Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ తెస్తున్న ఎన్ఈపీతో మహిళా విద్యాభివృద్ధికి నష్టం
- ఉన్నత విద్యకు పేద విద్యార్ధులు దూరమయ్యే ప్రమాదం
- పెరగనున్న డ్రాపవుట్స్
- అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థినులు ఉద్యమించాలి :
ఎస్ఎఫ్ఐ సెమినార్లో జాతీయ అధ్యక్షుడు వి.సి.సాను
నవతెలంగాణ- సిటీబ్యూరో
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యావిధానంతో మహిళా విద్యాభివృద్ధికి నష్టం జరగనుందని ఎస్ఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు వి.పి.సాను అన్నారు. దేశంలో విద్యా అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లోని నిజాం కళాశాలలో గురువారం 'నూతన విద్యా విధానం-ఒక పరిశీలన' అంశంపై ఎస్ఎఫ్ఐ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరా అధ్యక్షతన సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా విపి.సాను మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికే విద్యారంగంలో అసమానతలు పెరిగాయని, ఈ నూతన విద్యావిధానం అమలుతో పాఠశాలలు విలీనమై.. మహిళా విద్య కుంటుపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే దేశంలో మహిళా అక్షరాస్యత 40శాతం ఉంటే.. ఎన్ఈపీ అమలుతో మరింత వెనక్కి వెళ్తుందన్నారు. దేశంలో మహిళా భద్రత కరువైందన్నారు. గుజరాత్లో బిల్కిస్ బానోపై లైంగికదాడి చేసిన నిందితులను విడుదల చేయడం ద్వారా.. మహిళల రక్షణకు బీజేపీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుందని ప్రశ్నించారు. దేశంలో నూతన విద్యావిధానంతో అసమానతలు, వివక్ష పెరగడంతోపాటు ఉన్నత విద్యకు పేద విద్యార్థులు దూరమయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే దేశంలో మహిళావిద్యకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అసమానతలు, వివక్షకు వ్యతిరేకంగా విద్యార్థినులు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎల్.మూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళా విద్యాసంస్థలకు నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని, సమస్యలను పరిష్కారించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సెమినార్లో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీమాన్, శ్రావణి అభిమన్యు, సునీల్, స్టాలిన్, సంధ్య, చరన్శ్రీ, కవితా, జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.