Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకోవాలి
- మునుగోడులో తగిన బుద్ధి చెప్పాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్‌లోని మొయినాబాద్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిన దుర్మార్గపు చర్యను సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండించింది. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ఆ పార్టీకి వెన్నతోపెట్టిన విద్య అని విమర్శించింది. ఈ మేరకు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో విపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, మార్చేయడం, వినకపోతే ఈడీ, సీబీఐతో దాడులు చేసి బెదిరిస్తున్నదని తెలిపారు. తాజాగా మొయినాబాద్‌లో నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రూ.వందల కోట్లకు డీల్ కుదర్చడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇందుకోసం ఢిల్లీ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన స్వామీజీలను ప్రయోగించడం పట్ల ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇలాంటి కుట్రలు చేయడం బీజేపీకి అలవాటేనని వివరించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్యే రఘునందనరావు కొంతకాలంగా, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారనీ, త్వరలోనే అనుకోని పరిణామాలు జరుగుతాయంటూ మాట్లాడారని గుర్తు చేశారు. దీన్ని బట్టి చూస్తే బీజేపీ కుట్రలకు పాల్పడుతుందనీ, పథకం ప్రకారమే ఎమ్మెల్యేల కొనుగోళ్లను చేస్తుందంటూ అర్థం చేసుకోవాలని సూచించారు. మొయినాబాద్ ఘటనతో ఆ పార్టీ బండారం బయటపడిందని విమర్శించారు. పైగా దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా, ఇదేదో కేసీఆర్ కుట్ర చేసినట్టు, స్కెచ్ గీసినట్లు, ఢిల్లీలో ఉన్న ఆ స్వామీజీలతో ముందుగానే మాట్లాడినట్లు బీజేపీ నాయకులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందనీ, వారి సిగ్గులేని తనం కనిపిస్తున్నదని తెలిపారు. వారి మాటలను తెలంగాణ సమాజం నమ్మే స్థితిలో లేదని పేర్కొన్నారు. విద్వేషాలు పెంచి, కుట్రలు చేసి మునుగోడులో గెలవాలనే తాపత్రాయంతో బీజేపీ ఉందని విమర్శించారు. వాళ్లు తలకిందులు తపస్సు చేసినా ఈ ఎన్నికల్లో గెలవబోరని స్పష్టం చేశారు. మునుగోడులో కమ్యూనిస్టు పార్టీలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు, బీజేపీ కుట్రలకు సంబంధించి ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకుని ఆ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.