Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టులో రాష్ట్రం వాదన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ బేరసారాలు జరిపిన కేసులో ముగ్గురు నిందితులు హైదరాబాద్ విడిచివెళ్లరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలపాటు హైదరాబాద్‌లో ఉండాలని ఆదేశించింది. నిందితులు తమ చిరునామాలను సైబరాబాద్ పోలీసులకివ్వాలని షరతు విధించింది. ఈ కేసులో నిందితులపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డితో నిందితులు మాట్లాడే ప్రయత్నాలు చేయకూడదని చెప్పింది. రోహిత్‌రెడ్డితో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మాట్లాడే ప్రయత్నం లేదా సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలకు ఒడిగట్టరాదని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ సుమలత శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. హర్యానాకు చెందిన తొలి నిందితుడు రామచంద్రభారతి (సతీష్ శర్మ వి.కె), 2, 3 నిందితులు కె. నందు కుమార్ (నందు) డిపిఎస్కెవిఎన్ సింహయాజిలు రాగల 24 గంటల వరకు హైదరాబాద్ విడిచివెళ్లకూడదని ఆదేశించారు.ఆ ముగ్గురు నిందితులను హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టు రిమాండ్‌కు పంపేందుకు నిరాకరించడంతో పోలీసులు హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై ఏజీ బీఎస్ ప్రసాద్ వాదిస్తూ, హైప్రొఫైల్ కేసులో నిందితులను రిమాండ్‌కు పంపకపోవడం చట్ట వ్యతిరేకమన్నారు. ఆ ముగ్గురు నిందితులు దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై నేర పూరిత కుట్ర జరిగిందన్నారు. అత్యవసరంగా ఈ కేసు విచారణ చేపట్టి నిందితులను రిమాండ్‌కు పంపాలన్నారు. సుప్రీంకోర్టు 2014లో అర్నేష్ కుమార్ కేసులోని ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఏసీబీ కోర్టు వ్యవహరించిందన్నారు. తీవ్ర నేరారోపణలు ఉన్నప్పుడు సీఆర్పీసీలోని 41(1)(బి) ప్రకారం దర్యాప్తు అధికారి నిందితులను అరెస్ట్ చేయవచ్చుననీ, అలాంటి కేసుల్లో నిందితును రిమాండ్‌కు పంపాలన్నారు. ఫాం హౌస్‌లో సీసీ కెమెరాలు ఉన్నాయనీ, రోహిత్‌రెడ్డి వద్ద వాయిస్ రికార్డర్లు కూడా ఉన్నాయని చెప్పారు. దీనిపై సీనియర్ న్యాయవాది వేదుల వెంకట రమణ వాదిస్తూ, ముగ్గురు నిందితులను పోలీసులు కావాలని కేసు నమోదు చేశారనీ, డబ్బు దొరక్కపోయినా ఏదో జరిగిపోయిందనే తీరులో పోలీసులు హడావుడి చేశారని చెప్పారు. ముగ్గురు హైదరాబాద్‌లోనే ఉంటారనీ, ఎక్కడికీ పారిపోబోరని చెప్పారు. ఈ హామీని నమోదు చేసిన హైకోర్టు విచారణను శనివారానికి వాయిదా వేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే కొనుగోళ్ల వ్యవహారంపై దర్యాప్తును సీబీఐ లేదా హైకోర్టు జడ్జితో దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన రిట్‌పై కూడా శనివారం హైకోర్టు విచారణ చేయనుంది.