Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే ముందరి కాళ్లకు బంధాలు.. దర్యాప్తునకు అడ్డంకులు..
- పైకి మేకపోతు గాంభీర్యం.. లోలోపల హడలుతున్న వైనం
- త్వరలో ఢిల్లీలో కేసీఆర్ ప్రెస్‌మీట్
- బీజేపీ కుట్రలు, కుతంత్రాలపై మాట్లాడనున్న సీఎం
- ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దు : కేటీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంలో అడ్డంగా బుక్కయిన బీజేపీ... ఆ చర్యతో దేశవ్యాప్తంగా పరువును పోగొట్టుకున్నది. అది జాతీయ పార్టీ కాబట్టి... ఇతర రాష్ట్రాల్లోనూ దాని నీచ రాజకీయ సంస్కృతిపై చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో ఆ పార్టీ చేపట్టిన బేరసారాల తతంగం జాతీయ స్థాయిలో దాని మెడకు ఉచ్చుగా మారబోతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రులు... ఈ ఘటన మొత్తం సీఎం కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా, ప్రగతి భవన్‌లోనే స్కెచ్ గీశారంటూ ఒకవైపు చెబుతూనే మరోవైపు న్యాయస్థానాలను ఆశ్రయించారు. కొనుగోళ్ల వ్యవహారంతో తమ పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదు.. కేసీఆర్ ఈ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడే సంబంధిత స్క్రిప్టును రాసుకొచ్చారంటూ చెబుతున్న ఆయా నేతలు... మరిప్పుడు కోర్టులకు పోవటం ద్వారా ముందరి కాళ్లకు బంధాలేయటం, దర్యాప్తునకు అడ్డంకులు సృష్టించటంలో ఆంతర్యమేంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. సీసీ కెమేరాల దృశ్యాలు, ఫొటోలు, ఆధారాలు, ఎఫ్ఆర్ఐలు, కేసులు, కోర్టులు... ఇలా అన్నింటా ఉన్నది బీజేపీకి సంబంధించిన వ్యక్తులేనని తేలిపోవటంతో కమలం పార్టీ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. అందుకే టీవీ చర్చా గోష్టుల్లోగానీ, బహిరంగ సభల్లోగానీ వారి మాటల్లో అస్పష్టత, అస్థిరవాదం గోచరిస్తున్నాయి. మరోవైపు ఈ వ్యవహారానికి సంబంధించి యాదాద్రిలో ప్రమాణం చేద్దామంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... సీఎం కేసీఆర్‌కు సవాల్ విసరటమనేది రాజకీయాల్లో నిలబడేది కాదన్నది వాటి గురించి ఏ మాత్రం పరిజ్ఞానం ఉన్న వారెవరికైనా ఇట్టే తెలిసిపోతుంది. అందుకే బీజేపీ నేతలు మిగతా పార్టీలు.. ముఖ్యంగా టీఆర్ఎస్ దాడిని ఎదుర్కోలేక, ఖండించలేక.. కక్కలేక మింగుతున్న పరిస్థితి నెలకొన్నది. ఈ క్రమంలోనే కమలనాథులు పైకి ఎంత మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినా... లోలోపల మాత్రం హడలిపోతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఈ కొనుగోళ్ల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్... బీజేపీ వ్యవహారశైలిని జాతీయ స్థాయిలో ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఆయన త్వరలోనే ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే గురువారం హైదరాబాద్‌లో నిర్వహించాలకున్న విలేకర్ల సమావేశాన్ని ఆయన రద్దు చేసినట్టు తెలిసింది. కొనుగోళ్ల తతంగం తీవ్ర చర్చనీయాంశం కావటంతో బీజేపీయేతర రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యమంత్రులు, ఆ పార్టీ బాధిత సీఎంలు కేసీఆర్‌కు ఫోన్ చేసినట్టు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. తమ ఉచ్చులో చిక్కిన బేరగాళ్లకు బీజేపీ అగ్రనేతలతో సత్సబంధాలున్నాయనే విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా వారితో చెప్పినట్టు ఆయా వర్గాలు వివరించాయి. దీంతోపాటు నలుగురు ఎమ్మెల్యేలతో బేరగాళ్ల భేటీకి సంబంధించిన ఆడియో, వీడియోల ద్వారా పోలీసులకు అత్యంత కీలక సమాచారం లభ్యమైంది. దాని ఆధారంగా ఇది ఆషామాషీ వ్యవహారం కాదనే నిర్దారణకు వారు వచ్చారు. నిందితుల్లో ఏ1,ఏ2గా ఉన్నవారు కొనుగోళ్లకు సంబంధించి బీజేపీ జాతీయ నేతలతో పదే పదే మాట్లాడారనే ఆధారాలు కూడా లభ్యమైనట్టు తెలిసింది. ఈ విషయాలపై మరింత సమగ్ర సమాచారం, పక్కా ఆధారాలు దొరికిన తర్వాత, వాటిని లోతుగా పరిశీలించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఆ తర్వాతే ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడనున్నారని తెలంగాణ భవన్ వర్గాలు తెలిపాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోళ్ల వ్యవహారంపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం స్పందించారు. ఈ కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున టీఆర్ఎస్ నేతలెవ్వరూ మీడియా ముందు ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని విజ్ఞప్తి చేశారు. 'అడ్డంగా దొరికిన దొంగలు నోటికొచ్చినట్టు మొరుగుతూనే ఉంటారు.. వాటిని పార్టీ శ్రేణులు పట్టించుకోవాల్సిన అవసరం లేదు...' అని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు బీజేపీ బేరసారాల నుంచి బయటపడ్డ ఎమ్మెల్యేలు బీరం హర్షవర్థన్‌రెడ్డి, పైలెట్ రోహిత్‌రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు బుధవారం అర్థరాత్రి నుంచి ప్రగతి భవన్‌లోనే ఉన్నారు. వారితో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు చర్చించినట్టు సమచారం. ఫామ్ హౌజ్‌లో ఏం జరిగిందనే విషయాలపై వారు ఆరా తీసినట్టు సమాచారం.