Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు తరాలుగా సాగు చేస్తున్నం
- భూములు లాక్కుంటే మా బతుకులేం కావాలి
- టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఎ పేరిట లేఅవుట్లు
- పరిశ్రమలకు 583 ఎకరాల పంట భూముల కట్టబెట్టే కుట్ర
- భూసేకరణను అడ్డుకుంటున్న రైతులు
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
'ప్రాణాలు పోయినా సరే మా భూములిచ్చేదిలే.. భూమే జీవనాధారంగా బతుకుతున్నం.. మూడు తరాలుగా సాగు చేస్తున్నం. రెక్కలు ముక్కలు చేసి పడావు భూముల్ని పంట పొలాలుగా మార్చుకున్నం. బోర్లు, బావులు తవ్వుకున్నం. పండే పంటతో బతుకు బండి లాగుతున్నం. మా గరీబోళ్ల పొట్టలు గొట్టి కంపెనీలకు కట్టబెట్టడం ఏమి ధర్మం. ఎకరం భూముందనే మా దీమాను దెబ్బతీస్తూ భూములు లాక్కుంటే మా బతుకులేం కావాలి. కంపెనీల కోసం మా బతుకుల్ని వీధిపాలు చేయొద్దు' ఇదీ..! జిన్నారం గ్రామ రైతుల ఆవేదన.
సంగారెడ్డి జిల్లా జిన్నారంలో పేదలైన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రభుత్వం భూముల్ని పంచింది. రెండు తరాలుగా ఆ భూములే జీవనాధారంగా బతుకుతున్నారు. సర్వే నెంబర్ 1లో ఉన్న 421 ఎకరాలను పంపిణీ చేసి లావుణీ పట్టాలిచ్చారు. రెక్కలు ముక్కలు చేసుకుని రాళ్లు, రప్పలు, చెట్లు, గుట్టల్ని చదును చేసి పంట పొలాలుగా మార్చుకున్నారు. అప్పులు చేసి బోర్లు, బావులు తవ్వుకున్నారు. 200 ఎకరాల్లో వరి పంట పండుతోంది. మరో 200 ఎకరాల్లో కందులు, జొన్న, ఉలవలు, పత్తి వంటి మెట్ట పంటలు వేస్తున్నారు. సర్వే నెంబర్ 376లో ఉన్న 162 ఎకరాలను కూడా పేదలకు పంచారు. రెండు చోట్ల కలిపి 583 ఎకరాల్ని ఒక్కొక్కరికి ఎకరం, రెండు ఎకరాల చొప్పున లావుణీ పట్టాలిచ్చారు. భూముల్ని సాగులోకి తెచ్చుకున్నాక పట్టాదారు పాసుపుస్తకాలపై బ్యాంకుల్లో పంట రుణాలు, స్వయం ఉపాధి లోన్లు ఇచ్చారు. రైతు బంధు డబ్బులిస్తున్నారు. ప్రస్తుతం 121 మంది రైతుల పేరిట ధరణి పోర్టర్లో పట్టాలున్నాయి. మరో 75 మంది పట్టాదారులైన రైతులు చనిపోయారు. వారి వారసులు సాగు చేసుకుంటున్నారు. వారి పేరిట పట్టా చేయాలని దరఖాస్తులు చేసుకున్నారు. భూముల్ని కంపెనీలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే స్థానిక తహసీల్దారు వారికి పౌతీ చేయకుండా తిప్పుకుంటున్నారన్న విమర్శలున్నాయి. మరో 20 మంది రైతులు ఎన్నో ఏండ్లుగా భూముల్ని సాగు చేస్తూ కాస్తులో ఉన్నా పట్టాలివ్వలేదు.
రూ.1749 కోట్ల విలువ చేసే భూములకు ఎసరు
జిన్నారం మండల కేంద్రం కావడంతో చుట్టూ పరిశ్రమలు విస్తరించాయి. దాంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఎకరం ధర రూ.3 కోట్లుంది. ప్రభుత్వం తీసుకునే 583 ఎకరాలకు మార్కెట్ ధర లెక్కిస్తే రూ.1749 కోట్ల వరకు ఉంటుంది. ఇంతటి విలువైన భూముల్ని అప్పనంగా తీసుకోవడం ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇన్నాండ్లు తమకున్న ఎకరం, రెండెకరాల భూమే తమ వారసులకు చరాస్తిగా మిగులుతుందని ఆశపడితే, తమ బతుకుల్లో మట్టికొట్టేలా భూముల్ని గుంజుకుంటున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.. దాంతో రెండు వందలకుపైగా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తమ భూముల్ని ఇవ్వబోమంటూ ఇప్పటికే అనేక సార్లు అడ్డుకున్నారు. కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. కనీసం భూముల్ని తీసుకుంటున్న ప్రభుత్వం గింత పరిహారం ఇస్తమని చెప్పట్లేదు. లావుణీ పట్టాలు కావడంతో ఏమీ ఇవ్వరని బెదిరిస్తున్నారని వాపోతున్నారు.
మా ప్రాణం పోయినా భూములివ్వం జంగోని దుర్గయ్య, రైతు
మేమిద్దరం అన్నదమ్ములం. మాకు 3.39 ఎకరాలుంది. వరి పంటేసినం. ఆ పంటే జీవనాధారం. మా కుటుంబంలో పది మందిమి. మాకు మరే ఆస్తుల్లేవు. కష్టపడి భూమిని చదును చేశాం. రెండు బోర్లు వేసినం. మాకు ప్రభుత్వమే భూమి ఇచ్చి ఉండొచ్చు. కానీ..! 45 ఏండ్ల్లుగా భూమి మాదనే దీమాతో బతుకుతున్నం. కష్టనష్టాలొచ్చినా అమ్ముకోకుండా ఉంచుకున్నం. ఇప్పుడు కంపెనీలకిస్తమని గుంజుకుంటే ఎట్ల ఊరుకుంటం. మా ప్రాణాలు పోయినా సరే భూమి ఇచ్చేదిలే.
50 ఏండ్లుగా భూమే ఆధారంగా బతుకుతున్నం: శాంతం లింగమయ్య, జిన్నారం రైతు
మా మామ శాంతం అంజనేయులుకు భూమి ఇచ్చిండ్రు. ఆయన నుంచి నాకు వచ్చింది. ఇదే భూమిని సాగుచేసి బతుకుతున్నం. పంట పొలం లాక్కుంటే మా బతుకులేం కావాలి. భూమి గుంజుకుంటే మా కుటుంబమంతా ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరే దిక్కులేదు.
న్యాయ పోరాటం చేస్తం: భాస్కర్, మాజీ ఎంపీటీసీ
రైతుల పంట పొలాల్ని తీసుకోవడం అన్యాయం. రైతుల పక్షాన న్యాయ పోరాటం చేస్తం. ఇప్పటికే న్యాయస్థానాన్ని ఆశ్రయిం చాం. న్యాయం జరుగుతుందని నమ్ము తున్నాం. బలవంతంగా భూముల్ని గుంజుకుంటే అడ్డుకుంటాం. కొందరు నాయకులు రైతుల్ని ప్రలోభాలకు గురి చేస్తున్నారు. మధ్యవర్తుల లాభాల కోసం వందల కుటుంబాలను రోడ్డుపాలు చేయడం తగదు. భూములు తీసుకోవాలను కుంటే ఎకరా తీసుకుంటే 20 గుంటలు పట్టా చేయాలి. లేదంటే మార్కెట్ ధరలో సగం చొప్పున ఎకరానికి కోటిన్నర నష్టపరిహారమివ్వాలి.
ప్రజలకు మేలు జరగాలి: లావణ్య, ఎంపీటీసీ 2, జిన్నారం
ప్రజలకు మేలు జరిగే పనులు చేయాలి. జిన్నారంలో ఎక్కువ మంది రైతులు భూములు పోతాయనే భయంతో ఉన్నారు. వారికి నష్టం జరగకూడదు. ఎవరైనా సంతకాలు చేసిన రైతులుంటే వారివి తీసుకోవచ్చు. కానీ..! ఇష్టపడని రైతుల్ని బలవంతం చేయొద్దు. రైతులకు నా సంపూర్ణ మద్దతు ఉంటది.
కంపెనీల కోసం 583 ఎకరాలు
జిన్నారం మండల కేంద్రంలో 421 ఎకరాలతో పాటు మరో 162 ఎకరాలు కలిపి 583 ఎకరాల పంట పొలాల్ని తీసుకుంటున్నారు. మాటైనా చెప్పకుండా నోటిఫికేషన్ జారీ చేశాయడమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారు. భూముల్ని టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ లేఅవుట్లుగా అభివృద్ధి చేశాక ఆయా కంపెనీలకు కేటాయిస్తారని అధికారులు చెప్తున్నారు. రెండేండ్లుగా జిన్నారం భూములపై కన్నేసిన పలు కంపెనీలు ప్రభుత్వంపై వత్తిడి తెచ్చి టీఎస్ఐఐసీ, హెచ్ఎండీఏ లేఅవుట్ల పేరిట రైతుల నుంచి గుంజుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇప్పటికే మైలాన్, అరవిందో, మరో కంపెనీ వాళ్లు జేసీబీ యంత్రాలతో భూముల్లోకి రాబోతుండగా రైతులు అడ్డుకున్నారు. తాము నిలదీయడంతో స్పందించిన అధికారులు 'ప్రభుత్వమే ఇచ్చింది. ప్రభుత్వమే తీసుకుంటది. మిమ్ముల్ని ఏందీ అడిగేది' అంటూ భయపెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణపై తహసీల్దారు థశరద్ను సంప్రదించగా సాగులో లేని భూముల్ని తీసుకుంటామన్నారు.