Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
మునుగోడు ఉప ఎన్నికలో భాగంగానే ఈనెల 31న నిర్వహించాలనుకున్న బీజేపీ బహిరంగ సభ రద్దైనట్టు తెలిసింది. రాష్ట్రంలో ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ పెద్దల పాత్ర ఉందని, ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా ప్రచారం కోసం వచ్చి ఏ సమాధానం చెప్పాలో తెలియక సభను రద్దు చేసుకున్నట్టు తెలిసింది. అంతేగాకుండా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షులు నడ్డా 2016లో కేంద్ర ఆరోగ్య మంత్రి హోదాలో చౌటుప్పల్ కేంద్రానికి వచ్చి ఫ్లోరోసిస్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. కానీ కేంద్రం ఆ హామీని తుంగలో తొక్కింది. ఇంత వరకు రూపాయి కూడా బడ్జెట్ కేటాయించలేదు. ఈ ఎన్నికలలో గెలిస్తే నియోజకవర్గాన్ని కేంద్రం నిధులతో అభివృద్ధి చేస్తామని చెపుతున్న బీజేపీ నేతల మాటలకు విలువ లేదని తెలిసే విధంగా ఓ గ్రామంలో నడ్డా దిష్టిబొమ్మకు చితి పేర్చారు. దానికి ప్రతీకారంగానే ఆయనను తీసుకొచ్చి సభలో మాట్లాడించాలనే ప్రయత్నం బీజేపీ చేసింది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జరిగిన పరిణామాలతో ఆ సభను రద్దు చేసుకున్నారని సమాచారం.