Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్గో ఆదాయమూ పెరగాలి: టీఎస్ఆర్టీసీ అధికారులకు చైర్మెన్ ఆదేశాలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య (ఓఆర్)ను మరింత పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అధికారులను ఆదేశించారు. శనివారం బస్‌భవన్‌లో ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఉద్యోగులు సెప్టెంబర్ నెలలో మంచి ఆదాయం తెచ్చారనీ, ఓఆర్‌ను 70 శాతం నుంచి 75 శాతానికి పెంచుతూ, మరింత ఆదాయం సముపార్జించాలని చెప్పారు. గత నెలలో 15 డిపోలు లాభాల బాటలోకి రావడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని డిపోలు కృషి చేయాలన్నారు. కార్గో ఆదాయం ప్రస్తుతం రూ. 7 కోట్లు వస్తున్నదనీ, దీన్ని రూ. 12 కోట్లకు పెంచుకొనేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని చెప్పారు. కార్తీకమాసం, సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ప్రత్యేక రవాణా ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. త్వరలోనే వెయ్యి కొత్త బస్సులను ప్రవేశపెడతామన్నారు. ఆర్టీసీ కమర్షియల్ స్థలాలు, బస్టేషన్ కాంప్లెక్స్ స్టాళ్ల ద్వారా మరింత ఆదాయం సమకూర్చుకోవాలన్నారు. దీనికోసం ఫీల్డ్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకోవాలని చెప్పారు. సమావేశంలో సీఓఓ రవీందర్, ఈడీఓ మునిశేఖర్, ఈడీహెచ్జెడ్ పురుషోత్తం, యాదగిరి, ఈడీ కరీంనగర్ జోన్ వెంకటేశ్వర్లుతో పాటు అన్ని జిల్లాల రీజనల్ మేనేజర్లు, అధికారులు పాల్గొన్నారు.