Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాలుగుసార్లు సర్వే.. దళితుల భూముల వైపు మళ్లింపు
- నష్టపోనున్న ఎకరా రెండెకరాల రైతులు
- ప్రాజెక్టులు, రహదారుల కోసం నిర్వాసితులవుతున్న పేదలు
- 170 కిలోమీటర్లలో ఎక్కువ నష్టపోయేది వారే..
- ఆందోళనలో బాధితులు
నవతెలంగాణ - మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఒక్కటి కాదు నాలుగు సర్వేలు చేశారు సోమశిల సిద్దేశ్వరం జాతీయ రహదారి కోసం అధికారులు.. పెద్దలు.. భూస్వాముల భూములు పోకుండా ఒక సర్వేను మారిస్తే.. మరో సర్వేలో చెరువులు పోతున్నాయని సాకు చూపారు. ఇలా మొదటి మూడింటినీ వివిధ కారణాలు చూపుతూ పక్కనబెట్టి నాలుగో సర్వే చేపట్టి రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపారు.. చివరకు పేద, దళిత రైతుల ఎకరా రెండెకరాల వైపు మళ్లించారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఏ ప్రాజెక్టు చేపట్టినా ఇప్పటి వరకు అత్యధికశాతం నష్టపోయింది పేద రైతులే. ఇప్పుడు జాతీయ రహదారి విషయంలోనూ అదే జరుగనుంది. దీనిపై పెద్దఎత్తున పేదలు ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో సోమశిల సిద్దేశ్వరం బ్రిడ్జి ఏర్పాటుతోపాటు 170 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 20 ఏండ్ల కిందట కొల్లాపూర్ మండలం సింగోటం ఉత్సవాల్లో పాల్గొనడానికి కర్నూల్ నుంచి 60 మంది నాటు పడవలో కృష్ణానదిని దాటుతుండగా ప్రమాదవశాత్తు పడవ మునిగి వారంతా చనిపోయారు. అప్పటి నుంచి సోమశిల సిద్దేశ్వరం దగ్గర బ్రిడ్జి ఏర్పాటు చేయాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలు కోరుతున్నారు. ఇన్నాండ్లకు రూ.1082 కోట్లతో ఇక్కడ కేబుల్ బ్రిడ్జితో పాటు జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది.30 నెలల్లో పూర్తిచేసే ఈ ప్రాజెక్టు కల్వకుర్తి మండలం కుట్ర గేటు నుంచి ప్రారంభమవుతుంది. పాత రహదారిని వెడల్పు చేస్తూ నాలుగు లైన్ల రోడ్డు వేస్తారు. కృష్ణా నదిపై మూడు కిలోమీటర్ల బ్రిడ్జి, 170 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మించనున్నారు. అయితే, బ్రిడ్జి నిర్మాణానికి ఎవరికీ ఎటువంటి అభ్యంతరం లేదు కానీ.. రోడ్డు నిర్మాణాన్ని పేదల భూముల్లో నుంచి వేయాలని నిర్ణయించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడా వ్యక్తులు, భూస్వాముల భూములను వదిలి పేదల భూముల్లో నిర్మించడం ఆందోళన కలిగించే విషయం. తాడూరు, గుంతకోడూరు గ్రామాల మధ్య కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువ దగ్గర నుంచి పంట పొలాల్లోకి రహదారి వస్తుంది. ఇక్కడ సుమారు 15 ఎకరాలు భూమి మొత్తం పేదలదే పోనుంది.
మొదటి సర్వే ప్రకారం తాడూరు గ్రామం మధ్య నుండే రోడ్డు వేయాలని నిర్ణయించారు. కొంతమంది వ్యక్తులు ఇండ్లను తొలగిస్తారని పైరవీ చేసి ఊరి బయటి నుంచి రోడ్డు వేయాలని నిర్ణయించారు. గ్రామ సమీపం నుంచి రోడ్డు వేస్తే పద్వి చంద్రారెడ్డి తదితర పెద్దల భూములు పోతాయని రెండో సర్వే నిలిపేశారు. మూడో సర్వేలో కుంటలు, చెరువులు ఉన్నందున దానినీ వదిలేశారు. నాలుగో సర్వేలో దళితులు, పేద రైతుల భూముల నుంచి రోడ్డు వేయాలని నిర్ణయించారు. తాడూరు, గగ్గలపల్లి గ్రామాలకు చెందిన 200 ఎకరాల భూమి కోల్పోవాల్సి వస్తుంది. ఇందులో దళితులు, వెనుకబడిన వర్గాలకు చెందిన వారి భూములే ఎక్కువగా ఉన్నాయి. తాడూరు గ్రామానికి చెందిన దళిత చెన్నయ్య, బాలస్వామి, రామచందర్, రామచంద్రయ్య, నిరంజన్‌కు 68 సర్వే నెంబర్లో 15 ఎకరాల భూమి ఉంది. 131 సర్వే నెంబర్లో ఎడ్ల సుల్తాన్, ఎనుపూతుల కవితకు చెందిన మూడెకరాలు ఉంది. 127 సర్వే నెంబర్లో సంగమూల నిరంజన్, సంఘముల వెంకటమ్మ, సంఘముల వెంకటయ్య, కురుమూర్తి భూములు ఉన్నాయి. 126 సర్వే నెంబర్లో చింత తిరుపతమ్మ, చింత వెంకటమ్మ, చెన్నయ్య, సత్తి, హనుమంతు, కురుమూర్తి, వెంకటయ్య, తిరుపతయ్యకు చెందిన 20 ఎకరాల సాగు భూమి ఉంది. ఇంకా సుదర్శన్, హుస్సేన,్ అర్జునయ్య, భీమయ్య, ఎండబెట్ట రాములు సాగు భూములు ఉన్నాయి. వీరంతా దళిత సామాజిక తరగతికి చెందిన వారే. వీరి భూములు మొత్తం జాతీయ రహదారి నిర్మాణంలో పోనున్నాయి.
పేదల భూములే..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో అత్యధికంగా దళితులు, గిరిజనులు, బీసీల భూములే లక్ష్యంగా చేసుకొని ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలతోపాటు కోయిల్‌సాగర్, సంగం బండ, భీమా, నెట్టెంపాడు ప్రాజెక్టుల్లో అత్యధికంగా నిర్వాసితులైంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే. ఇప్పుడు సోమశిల సిద్దేశ్వరం జాతీయ రహదారి నిర్మాణంలో మునిగేది కూడా వారే. పక్కనే ఉన్న భూస్వాముల భూములను వదిలేసి దళితుల భూముల వైపే రహదారిని మళ్లించడం పట్ల గ్రామస్తులు, పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పటికే వివిధ ప్రాజెక్టుల పరిధిలో రెండు లక్షల ఎకరాలకుపైగా సాగుభూమి మునిగిపోయింది. ఇందులో 80 శాతం మంది ఎస్సీ, ఎసీ,్ట బీసీల భూములే ఉన్నాయి. తాడూరు గ్రామం మీదుగా జాతీయ రహదారి వెళితే ఎవరికీ నష్టం జరగదు. ముఖ్య నగరాల్లో రహదారుల విస్తరణ జరిగినప్పుడు అనేక ఇండ్లు కూల్చివేస్తారు. ఈ సూత్రం జాతీయ రహదారి నిర్మాణం విషయంలో ఇక్కడ ఎందుకు పాటించడం లేదని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
భూములు ఇవ్వం
దళిత రైతు సత్తి-
తాడూరు గ్రామం
మాకు నాలుగెకరాల సాగు భూమి ఉంది. తాత ముత్తాతల నుంచి ఇదే భూమిని సాగు చేసుకుని జీవిస్తున్నాం. కరువు వచ్చినా కాలమైనా భూతల్లిని నమ్ముకుని ఉన్నాం. పాలేరుగా కష్టపడి పైసా పైసా కూడబెట్టుకుని భూములను కొనుగోలు చేశాం. ఇప్పుడు ఆ భూములను రహదారి పేరుతో తీసుకుంటే మేమెట్లా బతకాలి. భూమికి భూమి ఇవ్వాలి.. లేదంటే మా భూములను వదిలే ప్రసక్తే లేదు.
పెద్దల భూములు వదిలి
కాశన్న - తాడూరు
రెండు, మూడు, నాలుగు సర్వేలు నిర్వహించారు. మొదటి సర్వేలో గ్రామం మధ్య నుంచి రోడ్డు వేయాల్సి ఉంది. రెండో సర్వేలో గ్రామ సమీపం నుంచి, మూడో సర్వేలో చెరువుల మధ్యన రోడ్డు వేయాలని నిర్ణయించారు. మొదటి, మూడు సర్వేల వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదు. రెండో సర్వే ప్రకారం.. రోడ్డు వేస్తే పెద్దల (భూస్వాములు) భూములు పోతాయని.. మూడో సర్వే ఆధారంగా రోడ్డు వేస్తే చెరువులు ఉన్నాయని సాకు చూపుతూ మళ్లీ సర్వే చేశారు. దాంతో పేదలు, ఎకరా రెండెకరాల రైతుల భూములనే లక్ష్యంగా చేసుకొని రోడ్డు వేయాలని నిర్ణయించారు.
పేదల భూముల గుండా రోడ్డు వద్దు
వర్దం పర్వతాలు- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి- నాగర్‌కర్నూల్ జిల్లా
జిల్లాలో నిర్మాణం అవుతున్న ప్రాజెక్టులకు భూముల సేకరణ విషయంలో వివక్ష చూపుతున్న అధికారులు, పాలకులు.. జాతీయ రహదారి విషయంలోనూ అట్టానే వ్యవహరిస్తున్నారు. పక్కనే పెట్టుబడిదారులు, భూస్వాముల భూములు వందల ఎకరాల్లో ఉన్నా వదిలేసి పేదల భూముల గుండా జాతీయ రహదారి నిర్మించడం భావ్యం కాదు. మూడు సర్వేల నివేదికలను వదిలి నాలుగో సర్వే ద్వారా పేదల భూములను గుంజుకోవడం సరికాదు. పేదల భూముల్లో జాతీయ రహదారిని నిర్మాణం నిర్ణయాన్ని వెంటనే విరమించుకోవాలి. లేకుంటే పేదల ఆగ్రహానికి గురికాక తప్పదు.