Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు ఆదేశాలు
- అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మరోసారి వాంగ్మూలం నమోదు
- ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట హాజరు
- 14 రోజుల రిమాండ్..
చంచల్‌గూడ జైలుకు తరలింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్/ రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన 'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గురు నిందితుల రిమాండ్‌కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే వారిని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపర్చాలనీ, ఆ తర్వాత రిమాండ్‌కు తరలించాలని పోలీసులను ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని మరోసారి వాంగ్మూలం నమోదు చేసుకుని, వైద్య పరీక్షల అనంతరం సరూర్‌నగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు. వారికి జడ్జి 14 రోజుల రిమాండ్ విధించగా, పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో నిందితులైన రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ, కోరె నందు కుమార్ అలియాస్ నందు, డీపీఎస్‌కేవీఎన్ సింహయాజీను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు వారిని ఏసీబీ న్యాయమూర్తి ఎదుట హాజరుప ర్చారు. ముగ్గురికి రిమాండ్ విధించాలని పోలీసులు కోరారు. అయితే రిమాండ్‌కు ఇవ్వాలన్న పోలీసుల విజ్ఞప్తిని న్యాయమూర్తి తిరస్కరించారు.
కొనుగోలుకు యత్నించారనే ఆరోపణలపై సరైన ఆధారాలు లేవంటూ ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి గురువారం నిరాకరించారు. వారిని తక్షణమే విడుదల చేయాలనీ, 41 సీఆర్పీసీ కింద నోటీసులిచ్చిన తర్వాతే విచారించాలని స్పష్టం చేశారు. న్యాయమూర్తి ఆదేశాలతో నిందితులను గురువారం రాత్రి పోలీసులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు 41 సీఆర్పీసీ కింద నిందితు లకు నోటీసులు జారీ చేసి విచారణకు హాజరుకావాలని సూచించారు. అయితే,రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాక రించడాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. నిందితులు తమ నివాస చిరునామాలను సైబరాబాద్ పోలీసు కమిషనర్‌కు అందజే యాలని సూచించింది.పోలీసులకు ఫిర్యాదు చేసిన రోహిత్‌రెడ్డిని సంప్రదించడం గానీ,సాక్షులను ప్రభావితం చేయడానికిగానీ వారు ప్రయత్నించరాదని షరతు విధించింది.ఈ పిటిషన్‌పై విచారణను శనివారానికి వాయిదా వేసిన ధర్మాసనం..సైబరాబాద్ పోలీసుల వాదనలతో ఏకీభవిస్తూ.. రిమాండ్‌ను తిరస్కరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేసింది.
జడ్జి ఎదుట హాజరు
హైకోర్టు ఆదేశాల మేరకు సైబరాబాద్ పోలీసులు శనివారం ఉదయం ఫిలింనగర్‌లోని నందకుమార్ ఇంటికి వెళ్లారు. నందుతోపాటు మిగతా ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ముగ్గురు నిందితులను సైబరాబాద్ కమిషనరేట్‌కి తరలించారు. సీపీ ఆఫీసులో ఎక్కువ సమయం నిందితులను ఉంచకుండా సంతకాలు తీసుకుని, అక్కడి నుంచి మొయినాబాద్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. రాజేందర్‌నగర్ ఏసీపీ గంగాధర్ ఆధ్వర్యంలో నిందితులను విచారించారు. మరోసారి వారి నుంచి వాగ్ములాలు తీసుకున్నారు. అనంతరం వైద్య పరీక్షల కోసం నిందితులను చెవేళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రభుత్వ వైద్యాధికారి ఆధ్వర్యంలో నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం నిందితులను అక్కడి నుంచి మళ్లీ మొయినాబాద్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. గంటపాటు నిందితులను పోలీసులు విచారించారు. 24 గంటల్లో వారిని ఏసీబీ జడ్జి ఎదుట హాజరుపర్చాలన్న హైకోర్టు ఆదేశాల మేరకు.. పోలీసులు అన్ని రిపోర్టులు సిద్ధం చేసుకున్నారు. నిందితులను శనివారం రాత్రి సరూర్‌నగర్‌లోని అ.ని.శా. (అవినీతి నిరోధక శాఖ) ప్రత్యేక కోర్టు జడ్జి నివాసానికి తరలించారు. జడ్జి ఎదుట హాజరుపరిచ్చారు. జడ్జి వారికి 14 రోజుల రిమాండ్ విధించగా, చంచల్‌గూడ జైలుకు తరలించారు.
బీజేపీ పిటిషన్‌పై విచారణ.. దర్యాప్తుపై స్టే..
బీజేపీలో చేరితే కోట్ల రూపాయల నగదు ఇస్తామంటూ ప్రలోభ పెట్టడంపై మొయినాబాద్ పోలీసు స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తును సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ప్రేమేందర్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసింది. వచ్చే నెల 4వ తేదీ వరకు దర్యాప్తుపై స్టే విధించిన న్యాయస్థానం, విచారణ వాయిదా వేసింది. ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సహ ప్రతివాదులుగా ఉన్న ఎనిమిది మందికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై రెండు ధర్మాసనాలు వేర్వేరు తీర్పులిచ్చాయి. దీంతో ఏం జరగనుందో వేచి చూడాలి.