Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.18 వేల కోట్ల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసింది నిజం కాదా..
- కమ్యూనిస్టులు బలపర్చారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే.. : తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ- మునుగోడు
రాష్ట్రంలో పాగా వేసేందుకు బీజేపీ కుట్రపూరితంగానే స్వామీజీలను మధ్యవర్తులుగా పెట్టుకొని ఎమ్మెల్యేల కొనుగోలుకు సిద్ధమైందని, కానీ బీజేపీ నాయకులు తమకు సంబంధం లేదనడం సిగ్గుచేటని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వేల కోట్ల రూపాయలు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనడం బీజేపీకి కొత్తేమీ కాదని, ఇతర రాష్ట్రాల్లో చేసిన విధంగానే ఇక్కడా చేసేందుకు స్కెచ్ వేశారని చెప్పారు.నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలో శుక్రవారం టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని ప్రసంగించారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గోవా, రాజస్థాన్ రాష్ట్రాల్లో వందల కోట్లు పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిన నీచ చరిత్ర బీజేపీది అన్నారు. రాజ గోపాల్‌రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి పోరాడే శక్తి లేక.. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తెలుసనని చెప్పారు. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు వచ్చినది వాస్తవమేనని తనే బహిరంగంగా ఒప్పుకున్నారని గుర్తుచేశారు. వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. మతోన్మాద బీజేపీని తరిమికొట్టేందుకు కమ్యూనిస్టులు ఒక వ్యక్తిని బలపరిచారంటే రాష్ట్ర ప్రయోజనాల కోసమే అని తెలిపారు. కమ్యూనిస్టులు బలపరిచిన అభ్యర్థిని ప్రజలు ఆదరిస్తారని నమ్మకం మునుగోడు ప్రజలు కల్పించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి బీజేపీ ఆగడాలను ఆపే ధైర్యం లేదన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మతోన్మాద శక్తిపై పోరాడే శక్తి ఉంది కాబట్టే కమ్యూనిస్టులు మద్దతు ఇచ్చాయని చెప్పారు. కమ్యూనిస్టులు ప్రజా శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారన్నారు. మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టే బీజేపీని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మునుగోడు అభివృద్ధి కోసం సీపీఐ(ఎం), సీపీఐ బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
తులం బంగారం కాదు కేజీ ఇచ్చినా బీజేపీ గెలవదు :జూలకంటి రంగారెడ్డి
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయినట్టు.. మునుగోడు ప్రజలను కూడా డబ్బు మద్యంతోపాటు ఓటుకు తులం బంగారంతో కొనాలనుకుంటున్నారని.. కానీ కేజీ బంగారం ఇచ్చినా ఇక్కడ బీజేపీ గెలవదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. మునుగోడులో బీజేపీకి డిపాజిట్ కూడా దక్కదని చెప్పారు. ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా తన వ్యక్తిగత స్వార్థం కోసం కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి తీసుకొచ్చినది ఈ ఉపఎన్నికని చెప్పారు. ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని అన్నారు. ఈ ఎన్నికలు తీసుకొచ్చిన బీజేపీని ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బీజేపీ తెలంగాణలో బలపడితే మతోన్మాద పార్టీగా నయా హిట్లర్‌లాగా వ్యవహరిస్తదని, దేశంలో ప్రజాస్వామ్యం లేకుండా దాడి జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా అక్రమ కేసు లు పెట్టి సీబీఐ, ఈడీలను ఉసిగొలిపి జైలుకు పంపిస్తోందని విమర్శించారు. ఓట్లు కొనడమే కాకుం డా సంతలో సరుకులాగా వందల కోట్లతో ఎమ్మెల్యే లను కొనేందుకు ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నికల్లో టీిఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
మునుగోడు రజాకారులను తరిమికొట్టిన గడ్డ: మల్లు లక్ష్మి
మునుగోడు గడ్డకు.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ద్వారా రజాకారులను తరిమికొట్టిన చరిత్ర ఉందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మల్లు లక్ష్మి అన్నారు. ఈ గడ్డపై బీజేపీ పాగా వేసేందుకు కుట్రలు చేస్తుందని, మునుగోడు ప్రజలు బీజేపీని తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. వేల కోట్లకు అమ్ముడుపోయిన ఆయన్ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బీజేపీని గెలిపిస్తే.. తినే తిండి మీద, కట్టే బట్ట మీద ఆంక్షలు పెడుతుందని, దళితుల మీద దాడులు, మహిళలపై అగత్యాలు జరుగుతాయని వివరించారు. అందుకే ఆ పార్టీని ఓడించేందుకు సీపీఐ(ఎం), సీపీఐ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు తుమ్మల వీరారెడి,్డ నారి ఐలయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పాలడుగు నాగార్జున, చిన్నపాక లక్ష్మీనారాయణ, పాలడుగు పద్మావతి, నాయకులు తుమ్మల పద్మ, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, సోషల్ మీడియా కన్వీనర్ జగదీశ్ పాల్గొన్నారు.