Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్ద నోట్లు రద్దు, జీఎస్టీ వల్ల పెరిగిన నిరుద్యోగం
- అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేస్తాం
- దళితులు సాగుచేసుకుంటున్న భూములకు హక్కు కల్పిస్తాం: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి / మరికల్/ మహబూబ్‌నగర్
దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ చేసి, అటవీ హక్కుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో పాదయాత్రలో భాగంగా శుక్రవారం మహబూబ్‌నగర్ జిల్లా మన్నెంకొండ దగ్గర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ 25 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచితే టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ కారణాల చేత ఆ భూములను గుంజుకోవడం దారుణమన్నారు. అదేవిధంగా జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు ద్వారా చిన్న వ్యాపారులు విలవిల్లాడుతున్నారని తెలిపారు. లక్షలాది మంది నిరుద్యోగులు రోడ్డునపడినా కేంద్ర ప్రభుత్వం పట్టనట్టు ఉందని విమర్శించారు. కేంద్రంలో బీజీపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎక్కడ అభివృద్ధి చేశాయో చూపించాలన్నారు. కేంద్రం అత్యంత ప్రజావ్యతిరేకమైన చట్టాలను తెచ్చినప్పుడు టీఆర్ఎస్ లోకసభలో, రాజ్యసభలో ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. జీఎస్టీ వల్ల చేనేత కార్మికులు, వారి వ్యాపారాలు మూతపడ్డాయని గుర్తు చేశారు. పేదల నుంచి డబ్బులు, భూమి ఎలా గుంజుకొవాలో టీఆర్ఎస్కు బాగా తెలుసని విమర్శించారు. బీజేపీ హింసను ప్రేరేపిస్తే టీఆర్ఎస్ దానికి మద్దతివ్వడం విచారకరమన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సాగే జోడో యాత్రకు యువకులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగుల నుంచి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. ఇప్పటికైనా టీఆర్ఎస్, బీజేపీ ఉచ్చులో పడకుండా ఈ దేశ రక్షణ కోసం యువత కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.
కొనసాగుతున్న రాహుల్ గాంధీ జోడోయాత్ర
కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్ గాంధీ భారత్ జోడో పాదయాత్ర నారాయణపేట జిల్లా మరికల్ మీదుగా శుక్రవారం యాత్ర సాగింది. మరికల్ మండల కేంద్రంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుల మల్లు రవి ఆవిష్కరించారు. మండల పరిధిలోని ఎలిగండ్ల వద్ద నాయకులు, కార్యకర్తలు రాహుల్ గాంధీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం లాల్కోట దేవరకద్ర మీదుగా పాదయాత్రను కొనసాగించారు. పాలమూరులో అడుగుపెట్టాక రాహుల్‌గాంధీ ఇప్పటివరకు బీడీ కార్మికులు, రైతుకూలీలు, రైతులు, కౌలు రైతులు, పోడు రైతులు, గిరిజనులు.. ఇలా పలు రంగాల కార్మికులను కలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. వారి సమస్యలను వింటూ వినతిపత్రాలు తీసుకున్నారు. భూదాన్ పోచంపల్లి నుంచి చేనేత కార్మికులు వచ్చి రాహుల్‌గాంధీని కలిసి వినతిపత్రం ఇచ్చారు.
రాహుల్ వెంట టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జాతీయ నాయకులు జైరాం రమేష్, కాంగ్రెస్ కార్యదర్శి సంపత్ కుమార్, మాజీ మంత్రి చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఒబేదుల కోత్వాల్, సంజీవ్ ముదిరాజ్, నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, జె.మల్లయ్య, గొల్ల కృష్ణయ్య, బి.వీరన్న, పి.సత్తయ్య, మరికల్ మండల యూత్ నాయకులు సూర్య మోహన్ రెడ్డి, హరీష్, పి.రఘు, జి.గోవర్ధన్, రామకృష్ణ తదితరులు నడిచారు.
కార్మికుల హక్కులు కాపాడండి :
రాహుల్ గాంధీకి టీఎఫ్‌టీయూ వినతి
మహబూబ్‌నగర్ జిల్లాలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల హక్కులను కేంద్ర ప్రభుత్వం హరించి వేసిందని, తమ హక్కులను కాపాడాలని టీఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి ఎస్ఎం ఖలీల్ రాహుల్‌గాంధీకి వినతిపత్రం అందజేశారు. భారత్ జోడోయాత్రలో మరికల్ దగ్గర కార్మిక సంఘాల నాయకులు కలిశారు. రాహుల్‌తో కలిసి నడిశారు. జిల్లాల్లో అసంఘటితరంగ కార్మికులు, బీడీ కార్మికులు ఎక్కువగా ఉన్నారని వివరించారు. ఎనిమిది గంటల పని దినం ఎత్తేసి యజమానులకు అనుకూలంగా చట్టాలు తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు ముందుకు సాగడం లేదని వారు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాకు తాగునీరు సాగునీరు అందించే ఉద్దేశంతో చేపట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, సుశీల, తదితరులు పాల్గొన్నారు.