Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బయటకు వస్తున్న నోట్ల కట్టలు
- పట్టుబడుతున్న కోట్లాది రూపాయలు
నవతెలంగాణ- సిటీబ్యూరో
రాష్ట్రంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా హైదరాబాద్ నగరంలో పచ్చనోట్లు బయటకు రావడం సాధారణంగా మారిపోయింది. దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికలతోపాటు ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో సైతం హైదరాబాద్‌లో డబ్బుల సంచులు బయటకు రావడం, వాటిని తరలిస్తున్న వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మునుగోడు ఎన్నికల నేపథ్యంలో నగరం, శివారు ప్రాంతాల్లో నోట్ల కట్టలు తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. కొద్ది రోజుల కిందట హైదరాబాద్ శివార్లలోని నార్సింగి రోటరీ వద్ద వాహనాల తనిఖీల్లో రెండు కార్లలో తరలిస్తున్న కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నగదును మునుగోడు ఉపఎన్నిక కోసం తరలిస్తున్నట్టు విచారణలో తేలింది.
పంజాగుట్టలో, నారాయణపురంలో పట్టుబడిన నగదు
శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ఓ వాహనంలో రూ.70 లక్షలను పోలీసులు గుర్తించారు. ఆ మొత్తానికి సంబంధించిన రసీదు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న వాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే, మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో భారీగా నగదు లభించింది. అంతారం గేటు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా రూ.5.60 లక్షలు పట్టుబడ్డాయి. నగదును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
ప్రత్యేక చెక్‌పోస్టులు.. మూడంచెల భద్రత
మునుగోడు ఉప ఎన్నిక పోలీంగ్ సమీపిస్తుండటంతో పోలీసులు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆ నియోజకవర్గానికి వెళ్లే దారుల్లో కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలో వందకుపైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ఒక్కో చెక్‌పోస్టు వద్ద ఇద్దరు ఎస్‌ఐలతోపాటు 10మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. మండలాల సరిహద్దులతోపాటు గ్రామ గ్రామాన చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. పోలీస్ ఉన్నతాధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చౌటుప్పల్ మండలంలోని లింగోజీగూడా, జైకేసారం, నెలిపట్ల, లింగన్నగూడెంతోపాటు తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక దృష్టి సారించారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు. ఎలాంటి అనుమానం వచ్చినా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.