Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో...
- 41 సీఆర్పీసీ కింద నిందితులకు నోటీసులు ఎందుకివ్వలేదు?
- పోలీసులను ప్రశ్నించిన న్యాయమూర్తి
- ఏసీబీ ప్రత్యేక జడ్జి నివాసంలో నిందితులను హాజరుపర్చిన సైబరాబాద్ పోలీసులు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం రేపిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి చెందిన ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలించటానికి సైబరాబాద్ పోలీసులు పెట్టుకున్న పిటిషన్‌ను ఏసీబీ కేసుల ప్రత్యేక జడ్జి గురువారం రాత్రి తిరస్కరించారు. నిందితులను అరెస్టు చేసే ముందు వారికి 41 సీఆర్పీసీ కింద నోటీసులను పోలీసులు జారీ చేయకపోవటాన్ని జడ్జిలు తప్పుబట్టారు. అంతేగాక, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 8ని ఈ ముగ్గురు ప్రయివేటు వ్యక్తులపై ఎలా నమోదు చేశారని న్యాయమూర్తి దర్యాప్తు అధికారులను ప్రశ్నించారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి చెందిన ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, సింహ్మాయాద్రి స్వామి, నందకుమార్‌లను సైబరాబాద్ పోలీసులు బుధవారం రాత్రి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాత్రి ఈ ముగ్గురిని ఏసీబీ కేసుల ప్రత్యేక జడ్జి నివాసంలో హాజరుపర్చగా నిబంధనల ప్రకారం వీరి అరెస్టు సాగలేదంటూ వీరిని రిమాండ్‌కు పంపటానికి జడ్జి తిరస్కరించారు.
ఇక సైబరాబాద్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను పార్టీ ఫిరాయింపు చేయటం కోసం బీజేపీకి చెందిన ఢిల్లీ వాసి రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ లు తనను గత నెల 26న కలిసి సంప్రదింపులు జరిపారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి బుధవారం మొయినాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేసి బీజేపీలో చేరితే రూ. 100 కోట్లు చెల్లిస్తామని, అంతేగాక కేంద్ర ప్రభుత్వానికి చెందిన కోట్లాది రూపాయల సివిల్ కాంట్రాక్టులను ఇప్పిస్తామనీ, వారిద్దరు తనకు ఎర చూపారని రోహిత్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేగాక, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఏదైనా సంస్థలో చక్కని అధికారిక పదవిని ఇప్పిస్తామని వారు హామీ ఇచ్చారని వివరించారు. అలాగే, మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తాము చెప్పిన దారికి తీసుకొస్తే వారికి ఒక్కొక్కరికి రూ. 50 కోట్లు చెల్లిస్తామంటూ వారు హామీ ఇచ్చారని రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. దాంతో 26వ తేదీ మధ్యాహ్నం మోయినాబాద్‌లోని అజీజ్‌నగర్‌లో గల తన ఫామ్‌హౌజ్‌కు వీరిని రమ్మని చెప్పాననీ, అక్కడే తుది చర్చలు చేద్దామని తెలిపానని ఎమ్మెల్యే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ మేరకు రామచంద్ర భారతీ, నందకుమార్‌తో పాటు తిరుపతికి చెందిన సింహ్మయాజీ స్వామి లు వచ్చారని ఆయన వివరించారు. పార్టీ మారితే బాగుంటుందనీ, లేకపోతే మీపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి, ఈడీ, సీబీఐ లతో విచారణ జరిపిస్తామంటూ బెదిరించారని రోహిత్ వివరించారు. ఈ ముగ్గురు వ్యక్తులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ అనైతిక పోకడలకు ప్రోత్సహించారనీ, అందుకు భారీ మొత్తంలో డబ్బులు ఎరచూపారనీ, అందుకు వీరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తన ఫిర్యాదులో రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. రోహిత్ ఫిర్యాదును పరిశీలించి ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహ్మాయాజి స్వామి, నందకుమార్ లపై క్రైమ్ నెంబర్ 455జ2022, సెక్షన్లు 120(బి), 171(బి), రెడ్విప్ 171(ఇ), 506, రెడ్విప్ 34 (ఐపీసీ) మరియు సెక్షన్ 8 అవినీతి నిరోధక చట్టం 1988 కింద మొయినాబాద్ పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ ను నమోదు చేశారు. ఈ కేసును రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్ స్వీయ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతున్నదని అధికారులు తెలిపారు. కాగా, అరెస్టు చేసిన ఈ ముగ్గురు నిందితులను రాత్రి పది గంటల ప్రాంతంలో సరూర్‌నగర్‌లోని ఫస్ట్ అడిషనల్ స్పెషల్ జడ్జి (ఏసీబీ కేసులు) నివాసంలో సైబరాబాద్ పోలీసులు హాజరుపరిచారు. అనంతరం ఈ ముగ్గురు నిందితులను జడ్జి ఆదేశాల మేరకు చంచల్‌గూడ జైలుకు తరలించారు.
అంతకముందు నిందితులను విచారించిన శంషాబాద్ డీసీపీ
ఇదిలా ఉంటే, నిందితులను జడ్జి ముందు హాజరుపరిచే ముందు గురువారు ఉదయం నుంచి సాయంత్రం వరకు శంషాబాద్ డీసీపీ జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని పోలీసు బృందం ఎమ్మెల్యేల కొనుగోలుకు పాల్పడ్డ ముగ్గురు నిందితులు రామచంద్ర భారతి, సింహ్మయాజీ స్వామి, నందకుమార్‌లను క్షుణ్ణంగా విచారించినట్టు తెలిసింది. ముఖ్యంగా, ఈ కొనుగోళ్ల వ్యవహారం వెనక ఎవరున్నారు? ఎవరు వ్యూహారచన చేశారు? ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి కోసం ఎర చూపిన కోట్ల రూపాయల డబ్బులు ఎవరు సమకూరుస్తున్నారు? మొదలైన కోణంలో ఈ ముగ్గురిని అధికారులు విచారించినట్టు తెలుస్తోంది. ప్రధానంగా ఈ ముగ్గురికి ఎప్పుడు పరిచయం ఏర్పడింది? ఢిల్లీలో వీరికి ఎవరెవరితో సంబంధాలున్నాయి? అనే దిశగా కూడా విచారణ సాగినట్టు విశ్వసనీయంగా తెలిసింది.