Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను బీజేపీ కూల్చేసింది
- రెండు పార్టీలు డెమోక్రసీని జుగుప్సాకరంగా మార్చేశారు..
- ప్రభుత్వ యంత్రాంగాలను నాశనం చేశారు : మీడియా సమావేశంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
''ఆ నలుగురు ఎమ్మెల్యేలు కనబడ్డారు కాబట్టి కొనుగోళ్ల వ్యవహారం బయటపడింది కానీ.. ఇంకా బయటకు రాని వాళ్లు ఎంత మంది ఉన్నారో.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒక వ్యాపారంగా పాలన సాగిస్తున్నాయి.. రెండు పార్టీలు డెమోక్రసీని జుగుప్సాకరంగా మార్చారు.. సర్పంచ్ స్థాయి నుంచి మొదలు పెడితే కింది నుంచి పై వరకు ప్రభుత్వ యంత్రాంగాలను నాశనం చేశారు'' అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్‌లో గురువారం రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్ర ప్రారంభానికి ముందు ఆయన కాంగ్రెస్ నేతలతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు.రాష్ట్రంలో పూర్తి అవినీతి పాలన సాగుతోందని, ఎక్కడ దొంగతనం చేయాల్సిన పరిస్థితి ఉంటే అక్కడ చేసే పార్టీ టీఆర్ఎస్ అని ఘాటుగా విమర్శించారు. రైతులకు అన్నీ చేశామని చెబుతున్నారు కానీ, వారిని మానసికంగా వేధనకు గురిచేస్తున్నారని విమర్శించారు. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ పోటీపడి డబ్బులతో నేతలను కొంటున్నారని, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ అపహాస్యం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ పాలనలోనూ అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. దేశంలో, రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
బీజేపీ జీఎస్టీని తెచ్చి చిన్నాచిత వ్యాపారస్తులకు గుదిబండగా మార్చిందని చెప్పారు. దేశంలో రైతులకు, చిన్న, పెద్ద వ్యాపారులకు కాంగ్రెస్ అండగా ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ల ధర రూ.400 ఉంటే.. బీజేపీ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో రూ.1100 వరకు పెంచిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను, రైతులను కాపాడే బాధ్యత తీసుకుంటామన్నారు. యావత్ భారతదేశం మేల్కొనే విధంగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆలోచించి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి మన బతుకులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. ఈ మీడియా సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్, పార్లమెంటు సభ్యులు ఉత్తంకుమార్ రెడ్డి, మాజీ పార్లమెంట్ సభ్యులు మధు యాష్కిగౌడ్, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.