Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పుపై కూనంనేని
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేరళలో తొమ్మిది మంది వైస్ చాన్స్లర్లను గంపగుత్తగా రాజీనామా చేయాలంటూ ఆ రాష్ట్ర గవర్నర్ ఆరీఫ్ అహ్మద్‌ఖాన్ ఆదేశాలు చెల్లవంటూ కేరళ హైకోర్టు ఇచ్చిన తీర్పు చెంపపెట్టని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. గవర్నర్ వ్యవస్థలో ఎక్కువ భాగం ఏనాడూ రాజ్యాంగ విధులు, బాధ్యతలను గౌరవించలేదని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రక్షించే బాధ్యతల్లో ఉన్న గవర్నర్ రాజ్యాంగ భక్షకులుగా మారిన చరిత్రను చూస్తున్నామని పేర్కొన్నారు. బీజేపీ అధికార పగ్గాలు చేపట్టిన ఈ ఎనిమిదేండ్ల కాలంలో గవర్నర్ వ్యవస్థ మరింత దిగజారిపోయిందని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నదని తెలిపారు. ప్రజల ద్వారా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు వ్యతిరేకంగా గవర్నర్ వ్యవస్థ పెత్తనం చేస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. కేరళలలో ఉన్న విశ్వవిద్యాలయాల గురించి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వారికి తెలియదని వివరించారు. గవర్నర్ ఎంపీగా ఉన్న సమయంలో బెనారస్ విశ్వవిద్యాలయంలో సెక్యూరిటీ గార్డులు ఐదుగురు విద్యార్థులను కాల్చిచంపారనే నేపథ్యాన్ని కేరళ ఆర్థిక శాఖ మంత్రి కెఎన్ బాలగోపాలన్ వివరించారని గుర్తు చేశారు. దాన్ని నేరంగా భావించిన గవర్నర్ దేశ సమైక్యత, సమగ్రతను, రాజ్యాంగ ఔచిత్యాన్ని భంగం కలిగించిన బాలగోపాలన్ను పదవి నుంచి తొలగించాలంటూ కేరళ సీఎం పినరయి విజయన్‌కు లేఖ రాయడాన్ని తాను తప్పుపడుతున్నట్టు తెలిపారు. ఆ లేఖను ఆమోదించడం సాధ్యం కాదంటూ సీఎం చెప్పడాన్ని సమర్థిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ ఆమోదించి సంతకం చేయాలని సూచించారు. ఏకపక్షంగా నిర్ణయం చేసే అధికారం గవర్నర్‌కు లేదని తెలిపారు. కేరళలో తొమ్మిది మంది వీసీలను ఏకపక్షంగా రాజీనామా కోరిన గవర్నర్ చర్యలను హైకోర్టు తిరస్కరించడం శుభపరిణామమని పేర్కొన్నారు. అదే తరహాలోనే తెలంగాణ, ఢిల్లీ, పుదుచ్చేరి తదితర రాష్ట్రాల గవర్నర్లు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్య క్షంగా సంఘర్షణలకు దిగి పరిపాలనకు ఆటంకపరుస్తున్నారని విమర్శిం చారు. ఇది నిరంకుశ వైఖరికి అద్దం పడుతున్నదని తెలిపారు. అందుకే గవర్నర్ వ్యవస్థను రద్దు చేసి రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యాం, సమాఖ్య స్ఫూర్తిని వికసించేలా చేయాలని డిమాండ్ చేశారు.