రెలు కొనుక్కోవడానికి ప్రభుత్వం డబ్బులు వేయిస్తే.. అవి చేతికి రావని, సీజ్ అవుతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, కానీ వచ్చే నెల ఐదో తేదీ తర్వాత ఎప్పటిలాగే లబ్దిదారులకు నచ్చినచోట గొర్రెలు కొనుక్కునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా బీజేపీ ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను రూ.1200 వందలకు పెంచిందని చెప్పారు. రైతులకు బాయిలకాడ, బోర్లకాడ మీటర్లు పెట్టేందుకు అంగీకరిస్తే రాష్ట్రానికి ఏడాదికి రూ.6 వేలకోట్లు ఇస్తామని కేంద్రం చెప్పిందన్నారు. కానీ సీఎం కేసీఆర్ అందుకు సిద్ధంగా లేరని, తన ప్రాణం పోయినా మీటర్లు పెట్టనిచ్చేది లేదని తెగేసి చెప్పారని తెలిపారు. మునుగోడులో ఓట్ల కోసం పూటకోమాట మాట్లాడే వారిని నమ్మొద్దని, వారికి బుద్ధి చెప్పాలని కోరారు.