Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కదులుతున్న బీజేపీ డొంక.. ఆడియోల్లో అసలు కథ...
- ఇక్కడే కాదు ఢిల్లీలోనూ ఇదే తంతు ొ అక్కడి ఆప్ ఎమ్మెల్యేలకూ ఎర
- సిట్టింగ్‌ల కోసం ఎంతైనా ఇన్వెస్ట్ చేస్తామంటూ 'కొనుగోళ్ల' గ్యాంగ్ స్పష్టీకరణ
- ఏపీ ఎంపీ రఘురామ తరహాలో భద్రత, రక్షణ కల్పిస్తామంటూ భరోసా
- విస్తుగొలుపుతున్న ఆడియో సంభాషణలు
తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు ఎమ్మెల్యేలతో బేరసారాల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ బీజేపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ట్రాప్‌లో పడేద్దామని భావించి... గులాబీ పార్టీ పన్నిన ఉచ్చులో ఇరుక్కుపోయిన కొనుగోళ్ల గ్యాంగ్... 'ఆ నలుగురి'తో మాట్లాడిన మాటలతో కూడిన రెండు ఆడియోలు శుక్రవారం లీకవటంతో విస్తుగొలిపే వాస్తవాలు బయటకొచ్చాయి.
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్న ఆయా సంభాషణలు... ప్రభుత్వాలను కూల్చటంలో సిద్ధహస్తులైన బీజేపీ, దాని వెనకున్న ఆరెస్సెస్ కుట్రలు, కుతంత్రాలను బట్టబయలు చేస్తున్నాయి. పైకి చూడటానికి ఇది కేవలం నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం లాగానే కనిపిస్తున్నప్పటికీ... అసలు టీఆర్ఎస్ సర్కారునే పూర్తిగా అస్థిరపరిచి, కూల్చాలనే దుర్భుద్ధిని బయటపెట్టింది. మొదటి ఆడియోలో రామచంద్ర భారతి, పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య జరిగిన సంభాషణ ఉండగా... రెండో ఆడియో రామచంద్ర భారతి, నందు (ప్రైడ్ హోటల్ యజమాని) మధ్య జరిగిన సంభాషణతో కూడి ఉంది.
ఈ రెండింటి ద్వారా తేలిందేంటంటే... ఇప్పటిదాకా మతాన్ని, మఠాధిపతులను రాజకీయ అవసరాలకు వాడుకున్న బీజేపీ, ఆరెస్సెస్... ఇప్పుడు ఏకంగా లోపాయికారీ ఒప్పందాలకు కూడా వాటిని వాడుకుంటున్నాయి. అందులో భాగంగానే రామచంద్ర భారతిని ఆయా శక్తులు రంగంలోకి దించాయి. మరోవైపు 'పైలెట్ రోహిత్ రెడ్డి రాజీనామా చేస్తే... టీఆర్ఎస్ ప్రభుత్వం నెలరోజుల్లో కూలిపోద్ది...' అంటూ రామచంద్ర భారతి చెప్పటాన్నిబట్టి చూస్తే ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా టీఆర్ఎస్ సర్కారును కూడా కూల్చేసేందుకు పకడ్బందీ వ్యూహం పన్నారనే విషయం విదితమవుతున్నది. సిట్టింగ్ ఎమ్మెల్యేల కోసం ఎంతైనా ఇన్వెస్ట్ (పెట్టుబడి) పెడతామంటూ చెప్పటం ద్వారా దేనికైనా వెనుకాడబోమనీ, ఎంతకైనా బరితెగిస్తామని ఆయన చెప్పకనే చెప్పారు. ఇదే సమయంలో ఇక్కడ టీఆర్ఎస్ ప్రభుత్వంతోపాటు ఢిల్లీలోని ఆప్ సర్కారును కూల్చేందుకు వీలుగా కమలం పార్టీ పెద్దలు భారీ స్కెచ్‌నే వేసినట్టు ఆడియో టేపుల ద్వారా తేలింది. అక్కడ ఆప్‌నకు చెందిన 43 మంది ఎమ్మెల్యేలకు సైతం ఎరేసినట్టు ఆయా సంభాషణల్లో భారతి సెలవివ్వటం గమనార్హం.
మరోవైపు ఈ మొత్తం తతంగంలో బీజేపీ రాష్ట్ర నేతలను ఎక్కడా ఇన్వాల్వ్ చేయటం లేదనీ, మొత్తం బీజేపీ జాతీయ నాయకత్వమే చూసుకుంటారంటూ చెప్పటం కూడా ఆశ్చర్యకర అంశమే. పార్టీ ఫిరాయించిన తర్వాత ఎమ్మెల్యేలకు కావాల్సిన రక్షణ, భద్రతను మొత్తం కేంద్రమే చూసుకుంటుందనే భరోసాను కూడా ఇచ్చారు. ఇందుకు ఏపీకి చెందిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఉదంతాన్ని రామచంద్ర భారతి గుర్తు చేశారు. ఆయనకు 'వై కేటగిరి' భద్రతను కేంద్రం కల్పించిన విషయాన్నీ ప్రస్తావించారు. ఈ విషయాలేవీ ముందుగా తెలియని రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడు నాలుక్కరుచుకుంటున్నారు. తమకే తెలియకుండా రాష్ట్రంలో ఇంత తతంగం జరుగుతున్నదా..? అని వారు అవాక్కవుతున్నట్టు సమాచారం. ఆడియో టేపులు బయటికొచ్చాక మొత్తం ఈ వ్యవహారమంతా ఒక దళారీ బ్యాచ్ నిర్వహించిన చిన్నపాటి మాఫియా డీల్‌ను తలపిస్తున్నదంటూ రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
అందరూ ఊహించిన విధంగానే బేరసారాలకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు రావటం, అందులో అనేకానేక విషయాలు బహిర్గతం కావటంతో బీజేపీ పరిస్థితి ఇప్పుడు ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలాగా తయారైంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు... 'ఇదంతా మాకేం తెలియదు...'అంటూ యాదాద్రిలో ప్రమాణం చేసిన దరిమిలా... 'అవును నిజంగానే మీకేం తెలియదు... మీ ప్రమేయం లేకుండానే మీ పార్టీ ఢిల్లీ నుంచి ఈ తతంగాన్ని నడిపించింది...పాపం, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది...' అంటూ పలువురు సెటైర్లు విసురుతున్నారు. ఏతావాతా తేలిందేమంటే... ఈనెల 26న బీజేపీ కుట్ర భగం కాకపోయుంటే 27న ఢిల్లీలోని తుషార్ (కమలం పార్టీ పెద్ద తలకాయలకు బాగా కావాల్సిన వ్యక్తి) వద్దకు ప్రత్యేక చార్టర్లో వెళదామంటూ బేరగాళ్లు ఎమ్మెల్యేలకు తెలిపారు. అయితే కథ అడ్డం తిరగటంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. ఇలాంటి వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే బీజేపీ కార్యనిర్వాహక కార్యదర్శి బీఎల్ సంతోశ్ (ఆరెస్సెస్‌కు సంఘటన్ మంత్రి-కర్నాటకకు చెందిన వారు) మార్గదర్శనంలోనే ఇదంతా నడిచిందనేది ఆయా సంభాషణల ద్వారా విదితమవుతున్నది. అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చటంలో ఆయనది అందె వేసిన చేయంటూ రాజకీయ పండితులు చెబుతుండటం గమనార్హం.