Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పంటలను ధ్వంసం చేస్తున్న వానరులు
- ఏటేటా గుంపులు పెరుగుతున్నా సర్వేలకే అధికారులు పరిమితం
పత్తి కాయలు కొరికి వేస్తున్నాయి.. వేరుశనగ విత్తనాలు పెకిలించి తింటున్నాయి.. వరి కంకులను పీకిపెడుతున్నాయి.. మిరప కాయలనూ తెంచి పడేస్తున్నాయి.. ఇవి..కోతుల చేప్టలతో రైతులు పడుతున్న తిప్పలు. చీడపీడలను మించిన కోతి చేష్టలతో విసిగివేసారిన రైతులు కొన్ని పంటలకు ఉద్వాసన పలుకుతున్నారు. చివరికి పామాయిల్ మొక్కలు నాటినా వాటినీ పీకేస్తున్నాయి. రైతులు సమిష్టిగా.. సంఘాలుగా ఏర్పడి కోతుల నియంత్రణకు రూ.లక్షలు వెచ్చించి పడరాని పాట్లు పడుతున్నారు. అయినా వేగలేక నిరసనలు, ఆందోళనలు తెలుపుతున్నారు.
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం మేడిదపల్లి గ్రామానికి చెందిన ముదిరెడ్డి విష్ణు మూడు ఎకరాల పత్తి, రెండు ఎకరాల వరి వేశాడు. పత్తి తీత, వరి కోత దశలో ఉంది. విష్ణు చేను పక్కనే గుట్టలు ఉండటంతో వేలాది కోతుల గుంపులుగా ఉదయం ఆరు మొదలు రాత్రి 7 గంటల వరకూ తరచూ పంటలపై దాడులు చేస్తున్నాయి. ఒకప్పుడు వేరుశనగ వేసే రైతు ఇప్పుడు ఆ పంటనే వదిలేశాడు. కారణం కోతుల బెడద. విష్ణుతో చేను పరిసరాల్లో ఉన్న ఓ పదిమంది రైతులు సంఘటితమై వంతులవారీగా పంటలకు రక్షణగా ఉంటున్నారు. అయినప్పటికీ 20శాతం వరి, 30 శాతం పత్తి పంటను కోతులు ధ్వంసం చేశాయి.
కొణిజర్ల మండలానికి చెందిన మరో రైతు సంక్రాంతి నర్సయ్య 15 ఎకరాల్లో వరి వేశాడు. మరో 15 ఎకరాల్లో వివిధ పంటలు వేసేవాడు. కోతులతో వేగలేక ఆ పంటలన్నింటినీ వదిలేసి 15 ఎకరాల్లో పామాయిల్ మొక్కలు నాటాడు. అటు వరి కంకులు, ఇటు పామాయిల్ మొక్కలను కోతులు పీకి పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మండలంలోని సింగరాయపాలెం రైతులు తెలంగాణ రైతుసంఘం ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం ఎదుట శుక్రవారం ఆందోళన నిర్వహించారు.
నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్ జిల్లాల సరిహద్దుల్లోని గుమ్మిరియాల్ అనే గ్రామం ఒకప్పుడు వేరుశనగ పంటకు ప్రసిద్ధి. రూ.లక్షలు వెచ్చించినా కోతుల నియంత్రణ సాధ్యం కాకపోవడంతో ఆ గ్రామస్తులు ఇప్పుడు ఆ పంటను వేయటమే మానేశారు.
పరిషత్ సమావేశాల్లోనూ కోతులపైనే చర్చ
''కోతులు ముట్టని పంట ఉంటే చెప్పండి... లేదంటే కోతులనైనా నియంత్రించండి...'' అంటూ వానర బాధిత రైతులు వ్యవసాయ అధికారులను వేడుకుంటున్నారు. చివరికీ కొన్నిచోట్ల బాధిత సంఘాలనూ ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలపై సమీక్షించే దిశ, జిల్లా పరిషత్, పలు మండల పరిషత్ సమావేశాల్లోనూ కోతుల సమస్యను ప్రజాప్రతినిధులు ఏకరువు పెడుతున్నారు. ప్రతియేటా ఖమ్మం రూరల్ మండలం చింతపల్లికి నవంబర్, డిసెంబర్లో సైబీరియా కొంగలు సైతం కోతుల ధాటికి నిలువలేక రాకుండా పోయాయని గతేడాది ఆ మండల పరిషత్ సమావేశంలో చర్చించారు.
రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతుండటంతో కోతుల నియంత్రణకు 2015లో ప్రభుత్వం రూ.55 లక్షలు కేటాయించింది. కోతులను పట్టుకుని అడవిలో వదిలిపెట్టాలని నిర్ణయించింది. కానీ అది ఏమాత్రం ఫలితమివ్వలేదు.
పలు పంచాయతీలు శిక్షణ పొందిన కొండముచ్చులను తీసుకొచ్చినా వాటిపైనా కోతులు తిరగబడుతున్నాయి. కొందరు రైతులు సంఘటితమై కోతులు పట్టేవాళ్లను తీసుకొస్తున్నారు. కోతికి రూ.100 చొప్పున చెల్లించి పట్టించినా.. వారం, పదిరోజులకే తిరిగి వస్తున్నాయి.
సర్వేకే పరిమితం.. నియంత్రణ శూన్యం
వానరుల బెడదపై రైతులు, ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తుండటంతో 2021 అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం కోతులపై సర్వే నిర్వహించింది. జిల్లాలో ఎన్ని కోతులున్నాయి? కోతులు సమూహంగా తిరుగు తున్నాయా? కోతుల వల్ల ఎంత పంటనష్టం జరుగుతోంది? కోతులు ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో ఉంటున్నాయి? గ్రామస్తులు ఎలాంటి నియంత్రణ చర్యలు తీసుకుంటు న్నారు? తదితర ప్రశ్నల ఆధారంగా సర్వే నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా కోతులున్నాయని సర్వేలో తేలింది. ఖమ్మం జిల్లాలో 2,412 సమూహాలు, 2,64,522 కోతులు సంచరిస్తున్నట్టు నిర్ధారించారు. కానీ కోతులు కోట్లలోనే ఉన్నాయని రైతులంటున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి జిల్లాలో కోతుల కుటుంబ నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నిర్మల్ జిల్లాలో దీన్ని నెలకొల్పింది. మిగిలిన జిల్లాల్లోనూ ఏర్పాటు చేస్తామని తెలిపింది. పశుసంవర్థకశాఖ ద్వారా వెసక్టమీ చేయించి కోతులను నియంత్రిస్తామని పేర్కొంది. కోతుల నియంత్రణలో మెరుగ్గా ఉన్న హిమాచల్ ప్రదేశ్లో అవలంబిస్తున్న చర్యలనూ అధ్యయనం చేస్తామన్నది. పల్లె ప్రకృతివనాలు, అడవులు, రోడ్ల వెంబడి పండ్ల మొక్కలు వేసి కోతులను అరికడతామన్నది. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు లేవు.
సర్వే చేసి పంపాం...
కోతులు, వాటి సమూహాలపై గ్రామాల్లో సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఈ మేరకు సర్వే నిర్వహించి రిచపోర్టు ప్రభుత్వానికి నివేదించాం. ఆ తర్వాత పశుసంవర్థకశాఖ ద్వారా నియంత్రణ చర్యలు చేపడుతారని అన్నారు. ఆ ప్రక్రియ ఏమైందో మాకు సమాచారం లేదు.
- విజయనిర్మల, ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి