Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకోవాలి
- స్కూల్ డ్రైవర్, ప్రిన్సిపాల్‌ను కఠినంగా శిక్షించండి :
ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ డిమాండ్
- విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-సిటీబ్యూరో
పిల్లల భవిష్యత్తు.. చదువును దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే డీఏవీ పాఠశాలను నడిపించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. చిన్నారిపై లైంగికదాడి చేసిన స్కూల్ బస్సు డ్రైవర్, అతనికి సహకరించిన ప్రినిపాల్‌ను కఠినంగా శిక్షించాలని కోరాయి. బుధవారం సైపాబాద్లోని విద్యాశాఖ కమిషనర్ కార్యాలయం ఎదుట పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్.రోహిణికి ఎస్ఎఫ్ఐ, ఐద్వా, డీవైఎఫ్ఐ గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ కార్యదర్శులు కె.అశోక్ రెడ్డి, కె.నాగలక్ష్మి, ఎండీ జావేద్ వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. డీఏవీ పబ్లిక్ స్కూల్‌ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని దానిని యథావిధిగా నడిపించాలని విజ్ఞప్తి చేశారు. చిన్నారిపై లైంగికదాడి జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించడం తోపాటు స్కూల్ గుర్తింపు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం సమంజసమేనని.. కానీ అందులో చదువుతున్న పిల్లల భవిష్యత్తుపై వారి తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారన్నారు. పెద్దమొత్తంలో డీఏవీ పాఠశాలకు ఫీజులు చెల్లించి ఉన్నారని, ఇప్పుడు తిరిగి వేరే స్కూళ్లలో ఫీజులు చెల్లించాలంటే తల్లిదండ్రులపై పెద్ద భారం పడుతుందని చెప్పారు. పాఠశాలను ప్రభుత్వ ఆధీనంలో నడిపించేలా చొరవ చూపాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రయివేటు స్కూళ్లలో బాలికలకు సరైన రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని, నేరచరిత్ర ఉన్నవారిని తప్పించి తిరిగి పాఠశాలలను కొనసాగించాలని కోరారు. స్కూల్లో అంతర్గత ఫిర్యాదు కమిటీలు ఏర్పాటు చేయాలని, సిబ్బందిని నియమించేటప్పుడు వారి వివరాలు పూర్తిగా తనిఖీ చేయాలని తెలిపారు. నగరంలో బాలబాలికలకు సురక్షిత వాతావరణంలో చదువు కొనసాగించేలా ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏ.పద్మ, లక్ష్మి, షాబానా, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.