Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓటర్లకు మంత్రి కేటీఆర్ పిలుపు
- జూటా, జుమ్లా బీజేపీపై ఛార్జ్ షీట్
- 'మొయినాబాద్' వ్యవహారంపై సీఎం సరైన సమయంలో స్పందిస్తారని వెల్లడి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వంద తప్పులు చేసిన శిశు పాలుడిని శ్రీ కృష్ణుడు వధించినట్టు మునుగోడులో బీజేపీని శిక్షించాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఓటర్లకు పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని ఆ పార్టీ ధనబలంతో కొనుగోలు చేయాలనుకుంటున్నదని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశ, రాష్ట్ర ప్రజలకు అనేక హామీలిచ్చి వాటిని తుంగలో తొక్కిన జూటా, జుమ్లా బీజేపీపై ఛార్జ్ షీట్ దాఖలు (ప్రజల ముందు వాస్తవాలుంచటం) చేస్తున్నామని ఆయన వ్యాఖ్యానించారు. శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్థన్, జీవన్‌రెడ్డి, టీఆర్ఎస్ నేతలు గెల్లు శ్రీనివాస్, దాసోజు శ్రావణ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి తదితరులతో కలిసి కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించారు.
ఎనిమిదేండ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి, ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు. మున్ముందు కూడా ఆ పార్టీ మనకేదో ఒరగబెడుతుందనే భ్రమల్లేవని అన్నారు. ఎన్నికలప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు తాము చేసిన పనుల గురించి చెప్పి ఓట్లడగాలి.. కానీ అందుకు భిన్నంగా బీజేపీ నేతలు వ్యక్తిగత దూషణ భాషణల ద్వారా ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి ఆ నియోజకవర్గాన్ని ఓ అనాథలా వదిలేశారని చెప్పారు. కేంద్రంలోని బీజేపీ ఆ నియోజకవర్గానికి ఇప్పటిదాకా ఏం చేసిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను, దాని వైఫల్యాలను ఎండగడుతూ నిర్దిష్టమైన ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశామన్నారు. మునుగోడులో ఫ్లోరైడ్ సమస్య, చేనేతపై జీఎస్టీ, ఉచిత విద్యుత్‌కు ఉరేసే విధానం, కృష్ణా జలాలపై నికృష్ట రాజకీయం, గ్యాస్ సిలిండర్ల ధర పెంపు, పెట్రో ధరలు, ఫలితంగా నిత్యావసరాలు భగ్గుమంటున్న వైనం, గిరిజన రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం మోకాలడ్డుతున్న తీరు, కర్నాటకలో కల్లుగీత వృత్తి నిషేధం, బీసీ జనగణన డిమాండ్‌ను పట్టించుకోని వైనం,ఉచితాలపై దాడి, సంక్షేమానికి సమాధి, ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మోసం చేయటం, విదేశాల నుంచి నల్లధనాన్ని తేలేకపోవటం, తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోవటం, విభజన చట్టానికి తూట్లు, వ్యవసాయ నల్ల చట్టాలు, రైతులను కార్లతో తొక్కించటం, దేశాన్ని అప్పుల కుప్పగా మార్చటం, రూపాయి పతనంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేయటం, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్, ఆకలి సూచిలో భారత్ తిరోగమనం తదితరాంశాలను కేటీఆర్ ఈ సందర్భంగా ఏకరువు పెట్టారు. ఇలా అనేక వైఫల్యాలను మూటగట్టుకున్న బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాను లేవనెత్తిన ఈ అంశాలపై ఆ పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించబోరని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల బేరసారాల అంశంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ... 'ఆ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ సరైన సమయం, సందర్భంలో తగు విధంగా స్పందిస్తారు. అయినా ప్రజలకు వాస్తవాలన్నీ తెలిసిపోయాయి. దొంగెవరో, దొరెవరో తేలిపోయింది... అందువల్ల ఆ ఘటనపై కామెంట్ చేయటం ద్వారా దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేయదలుచుకోలేదు...' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు యాదాద్రిలో చేసిన ప్రమాణం గురించి ప్రస్తావించగా... 'ప్రమాణాలతో సమస్యలు పరిష్కారమైతే... ఇక కోర్టులు, చట్టాలు, పోలీసులు ఎందుకు...?' అని ఎదురు ప్రశ్నించారు. అమిత్ షా చెప్పులను పట్టుకున్న చేతులతోనే సంజరు యాదాద్రిలో ప్రమాణం చేశారు.. అందువల్ల ఆ గుడి అపవిత్రమైందని తెలిపారు. అందువల్ల సంప్రోక్షణ చేపట్టాలంటూ అక్కడి ఆలయ అధికారులు, పూజారులకు సూచించారు.