Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ ఏసీపీ భాస్కర్ వేముల
- ఎయిర్‌పోర్టులోని డెకథ్లాన్ వద్ద 'డ్రగ్స్ సే టు నో' అవగాహన
- హైదరాబాద్ టు కోయంబత్తూర్ 1000 కేఎం సైకిల్ రైడ్ ప్రారంభం
నవతెలంగాణ- శంషాబాద్
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారని శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు పోలీస్ స్టేషన్ ఏసీపీ భాస్కర్ వేముల అన్నారు. పోలీస్ అమరవీరుల దినోత్సవంలో భాగంగా ఈ నెల 21 నుంచి 28వ తేదీ వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా దేశంలో పెరిగిపోతున్న మాదకద్రవ్యాల వినియోగం యువతపై పడుతున్న ప్రభావం గురించి 'డ్రగ్స్ సేటు నో' నినాదంతో శుక్రవారం శంషాబాద్ ఎయిర్‌పోర్టులోని డెకథ్లాన్ స్పోర్ట్స్ హౌస్ వద్ద విద్యార్థులకు యువతకు అవగాహనా సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర హాజరు కావాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేక కారణాల రీత్యా ఆయన హాజరు కాలేదు. ఈ సందర్భంగా పాల్గొన్న ఏసీబీ భాస్కర్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం వల్ల మానవ శరీరంలో అతి ముఖ్యమైన మెదడు పనితనం తగ్గిపోయి, ఆత్మన్యూనతా భావం పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది, మన దేశంలో 30 వేల మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఒకసారి డ్రగ్స్‌కు అలవాటు పడితే అది జీవితంపై విరక్తి చెందిన విధంగా తయారు చేస్తుందని, కుటుంబానికి, వ్యక్తిగతంగా ఎంతో హాని చేస్తుందని తెలిపారు. తోటి వారు డ్రగ్స్ వినియోగం చేస్తే అది మొత్తం కలుషితం చేస్తుందని, అలాంటి సంఘటనలు ఏవైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మదకద్రవ్యాల జోలికి వెళ్లకుండా యువత జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ప్రత్యామ్నాయ క్రీడలు, వ్యాయామం, చదువు, ఉన్నత అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్.శ్రీనివాస్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ బోస్ కిరణ్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, ఎస్ఐలు రాజ్‌కుమార్, బి. భానుమతి, తదితరులు పాల్గొన్నారు.
42 గంటల్లో 1000 కిలోమీటర్లు సైకిల్ రైడ్
సంస్మరణ దినోత్సవంలో భాగంగా తమిళనాడుకి చెందిన విష్ణువర్ధన్ చేపట్టిన 1000 కిలోమీటర్ల సైకిల్ రైడ్‌ను ఏసీపీ భాస్కర్ వేముల డెకథ్లాన్ వద్ద ప్రారంభించారు. ఆయన హైదరాబాద్ నుంచి కోయంబత్తూర్‌కు సైకిల్ రైడింగ్ చేసుకుంటూ 42 గంటల్లో గమ్యస్థానం చేరుకుంటారని తెలిపారు. విష్ణువర్ధన్‌ను ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు సాగాలని ఏసీపీ పిలుపునిచ్చారు.