Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహిళల చేతులపై మెహందీతో కమలం గుర్తు వేసి ప్రచారం
- ఎన్నికల నియమాల్ని ఉల్లంఘించిన బండి
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
బీజేపీ నాయకులు ఎన్నికల నియమావళిని ఉల్లఘించి అక్రమాలకు పాల్పడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఐదు అంశాలకు సంబంధించిన నివేదికతో నల్లగొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ టీ.వినరు కృష్ణారెడ్డికి శనివారం టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌కుమార్, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, గండ్ర వెంకటరమణరెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు మండలం పలివెల గ్రామంలో బీజేపీ నాయకులు మహిళల చేతులపై మెహందీతో కమలం గుర్తు వేసి ప్రచారం చేస్తున్నారన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని, ఎటువంటి అనుమతులు తీసుకోకుండా కుల సంఘాల మీటింగులు పెడుతున్నారని విమర్శించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు యాదాద్రి శ్రీలక్ష్మి నరసింహాస్వామి ఎదుట ప్రమాణం చేసి మతపరమైన సంప్రదాయాలను మునుగోడు ఎన్నికలలో వాడుకొని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. సీడీలు, డాక్యుమెంట్ల రూపంలో జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశామని తెలిపారు. ఈ అంశాలపై నిస్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు తీసుకుంటారని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో విద్యామౌలిక వసతుల అభివృద్ధి సంస్థ అధ్యక్షులు రావుల శ్రీధర్ రెడ్డి, నల్లగొండ గ్రంథాలయ సంస్థ చైర్మెన్ రేగట్టె మల్లికార్జునరెడ్డి తదితరులు ఉన్నారు.