Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్‌కు సమదూరంలో బీజేపీ, టీఆర్ఎస్ : రాహుల్‌గాంధీ
- నారాయణపేట జిల్లా మక్తల్ నుంచి భారత్ జోడో యాత్ర ప్రారంభం
- సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగిన రాహుల్
- కూలీలు, రైతులు, మహిళలతో మాటామంతి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
''దేశంలో రోజు రోజుకూ హింస, ద్వేషం పెచ్చరిల్లుతున్నాయి..కాంగ్రెస్ పార్టీకి బీజేపీ, టీఆర్ఎస్ సమదూరంలో ఉన్నాయి.. ఆ రెండు పార్టీలు ఒకదానికొకటి సహకరించుకుంటూ డ్రామాలు చేస్తున్నాయి.. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాయి.. అడ్డగోలుగా ఎమ్మెల్యేల కొనుగోలుతో ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేస్తున్నాయి.. అవి రాజకీయ పార్టీలుగా కాకుండా వ్యాపార సంస్థలుగా మారాయి..'' అని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర గురువారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో ప్రారంభమైంది. విద్వేషం చోడో.. భారత్ జోడో నినాదాలతో 26 కిలోమీటర్లు యాత్రం సాగింది.ఈ సందర్బంగా రాహుల్‌గాంధీ పలుచోట్ల రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహిళలను కలిసి వారి సాదకబాదకాలు తెలుసుకున్నారు.. ఆత్మహత్య చేసుకున్న రైతులకు సంబంధించిన కుటుంబాలను పరామర్శించారు.. రైతులకు గుదిబండగా మారిన ధరణిపోర్టల్‌ను అధికారంలోకి రాగానే రద్దు చేసి కౌలు, వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. రైతు ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కంటే తెలంగాణలో రాహుల్ ప్రసంగం భిన్నంగా సాగింది. కౌలు రైతులు పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోతే.. పరిహారం మాత్రం పట్టాదారులకు ఇవ్వడం భావ్యం కాదని రాహుల్ అన్నారు. లౌకిక భారత దేశంలో మత రాజకీయాలతో అధికారంలోకి రావాలని బీజేపీ రెచ్చగొడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భాష, మతం పేరుతో దేశ ప్రజలను విడదీయాలనే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒకేసారి రూ.75 వేల కోట్లు రుణమాపీ చేసిన విషయం గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి రాగానే పంటలకు కనీస మద్దతు ధర ఇస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల దేశానికి శాపంగా మారాయన్నారు. గ్యాస్ సిలిండర్ ధర పెరగడం భారంగా మారిందన్నారు. గ్యాస్ ధర రూ.440 ఉన్నప్పుడు మోడీ విమర్శలు చేశారని, ఇప్పుడు వెయ్యి రూపాయలు అయిందని, దానికి ఆయన ఏమి సమాధానం చెబుతారని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు. జీఎస్టీ వల్ల చిన్న మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని చెప్పారు. వీటన్నింటినీ ఎలుగెత్తి చాటడానికే జోడో యాత్ర చేపట్టానని చెప్పారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు నీచరాజకీయాలకు పాల్పడుతున్నాయని విమర్శించారు. తెలంగాణలో ప్రజలు ఇచ్చే ప్రోత్సాహం నాలో ఎంతో ఉత్సాహం నింపిందన్నారు. మీ అభిమానం ప్రేమతోనే నడుస్తున్న.. ఇది సాధారణ యాత్ర కాదు.. మీరిచ్చిన ఉత్సాహంతోనే నడుస్తున్న.. తెలంగాణలో భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా సాగుతోందని, ఇలాగే ప్రజల దీవెనలు ఉంటే తనలో ఇదే ఉత్సాహం కాశ్మీర్ వరకు ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. పాదయాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీిఎల్పీ నేత భట్టివిక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, వంశీచంద్‌రెడ్డి, మధుయాష్కిగౌడ్, స్థానిక నాయకులు జి.మధుసూదన్‌రెడ్డి, నారాయణపేట జిల్లా అధ్యక్షులు వాకిట శ్రీహరి, రాఘవేందర్, డాక్టర్ విజరు సంజీవ్‌ముదిరాజ్ పాల్గొన్నారు.