Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారంలోకి వస్తే విద్యావైద్యానికి అధిక నిధులు
- జీఎస్టీని సవరిస్తాం
- బీజేపీ, టీఆర్ఎస్లు వ్యాపార పార్టీలు: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ
- జడ్చర్ల బహిరంగ సభ
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి/ మహబూబ్‌నగర్ / జడ్చర్ల
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశ సంపద ముగ్గురి చేతుల్లో తాకట్టు పెట్టిందని, చిన్న వ్యాపారస్తులను, మధ్యతరగతి కుటుంబాలను వీధిన పడేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. దేశంలో బీజీపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ వ్యాపార పార్టీలుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు తలపెట్టిన భారత్ జూడో పాదయాత్ర శనివారం మహబూబ్‌నగర్ జిల్లాలో సాగింది. ఈ క్రమంలో జడ్చర్ల మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
పారదర్శక పాలన కోసం.. విద్య వైద్యానికి అధిక నిధులు కేటాయించాలంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఆదరించాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీఎస్టీని సవరిస్తామని హామీనిచ్చారు. టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. వ్యవసాయ రంగాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టే రైతు వ్యతిరేక నల్ల చట్టాలను బీజేపీ తీసుకొస్తే రైతులు వీరోచితంగా పోరాడి వెనక్కి తిప్పికొట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన భూములు తప్ప.. దళిత గిరిజనులకు ఆ తర్వాత ఎటువంటి భూ పంపిణీ చేయలేదని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల విద్య ప్రయివేటీకరణ అవుతుందన్నారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలతో రాజకీయాలు చేసి పబ్బం కడుపుకోవటం ప్రజాస్వామికమన్నారు. భారతదేశ ప్రజలంతా అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటే.. వీరి మధ్య తగాదాలు ఎందుకు సృష్టిస్తున్నారని ప్రశ్నించారు. ఆ రెండు పార్టీలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజరుసింగ్, ఏఐసీసీ సభ్యులు జైరాం రమేష్, రాష్ట్ర నాయకులు భట్టి విక్రమార్క, మధుయాష్కిగౌడ్, పొన్నం ప్రభాకర్, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, ఎమ్మెల్యే సీతక్క, డీసీసీ అధ్యక్షులు ఒబేదుల కోత్వాల్, కాంగ్రెస్ జడ్చర్ల నియోజకవర్గ కన్వీనర్ జనంపల్లి అనిరుద్‌రెడ్డి, నాయకులు ఎర్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.