Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదనంగా ఆకు, తంబాకు కొనుగోలు
- బీడీలకు వంకలు పెడుతూ వెయ్యిలో 200 కోత
- దయనీయంగా మారిన బీడీ కార్మికుల బతుకులు
- కుటుంబం గడవక ప్రత్యామ్నాయ పనులకు
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. నెలలో పది రోజులు కూడా పని లభించడం లేదు. కేంద్ర సర్కారు కొత్త కొత్త ఆంక్షలు, పన్నులు బాదడంతో యజమానులు కార్మికులకు పని ఇవ్వడం లేదు. గతంలో 20-25 రోజులు పని చేసి ఇంటి ఖర్చులకు చేదోడువాదోడుగా ఉన్న కార్మికులు.. ప్రస్తుతం పని దొరక్క ఇల్లు గడుపుకోవడమే గగనంగా మారింది. దీనికితోడు వెయ్యి బీడీలకు సరిపడా ఆకు, తంబాకు ఇవ్వడం లేదు. కార్మికులు స్వంత డబ్బులతో ఆకు, తంబాకు అదనంగా కొనుగోలు చేస్తున్నారు. ఇక బీడీలు నల్లగా, సన్నగా ఉన్నాయని, మూతులు సరిగా లేవని టేకేదార్లు ఇష్టారీతిన కట్టలు తెంపుతున్నారు. దాంతో కార్మికుల శ్రమ వృథా అవుతోంది. ఓ వైపు సరిపడా పని దొరకడం లేదు. మరోవైపు చేసి పనిలో కోతలు ఉండటంతో చాలా మంది కార్మికులు ప్రత్యామ్నాయ పనులకు మళ్లుతున్నారు.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయం తర్వాత అత్యధికమంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్న రంగం బీడీ రంగం. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కలిసి సుమారు రెండున్నర లక్షల మంది బీడీ కార్మికులున్నారు. గతమెంతో ఘనం అన్నట్టు.. ఒకప్పుడు మహిళలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న బీడీ రంగం.. ప్రస్తుతం కునారిల్లుతోంది. కేంద్ర ప్రభుత్వం బీడీ కట్టలపై పుర్రె గుర్తులు ముద్రించడంతో పాటు బీడీ ఆకు, ఇతర అన్నింటిపై 28 శాతం జీఎస్టీ విధించింది. ఫలితంగా ఈ రంగంలో ఉపాధి కనుమరుగవుతోంది. గతంలో 20-25 రోజుల పని దినాలు లభించగా.. ప్రస్తుతం పది రోజులు పని దొరకడం కూడా గగనమయ్యింది. తెలంగాణ బీడీ అండ్ సిగార్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) తో పాటు పలు సంఘాల పోరాట ఫలితంగా ప్రస్తుతం వెయ్యి బీడీలకు రూ.221 యజమాన్యాలు చెల్లిస్తున్నాయి. ఇందులో పీఎఫ్ రూ.19 జమ చేస్తున్నారు. అయితే వెయ్యి బీడీలకు వేతనం పెరిగినప్పటికీ.. ఆ ప్రయోజనం కార్మికులకు దక్కడం లేదు. ఏ కంపెనీ కూడా పది రోజుల పాటు పని ఇవ్వడం లేదు. పైగా ఇందులోనూ యజమాన్యాలు కార్మికులను మోసం చేస్తున్నాయి. వెయ్యి బీడీలకు గాను కేవలం 700 ఆకు మాత్రమే ఇస్తున్నారు. మరో 300 బీడీలకు కార్మికులు తమ స్వంత డబ్బులతో కొనుగోలు చేస్తున్నారు. ఏదో విధంగా వెయ్యి బీడీలు చుట్టి తీసుకెళ్తే.. టేకేదార్లు ఇష్టారీతిన బీడీ చటాన్ చేస్తున్నారు. బీడీలు నల్లగా ఉన్నాయని, చిన్నగా ఉన్నాయని ఏదోసాకుతో వెయ్యిలో రెండు వందల బీడీలు కట్టలు తెంపేస్తున్నారు. పైగా వర్దీ బీడీలను ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం వెయ్యి వర్దీ బీడీలకు కేవలం రూ.170 మాత్రమే చెల్లిస్తున్నారు. ఇలా ఇటు కార్మికులకు, అటు ప్రభుత్వ పన్నులకు యజమాన్యాలు ఎగనామం పెడుతూ లాభపడుతున్నాయి.
ప్రత్యామ్నాయ పనులు..
బీడీ కార్మికులు తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెడ, నడుము నొప్పితో ఇబ్బందులు పడుతున్నారు. ఇక తంబాకు వాసన వల్ల శ్వాసకోస సమస్యలు ఎదుర్కొంటున్నారు. చాలా మంది కార్మికులు ఈ ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు కూలీ రోజులు తగ్గడం, మరోవైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో చాలా మంది కార్మికులు ప్రత్యామ్నాయ పనులకు వెళ్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీల్లో మహిళలు పని రోజులు తగ్గడంతో ప్రత్యామ్నాయంగా పూలు అల్లుతూ జీవనం సాగిస్తున్నారు. ఇదంతా ఇలా ఉంటే... రిటైర్మెంట్ అయిన బీడీ కార్మికుల పింఛన్ వెతలు విపరీతంగా ఉన్నాయి. దశాబ్దాల పాటు బీడీలు చుట్టి ప్రస్తుతం రిటైర్ అయిన కార్మికులకు నెలకు పింఛన్ రూ.500 కూడా దాటడం లేదు. కనీసం రెండు వేలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.
పది రోజుల పని మాత్రమే ఇస్తున్నారు : విజయ, నిజామాబాద్
బీడీ పని రోజూ దొరకడం లేదు. కార్ఖానాలు బంద్ పెడుతున్నారు. కేవలం పది రోజులు మాత్రమే పని ఇస్తున్నారు. రోజుకు అద్దషేర్ బీడీలు చేస్తున్నాం. వచ్చే డబ్బులు కుటుంబ అవసరాలకు సరిపోవడం లేదు. మేం నెలంతా చేసిన పని ఒక మంచినూనె డబ్బాకు కూడా సరిపోవడం లేదు.
పూలు అల్లుతున్నాం : పద్మ, నిజామాబాద్
బీడీ పని సరిగ్గా దొరకడం లేదు. మరోవైపు కుటుంబ ఖర్చులు రెండింతలయ్యాయి. స్కూల్ ఫీజులు, ఇంటి అద్దెలు కట్టలేకపోతున్నాం. బీడీ పనిని నమ్ముకుంటే బతకలేమని తెలిసిన వారి ద్వారా పూలు అల్లే పని చేస్తున్నాను. సీజన్లో ఈ పని దొరికితే కుటుంబం మూడు పూటల తింటోంది.
బీడీ కార్మికులకు నెల రోజుల పని కల్పించాలి- నుర్జహాన్,
సీయూటీయూ జిల్లా కార్యదర్శి
బీడీ కార్మికులకు సరిపడా పని దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి కార్మికులకు నెల రోజుల పాటు పని కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం ఈ రంగంపై విధిస్తున్న ఆంక్షలు ఎత్తివేయాలి. ఓ వైపు సిగిరేట్లను ప్రోత్సహిస్తూ.. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న బీడీ రంగంపై ఆంక్షలు విధించడం సరికాదు. కార్మికులందరికీ ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి.. లేకపోతే ఆంక్షలు ఎత్తివేయాలి.