Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీఏలో 90.54 శాతం మందికి సీట్లు
- కాలేజీల్లో చేరేందుకు 31 వరకు గడువు
- ఐసెట్ తుదివిడత సీట్ల కేటాయింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియలో గురువారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఎంసీఏ కోర్సులో ప్రస్తుత విద్యాసంవత్సరంలో వందశాతం సీట్లు భర్తీ అయ్యాయి. 2,865 సీట్లుంటే ఒక్కటీ మిగలకపోవడం గమనార్హం. అంటే ఎంసీఏకు ఎంత డిమాండ్ ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఐసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఎంబీఏ, ఎంసీఏలో కలిపి ఐసెట్‌లో 27,143 సీట్లున్నాయనీ, వాటిలో 24,848 (91.54 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. 2,295 (8.46 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. 254 ఎంబీఏ కాలేజీల్లో 24,278 సీట్లున్నాయనీ, వాటిలో 21,983 (90.54 శాతం) మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. ఇంకా 2,295 (9.46 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు. ఎంబీఏకు సంబంధించి 20 ప్రభుత్వ కాలేజీల్లో 1,485 సీట్లుంటే, 1,375 (92.59 శాతం) మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. 110 (7.41 శాతం) సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. రెండు విశ్వవిద్యాలయ కాలేజీల్లో 184 సీట్లుండగా, 172 (93.47 శాతం) మందికి సీట్లు కేటాయించామని వివరించారు. ఇంకా 12 (6.53 శాతం) సీట్లు మిగిలాయని తెలిపారు. 232 ప్రయివేటు ఎంబీఏ కాలేజీల్లో 22,609 సీట్లుంటే, 20,436 (90.38 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 2,173 (9.62 శాతం) సీట్లు మిగిలాయని వివరించారు. ఎంసీఏకు సంబంధించి 48 కాలేజీల్లో 2,865 సీట్లున్నాయనీ, వాటిలో వందశాతం అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. ఇందులో 17 ప్రభుత్వ కాలేజీల్లో 990 సీట్లుంటే వందశాత, 31 ప్రయివేటు కాలేజీల్లో 1,875 సీట్లకుగాను వందశాతం భర్తీ అయ్యాయని వివరించారు. సరిపోయినన్ని వెబ్ఆప్షన్లు నమోదు చేయని కారణంగా 6,841 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించలేదని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతులు (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 971 మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు తప్పనిసరిగా ఈనెల 30 వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని సూచించారు. లేకుంటే సీట్లు రద్దవుతాయని వివరించారు. ఈనెల 31 వరకు అభ్యర్థులకు కేటాయించిన కాలేజీల్లో రిపోర్టు చేయాలని కోరారు. ఇతర వివరాలకు https://tsicet.nic.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.