Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలిస్టర్ యార్న్‌పై 40 శాతం సబ్సిడీ ఏదీ..?
- గిట్టని కూలీతో తిప్పలు
- 'చేనేత'పై జిఎస్టీ ఎత్తేయాలంటున్న నేతన్నలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
పొద్దస్తమానం పనిచేసినా రోజుకు రూ.150-రూ.190లు మాత్రమే కూలి దక్కుతుందని చేనేత కార్మికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. చేనేత వృత్తి క్రమక్రమంగా అంతరించే పరిస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. చద్దర్లు మార్కెటింగ్ కావడం లేదని టెస్కో అధికారులు ఆర్డర్లు ఇవ్వకపోవడంతో చద్దర్లు నేసే కార్మికులకు పనిలేకుండా పోయింది. దాంతో టెస్కో ఆర్డర్లపైనే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే చద్దర్లు వేసే చాలా మంది కార్మికులు మృతిచెందడంతో రెండేండ్లుగా నేయడం మానివేశారు. అంతేకాదు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో చేనేత కార్మికులకు పాలిస్టర్ యార్న్‌పై 40 శాతం సబ్సిడీ అమలు చేయడం లేదు. పొరుగునున్న కరీంనగర్ జిల్లాలో 2020 నుంచి ఈ సబ్సిడీని అక్కడి అధికారులు అమలు చేస్తున్నా, ఇక్కడ మాత్రం అమలు కాకపోవడం పట్ల చేనేత కార్మికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం చేనేతపై విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు. చేనేత కార్మికులకు రైతుబీమా మాదిరిగానే బీమాను వర్తింపచేయాలని, ఇలాంటి ఎన్నో సమస్యలు.. వరంగల్ నగరం కరీమాబాద్‌లోని 'ది మోడర్న్ వీవర్స్ కోఆపరేటివ్ సొసైటీ'లో పనిచేస్తున్న చేనేత కార్మికులు 'నవతెలంగాణ'తో తమ గోడు వెళ్లగక్కారు.
కరీమాబాద్‌లో మోడర్న్ చేనేత సొసైటీ 1981లో 60 మంది చేనేత కార్మికులతో ప్రారంభం కాగా, త్వరితగతిన 105 మంది కార్మికులకు పెరిగారు. కానీ ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతూ నేడు కేవలం 77 మందికి సంఖ్య పడిపోయింది. ప్రస్తుతం సొసైటీలో కేవలం 15 మంది చేనేత కార్మికులు మాత్రమే పనిచేస్తున్నారు. నిత్యం పనిచేసే కార్మికులు మాత్రం 8 మంది మాత్రమే కావడం గమనార్హం. కాగా, సొసైటీల్లో పనిచేస్తున్న చేనేత కార్మికులకు కేవలం రోజుకు రూ.150-రూ.190 మాత్రమే కూలి పడుతుండటంతో తీవ్ర వ్యయప్రయాసాలకు గురవుతున్నారు.
వరంగల్ నగరంలోని కరీమాబాద్‌లో 32 మంది, కాశిబుగ్గలో 24, కొత్తవాడలో 769, మట్టెవాడలో 17, దేశాయిపేట వీవర్స్‌కాలనీలో 147, డాక్టర్స్ కాలనీలో 181, ఎనుమాముల, ముసలమ్మకుంట, మండీబజార్, రంగశాయిపేట, పద్మనగర్, లేబర్‌కాలనీ, ఎల్బి నగర్ ప్రాంతాల్లో చేనేత కార్మికులున్నారు. వీరంతా ఇతర వృత్తులను చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 60 ఏండ్ల వయస్సు పైబడిన వారు ఇతర వృత్తుల్లోకి పోలేక, ఇండ్లలో ఉత్తగా కూర్చోలేక మగ్గాలపై పనిచేస్తున్నారు. రోజుకు 7-8 మీటర్ల బట్ట నేసినా, కూలి మాత్రం రూ.150కి మించడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కూలి గిట్టుబాటయితలేదు..
మీటర్ ప్యాంట్ బట్టకు రూ.27, షర్ట్ బట్టకు మీటరుకు రూ.23.50 మాత్రమే టెస్కో అధికారులు చెల్లిస్తున్నారు. ప్రతిరోజు కేవలం 7-8 మీటర్ల బట్టను మాత్రమే నేయడం సాధ్యమవుతుంది. ఈ లెక్కన చేనేత కార్మికులు రోజుకు రూ.150-రూ.190ల కూలీ దక్కుతుంది. ఇలా నెలకు సగటున చేనేత కార్మికులు ప్యాంట్ క్లాత్ నేసేవారు రూ.4,750-రూ.5,700 మేరకు పొందుతున్నారు. షర్ట్ క్లాత్ నేసేవారు నెలకు సగటున రూ.4,125-రూ.4,950 మేరకు దక్కుతుంది. ప్రస్తుత జీవన వ్యయాలను పరిశీలిస్తే ఈ సంపాదన ఎలాగూ సరిపోదనేది నిర్వివాదాంశం. ఈ లెక్కన వారి కుటుంబ పరిస్థితులు అగమ్యగోచరంగా మారాయి.
పాలిస్టర్ యార్న్ సబ్సిడీ అమలులో వివక్ష
రాష్ట్ర ప్రభుత్వం పాలిస్టర్ యార్న్‌పై 40 శాతం సబ్సిడీని ఇవ్వనున్నట్టు ప్రకటించింది. 2020 నుంచి పొరుగునున్న కరీంనగర్ జిల్లాలో చేనేత కార్మికులకు పాలిస్టర్ యార్న్‌పై 40 శాతం సబ్సిడీ కింద ఒక్కో చేనేత సంఘానికి రూ.3 లక్షలు విడుదల చేయగా, వరంగల్ జిల్లాలో మాత్రం ఇప్పటికీ ఇవ్వకపోవడం పట్ల చేనేత సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జీఎస్టీ ఎత్తేయ్యాలే.. : కోట రాజయ్య, అధ్యక్షులు, మోడర్న్ చేనేత సహకార సంఘం
చేనేతపై కేంద్ర ప్రభుత్వం విధించిన 5 శాతం జీఎస్టీని వెంటనే ఎత్తివేయాలి. చేనేత కార్మికులకు బతుకు దెరువే కష్టమైతే ఇంకా జీఎస్టీ విధించడం ఘోరం. రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం పాలిస్టర్ యార్న్‌పై సబ్సిడీ ఇస్తున్నట్టు ప్రకటించింది. కరీంనగర్ జిల్లాలో ఒక్కో సంఘానికి రూ.3 లక్షల సబ్సిడీని ఇస్తున్నా, వరంగల్ జిల్లాలో మాత్రం ఇవ్వడం లేదు. వరంగల్ జిల్లాలో కూడా పాలిస్టర్ యార్న్‌పై సబ్సిడీ వెంటనే చెల్లించాలి. చేనేత కార్మికుల బీమాకు కార్మికుల వయస్సును 57 నుండి 70కి పెంచాలి.
కూలీ పడ్తలేదు..
వయసు పిలగానప్పటి నుంచిడి ఈ పని చేస్తానా.. గీ వయస్సులో పనిచేయక తప్పుతలేదు.. తిండిపెడ్తున్నా కొడుకులను అడుగలేం కదా.. గిప్పుడు వేరే పనికిపోలేము .. వచ్చిన పని గిదొక్కటే.. అందుకే రోజు పనిచేత్తాన్నా.. కూలి మాత్రం పడ్తలేదు. రోజుకు రూ.150 గిట్ల పడ్తంది..
- గుజ్జ మల్లయ్య
రైతులకిచ్చినట్టు 'బీమా' ఇయ్యాలే..
రైతులకు ఎంత వయస్సొళ్లు చచ్చిపోయినా బీమా ఇస్తాండ్రు.. గట్లనే చేనేత కార్మికులకు కూడా ఇయ్యాలె గాని మాకు మాత్రం 57 ఏండ్ల వయసున్న సత్తనే ఇత్తమంటే ఎట్లా..? మాకు కూడా రైతులకు ఇచ్చినట్టే బీమా ఇయ్యాలే.. గీ పని 8 ఏండ్లబట్టి చేత్తానా.. వేరే పనులు చేయలేక వచ్చిన గీ పనినే చేత్తానా..
- బేతి వెంకటస్వామి
వృత్తి కనుమరుగైతాంది..
ఇప్పుడైతే గీవీళ్లమే పనిచేస్తనం.. ఏడాదిన్నర కిందట చద్దర్లు కూడా నేసేది.. టెస్కో వాళ్లు చద్దర్లు ఎవ్వరు కొంటలేరు.. వద్దని చెప్పిండ్రు.. చద్దర్లు నేసుడు బంద్ పెట్టినం.. గిప్పుడు ప్యాంట్, షర్ట్ బట్టనే నేస్తున్నం.. టెస్కో వాళ్లు మేం నేసే బట్టకు కూళ్లు కట్టింత్తండ్రు..
- ఆడెపు సత్యనారాయణ