Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆన్లైన్లో ప్రయివేటు స్కూళ్ల వివరాలు!
- అందరికీ అందుబాటులో గుర్తింపు సమాచారం
- ఏయే తరగతులకు అనుమతి ఉందన్నది తెలుసుకునే అవకాశం
- పాఠశాల విద్యాశాఖ సమాలోచన
- వెబ్సైట్లో పొందుపరచనున్న అధికారులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని అన్ని ప్రయివేటు పాఠశాలలకు చెందిన వివరాలను ఆన్లైన్లో ఉంచేందుకు విద్యాశాఖ అధికారులు సమాలోచన చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ గుర్తింపు ఏయే పాఠశాలలకు ఉందన్న సమాచారం పూర్తి సమాచారం అందరికీ అందుబాటులోకి రానుంది. ఏ జిల్లాలో ఏయే ప్రయివేటు పాఠశాలకు ఏయే తరగతుల వరకు గుర్తింపు ఉన్నదో విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు తెలుసు కునేందుకు అవకాశం కలగనున్నది. విద్యార్థులను బడుల్లో చేర్పించేటపుడు దీన్ని పరిశీలించి వారు సరైన నిర్ణయం తీసుకునేందుకు దోహదపడనుంది. ప్రస్తుతం ప్రయివేటు పాఠశాలలకు గుర్తింపు ఉన్నదో, లేదో తెలుసుకునేందుకు అవకాశం లేదు. అందులోనూ ఏయే తరగతుల వరకు అనుమతి ఉన్నదో కనుక్కోవడం మరింత కష్టం. పాఠశాల విద్యాశాఖ ప్రయివేటు పాఠశాలల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో పొందుపరిస్తే ఏ పాఠశాలకు గుర్తింపు ఉన్నదో ముందే తెలుసుకుని పిల్లలను చేర్పించడానికి వీలవుతుంది. ఈ చర్యతో రాష్ట్రంలో గుర్తింపు లేకుండా యధేచ్చగా సాగుతున్న పాఠశాలల ఆగడాలకు చెక్ పడనుంది. బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలకు ఐదో తరగతి వరకే తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఉన్నది. కానీ నిబంధనలకు విరుద్ధంగా ఆరు, ఏడో తరగతి విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారు. దీంతో గుర్తింపు ఉన్న పాఠశాలల వివరాలను ఆన్లైన్లో పొందుపరచాలని విద్యాశాఖ సమాలోచన చేస్తున్నది.
పర్యవేక్షణ కరువు
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, హన్మకొండ, కరీంనగర్ వంటి జిల్లాలు, ముఖ్య పట్టణాల్లో బస్తీ లేదా గల్లీకో ప్రయివేటు పాఠశాల వెలుస్తుంది. ప్లే స్కూల్, కిడ్స్ స్కూల్, ప్రీప్రైమరీ, కిండర్గార్టెన్ స్కూల్ ఇలా వివిధ రకాల పేర్లతో ప్రయివేటు స్కూళ్లను తెరుస్తున్నారు. కానీ వాటికి ప్రభుత్వ గుర్తింపు ఉందో? లేదో? తెలియదు. పాఠశాలలు తప్పనిసరిగా ప్రభుత్వ గుర్తింపు పొందాలన్న నిబంధనలను యాజమాన్యాలు బేఖాతరు చేస్తున్నాయి. ఇంకోవైపు అర్హులైన ఉపాధ్యాయులతో కాకుండా అనర్హులతో బోధన చేయిస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తల్లిదండ్రుల నుంచి విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తూ దోపిడీకి పాల్పడుతున్నాయి. వీటన్నింటిపైనా పాఠశాల విద్యాశాఖ కొరఢా ఝుళిపించనుంది. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చినా గుర్తింపు లేని పాఠశాలలున్నా విద్యాశాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. ప్రయివేటు పాఠశాలలపై విద్యాశాఖ అధికారుల పర్యవేక్షణ కరువైంది. నిబంధనల కనుగుణంగా లేని స్కూళపై చర్యలు తీసుకో కుండా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలతో అధికారులు కుమ్మక్కయ్యారని విద్యార్థి సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 40,898 పాఠశాలల్లో 60 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందులో 30,135 ప్రభుత్వ స్కూళ్లలో 27,68,595 మంది, 10,763 ప్రయివేటు స్కూళ్లలో 32,37,749 మంది పిల్లలు విద్యనభ్యసిస్తున్నారు.
డీఏవీ స్కూల్కు గుర్తింపు పునరుద్ధరణ?
బంజారాహిల్స్ డీఏవీ పాఠశాలకు గుర్తింపును రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ధరించే అవకాశమున్నట్టు తెలిసింది. ఎల్కేజీ బాలికపై లైంగిక వేధింపుల కారణంగా ఆ పాఠశాల గుర్తింపు రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ స్కూల్ యాజమాన్య ప్రతినిధులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. గుర్తింపును రద్దు చేయకుండా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆ పాఠశాలను కొనసాగించాలని విద్యా శాఖను కోరారు. శుక్రవారం హైదరా బాద్లోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో డీఏవీ పాఠశాలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి హైదరాబాద్ డీఈవో ఆర్ రోహిణీ నేతృత్వంలో రాతపూర్వకంగా అభిప్రాయాలను తీసుకున్నారు.
ఇందులో సుమారు 533 మంది తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను రాసి ఇచ్చారు. వారిలో 90 శాతానికిపైగా ఆ పాఠశాలను అక్కడే కొనసాగించాలనీ, గుర్తింపును పునరుద్ధరించాలని కోరారు. ఇంకోవైపు యాజమాన్య ప్రతినిధులు సైతం విద్యార్థులకు భద్రతా చర్యలు తీసుకుంటామనీ, అదనంగా సీపీ కెమెరాలను అమర్చు తామనీ, పాఠశాలను కొనసాగించేందుకు అనుమతివ్వా లంటూ విద్యాశాఖకు విజ్ఞప్తి చేశారు. ఈ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను పంపించారు. శని లేదా సోమవారం దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
డీఏవీ పాఠశాలకు జరిమానా విధిస్తాం : శ్రీదేవసేన
డీఏవీ పాఠశాలకు జరిమానా విధిస్తామని శ్రీదేవసేన ఈ సందర్భంగా తనను కలిసిన విలేకర్లతో చెప్పారు. ఆ పాఠశాలకు ఐదో తరగతి వరకే తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఉందన్నారు. కానీ అనుమతి లేకుండానే ఆరు, ఏడు తరగతుల విద్యార్థులకు పాఠాలను బోధిస్తున్నారని అన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన ఆ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామన్నారు. జరిమానా విధిస్తామనీ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామన్నారు.