Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగుల మందుతాగి మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
- పరిస్థితి విషమం, హైదరాబాద్కు తరలింపు
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
పరిశ్రమల కోసం చేపడుతున్న భూసర్వే పనులను అడ్డుకున్నా, అధికారులు పనులు చేస్తుండటంతో ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం పర్కిబండ గ్రామంలో శుక్రవారం జరిగింది. చికిత్సకు తరలించిన రైతు పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్కు తరలించారు. పర్కిబండలో ప్రభుత్వం పరిశ్రమల కోసం 352 ఎకరాల భూమిని సేకరిస్తుంది. గురువారం గ్రామ సభ ఏర్పాటు చేసినప్పటికీ తాము సేద్యం చేసుకునే భూములను ఇవ్వమంటూ రైతులు కరాఖండిగా తేల్చి చెప్పారు. శుక్రవారం రెవెన్యూ అధికారులు, సర్వే ఇన్స్పెక్టర్ సుజాత ఆధ్వర్యంలో తహసీల్దార్ భిక్షపతి సర్వే పనులను ప్రారంభించారు. దాంతో రైతులు సర్వే పనులు ఆపేయాలంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ పనులు చేపడుతుండటంతో గ్రామానికి చెందిన మహిళా రైతు తిగుల్ల శ్యామల పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే గ్రామ నాయకులు మంచ శ్రీరాం ఆమెను తూప్రాన్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరబాద్లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. దాంతో రెవెన్యూ అధికారులు సర్వే పనులను ఆపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.