Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లోగో ఆవిష్కరించిన ఆలిండియా అధ్యక్షులు వీపీ సాను
నవ తెలంగాణ:భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) 17వ అఖిల భారత జాతీయ మహాసభలు డిసెంబర్ 13 నుంచి 16వ తేదీ వరకు హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరగనున్నాయి. దీనికి సంబంధించిన లోగోను ఎస్ఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షులు వీపీ సాను శనివారంనాడిక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యావిధానంతో అందరికీ విద్య దూరమవుతుందని చెప్పారు. ఈ మహాసభల్లో విద్యారంగంపట్ల ప్రభుత్వ విధానాలను ఎండగడతామని హెచ్చరించారు. విద్య, ఉపాధి అనేవి ప్రభుత్వాల మౌలిక బాధ్యతలనీ, వాటినుంచి తప్పుకొనేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు రూపొందుతున్నాయని అన్నారు. కులాల పేరుతో సమాజాన్నీ, ప్రజల్ని విడగొట్టి పాలించే చర్యలకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, టీ నాగరాజు మాట్లాడుతూ దేశంలో లక్షకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. విద్యా విధాన విధ్వంసంపై కేంద్రప్రభుత్వ వైఖరికి ఇవి ప్రత్యక్ష నిదర్శనాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు విడుదల చేయకుండా, దాన్ని ధార్మిక సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పేరుతో దేశ విద్యావ్యవస్థను విదేశీ సంస్థలకు అప్పగిస్తున్నారని చెప్పారు. ఐఐటీ, ఐఐఎమ్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేయట్లేదన్నారు. విద్యారంగ పరిరక్షణకు అందర్నీ ఏకం చేసే దిశగా తమ జాతీయ మహాసభలు జరుగుతాయని తెలిపారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు టీ రవి, ఆహ్వానసంఘం కోశాధికారి ఎమ్డీ జావీద్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లెనిన్ గువేరా, కే అశోక్‌రెడ్డి పాల్గొన్నారు.