Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అందుకే మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు
- రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసమే ఎమ్మెల్యేల కొనుగోలు
- ఓట్ల కోసం మతం, ధర్మాన్ని అపవిత్రం చేస్తున్న కాషాయపార్టీ
- స్వార్థం, కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా
- పెద్ద శత్రువును ఓడించేందుకు కేసీఆర్‌తో కలవక తప్పలేదు
- బీజేపీని వ్యతిరేకిస్తే భవిష్యత్తులోనూ పొత్తు
- వామపక్షాలు బలపడితేనే దేశానికి మేలు
- మునుగోడు ప్రజలు చైతన్యంతో ఓటేయాలి
- నవతెలంగాణతో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని
దేశంలో, రాష్ట్రంలో బీజేపీని నిలువరించడమే తమ లక్ష్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. అందుకే మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు మద్దతిచ్చామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసమే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందనీ, మొయినాబాద్ ఫాంహౌజ్ ఘటన అందులో భాగమేనని విమర్శించారు. స్వార్థం, కాంట్రాక్టులను పొందడం కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఇందులో ఆ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలు ఏమీ లేవన్నారు. అక్కడ కమ్యూనిస్టులు బలంగా ఉన్నప్పటికీ బీజేపీ తమకు పెద్దశత్రువనీ, దాన్ని ఓడించేందుకు టీఆర్ఎస్తో కలవక తప్పలేదని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం వ్యవహరించినట్టుగానే బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తే భవిష్యత్తులోనూ పొత్తు కొనసాగుతుందని వివరించారు. అయితే వామపక్షాలు సొంతంగా బలపడితేనే దేశానికి, ప్రజలకు మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ వచ్చేనెల మూడున జరగనున్న నేపథ్యంలో నవతెలంగాణ ప్రతినిధి బొల్లె జగదీశ్వర్‌కు కూనంనేని సాంబశివరావు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు...
మునుగోడులో సీపీఐ, సీపీఐ(ఎం) బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థికి ప్రజల నుంచి వస్తున్న స్పందన ఎలా ఉందంటారు?
రాజకీయాలపై అవగాహన ఉన్న వారు ఈ ఉప ఎన్నికలు ఎందుకొచ్చాయని విశ్లేషిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి వ్యక్తిగత స్వార్థం, కాంట్రాక్టుల కోసమే ఉప ఎన్నిక వచ్చిందనే అభిప్రాయం ప్రజల్లో ఉన్నది. దాంతో బీజేపీ కొంత అయోమయంలో ఉన్నది. అక్కడ ఆ పార్టీకి బలం లేదు. కాంగ్రెస్ ఓట్లతోపాటు డబ్బులు పెట్టి ఓట్లు పొందాలని రాజగోపాల్‌రెడ్డి చూస్తున్నారు. కానీ అక్కడి ప్రజలు చైతన్యవంతులు. బీజేపీని ఆదరించే పరిస్థితి లేదు. అందుకే టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి మంచి ఆదరణ లభిస్తున్నది. ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం ఖాయం.
ఆ నియోజకవర్గంలో ఐదుసార్లు సీపీఐ గెలిచింది.
ఇప్పుడు పోటీ చేయకుండా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడానికి కారణమేమంటారు?
ఎన్నికలనేవి మనకున్న బలాన్ని బట్టి పోటీ ఉండదు. కొన్నిసార్లు పెద్ద శత్రువును ఓడించేందుకు రాజకీయ పొత్తులు అనివార్యమవుతాయి. అందుకే మాకు బలమైన సీటైనా పొత్తులో భాగంగా టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఉప ఎన్నిక. ఎన్నికల వ్యవస్థ దుర్మార్గంగా తయారైంది. కార్పొరేట్ సంస్థల అధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు రంగంలోకి దిగుతున్నారు. మతోన్మాద బీజేపీ ప్రమాదాన్ని ముందే పసిగట్టి పోటీ చేయలేదు. ఇంకోవైపు బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను సీఎం కేసీఆర్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు.
దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో తప్పనిసరి పరిస్థితుల్లోనే టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ సీటును మేము శాశ్వతంగా వదులుకోవడం లేదు. ఈ ఎన్నికల తర్వాత గ్రామగ్రామాన పార్టీని నిర్మిస్తాం. భవిష్యత్తులో మళ్లీ పోటీ చేసేందుకు సంసిద్ధం అవుతాం. రాజకీయంగా, సైద్ధాంతికంగా బీజేపీయే మా ప్రథమ శత్రువు. ఆ పార్టీకి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులన్నీ ఏకం కావాలి.
రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్తో కలిసే పోటీ చేస్తారా?
బీజేపీ విధానాలను సీఎం కేసీఆర్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టే ఈ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు కుదిరింది. కమ్యూనిస్టు పార్టీలతో కేసీఆర్ సాన్నిహిత్యం కోరుకుంటున్నారు. భవిష్యత్తులోనూ కలిసే ఉండాలని ఆయన భావిస్తున్నారు. ఈ పొత్తు కుదిరిన తర్వాత వీఆర్ఏల సమ్మె, ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. అంటే కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చింది. బీజేపీకి వ్యతిరేకంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే భవిష్యత్తులోనూ టీఆర్ఎస్తో కలిసే ఉంటాం. ఇది పరస్పర అవగాహనతో ఉండాలి. ప్రజాసమస్యలను పరిష్కరించాలని కేసీఆర్‌ను కోరతాం. వినకపోతే పోరాటాలను నిర్మిస్తాం. అందులో రాజీపడేది లేదు. గతంలో టీడీపీతో పొత్తు వల్ల కమ్యూనిస్టులు కొంత బలహీనపడ్డారు. ఇప్పుడు దాన్ని పునరావృతం కానివ్వబోం.
కమ్యూనిస్టు పార్టీలకు చెందిన కార్యకర్తలు టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వడాన్ని ఎలా భావిస్తున్నారు. పూర్తిస్థాయిలో సహకరిస్తున్నారా?
టీఆర్ఎస్కు మద్దతు ప్రకటించిన ప్రారంభంలో మా కార్యకర్తల్లో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రమాదకర విధానాలు, మతోన్మాదాన్ని పెంచడం, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, ప్రభుత్వరంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్మడం, విద్యుత్ సవరణ బిల్లు, వ్యవసాయ చట్టాలను తేవడం వంటి అంశాలను వారికి ఓపిగ్గా వివరించాం. ఇంకోవైపు బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నిలబడిన అంశాలను చెప్పాక ఇప్పుడు టీఆర్ఎస్ అభ్యర్థికి మా పార్టీ కార్యకర్తలు సహకరిస్తున్నారు. ప్రభాకర్‌రెడ్డి గెలుపుకోసం పనిచేస్తున్నారు. చంద్రబాబు హయాంలో విద్యుత్ ఉద్యమం చేసినా 2009లో టీడీపీతో, కాంగ్రెస్ పార్టీతో రాజకీయంగా, సైద్ధాంతిక విభేదాలున్నా 2004లో పొత్తు పెట్టుకున్నాం. ఇప్పుడు బీజేపీ ప్రమాదాన్ని నిలువరించడం కోసం టీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాల్సి వచ్చింది.
నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానంటూ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి చెప్తున్న మాటల్లో వాస్తవం ఎంత?
వ్యక్తిగత స్వార్థం కోసమే రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేశారు. ఇందులో నియోజకవర్గ అభివృద్ధి అనేది అబద్ధం. రూ.18 వేల కోట్ల కాంట్రాక్టుల కోసమే బీజేపీలో చేరారు. ఇది బహిరంగ రహస్యమే. దాన్ని ప్రజలు పసిగట్టారు. అందుకే ప్రచారంలో రాజగోపాల్‌రెడ్డిని నిలదీస్తున్నారు. డబ్బు, ప్రలోభాలతో ఎలాగైనా గెలవొచ్చని భావించిన ఆయనతోపాటు, బీజేపీ సైతం కొంత అభద్రతలో పడినట్టు అయ్యింది. ఇది టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి కలిసొచ్చే అంశం.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కోసం బీజేపీ చేసిన కుట్రలను ఎలా అర్థం చేసుకోవాలి. ఆడియో రికార్డులు సైతం బహిర్గతమయ్యాయి. దీనిపై ఏమంటారు?
రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టడం కోసమే పీఠాధిపతులు, స్వామీజీలను బీజేపీ రంగంలోకి దించింది. అందులో భాగంగానే నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మొయినాబాద్ ఫాంహౌజ్‌లో కలిశారు.
ఆడియో టేపులు బయటికి వచ్చాక బీజేపీ డైలమాలో పడింది. పూర్తి వివరాలు బయటికి రావాల్సిన అవసరముంది. అయితే మునుగోడు ఎన్నికలకు ముందే రాష్ట్ర ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ కార్యక్రమంగా పెట్టుకుంది. మహారాష్ట్రలో షిండేను సృష్టించి శివసేన ప్రభుత్వాన్ని కూల్చారు. బెంగాల్లో 42 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు మాకు టచ్‌లో ఉన్నారంటూ ప్రధాని మోడీ అంటున్నారు. ప్రజాస్వామ్యం పట్ల, ఎన్నికల పట్ల బీజేపీకి విశ్వాసం లేదు.
అందుకే ఏదో ఒక పద్ధతిలో అధికారంలోకి రావాలని చూస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం ద్వారానే తొమ్మిది రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారంలో ఉన్నది. రాజకీయ, ప్రభుత్వ వ్యవస్థలతోపాటు యంత్రాంగాన్ని, రాజ్యాంగ సంస్థలను, ధార్మిక సంస్థలను నిర్వీర్యం చేస్తున్నది. తమ్ముడి గెలుపు కోసం కాంగ్రెస్ ఎంపీ, స్టార్ క్యాంపెయినర్ కోమట్టిరెడ్డి వెంకట్‌రెడ్డి పనిచేస్తున్నారు. ఇవన్నీ గమనించి మునుగోడు నియోజకవర్గ ప్రజలు చైతన్యంతో ఓటేయాలి. టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలి.