Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన యాసిడ్‌తో స్నానం చేసినా ప్రజలు నమ్మరు
- ఎమ్మెల్యేల కేసు విచారణ సుప్రీం జడ్జి పర్యవేక్షణలో జరగాలి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
నవతెలంగాణ- మునుగోడు
''బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్వి జోకర్ వేషాలు.. ఆయన నీళ్లు కాదు.. యాసిడ్ పోసుకునిప్రమాణం చేసినా, గుండుతో గుట్ట ఎక్కినా ప్రజలు నమ్మరు.. అంత బుద్ధిమంతుడైతే.. కొన్ని రోజుల కిందట తాను మునుగోడు ఎన్నికల్లో మందు పోయకుండా, డబ్బు పంచకుండా ఓటు అడగాలని, అందుకు యాదగిరిగుట్ట నర్సింహాస్వామి మీద ఒట్టేస్తారా అని సవాల్ విసిరితే ఎందుకు స్వీకరించలేదు'' అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసును సుప్రీం కోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారించాలని డిమాండ్ చేశారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో పాదయాత్రను, మునుగోడు ఎన్నికలను పక్కదోవ పట్టించే క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఎమ్మెల్యేల కొనుగోలు అంటూ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. నల్లగొండ జిల్లా చండూరు మండల కేంద్రంలో పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరుతూ శనివారం ఆయన రోడ్ షో నిర్వహించారు. అదేవిధంగా మునుగోడు మండల కేంద్రంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్వి జోకర్ వేషాలన్నారు. ఆయన నీళ్లు కాదు యాసిడ్ పోసుకుని ప్రమాణం చేసినా, గుండుతో గుట్ట ఎక్కినా ప్రజలు నమ్మరన్నారు.
సీబీఐ, ఈడీ సంస్థలు కేంద్రం చేతుల్లో ఉన్నాయని, రాష్ట్ర పోలీసులు, ఏసీబీ కేసీఆర్ డైరెక్షన్లో పని చేసున్నాయని.. అందువల్ల ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మీద నమ్మకం లేదని తెలిపారు. సుప్రీం కోర్టు జడ్జి పర్యవేక్షణలో రోజూ నివేదికలు ఇచ్చే విధంగా కేసును విచారించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా.. రాజకీయంగా కాంగ్రెస్‌కు నష్టం చేసే విధంగా టీఆర్ఎస్, బీజేపీ సమన్వయంతో పని చేస్తున్నాయని విమర్శించారు. దుబ్బాక ఉపఎన్నికల్లో ఇదే జరిగిందన్నారు. రఘునందన్‌రావు మీద కేసులు పెట్టి సానుకూల వాతావరణం ఏర్పడేలా చేశారని ఆరోపించారు. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ సానుభూతితోనే గెలిచారన్నారు. గెలిచిన తర్వాత ఈటలపై భూముల ఆక్రమణల కేసులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆయన్ను జైలుకు పంపిస్తామన్న వారు ఏమయ్యారని ప్రశ్నించారు. అమిత్ షా, కేసీఆర్ ఇద్దరూ కలిసి వారి ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీని ఆటలో నుంచి తప్పించే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడల్లా భావోద్వేగాలను ముందు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందుతున్నాయని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా అదే జరిగే అవకాశం ఉందన్నారు.
ఆడబిడ్డగా ముందుకు వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతిరెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మాజీ మంత్రులు శ్రీధర్ బాబు, దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, టీపీసీసీ అధికార ప్రతినిధి మునుగోడు ఉప ఎన్నికల స్టార్ క్యాంపెయినర్ పున్న కైలాస నేత, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, రాష్ట్ర నాయకులు చెరుకు సుధాకర్ పాల్గొన్నారు.