Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడేండ్ల పీఎఫ్, ఐదునెలల వేతనాలు చెల్లించాలి : సీఐటీయూ
- తాజ్ బీడీ కంపెనీ ఎదుట ధర్నా
- దిగొచ్చిన యాజమాన్యం.. చర్చలు జయప్రదం
నవతెలంగాణ-డిచ్పల్లి
తాజ్ బీడీ కంపెనీ బీడీ కార్మికులను శ్రమ దోపిడీకి గురిచేయటం సిగ్గుచేటని సీఐటీయూ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ అన్నారు. ఐదు నెలల నుంచి బీడీ కార్మికుల చేత బీడీలు చేయించుకుంటూ వారి శ్రమను యాజమాన్యం దోపిడీ చేయడం, మూడేండ్లుగా కార్మికుల నుంచి నెలవారీగా పీఎఫ్ కటింగ్ చేసుకుంటూ ఖాతాల్లో జమ చేయకుండా మోసగింగిస్తోంది. ఈ క్రమంలో శనివారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని తాజ్ బీడీ కంపెనీ ఎదుట పలు మండలాల బీడీ కార్మికులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ.. నాలుగేండ్ల కిందట తాజ్ కంపెనీ యాజమాన్యంతో లేబర్ కార్యాలయం వద్ద చర్చలు జరిగాయని చెప్పారు. ఆనాడు యాజమాన్యం ప్రతి నెలా బీడీ కార్మికులకు వేతనాలు చెల్లిస్తామని రాతపూర్వకంగా రాసిచ్చిందని, కానీ ఆ తరువాత నుంచి మూడేండ్లుగా పీఎఫ్ కట్టకుండా, బీడీ కార్మికులకు నెలవారి వేతనం ఇవ్వకుండా ఐదు నెలలుగా ఇబ్బందులకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా కార్మికులు పండుగలకు సైతం పస్తులుండాల్సిన దుస్థితి దాపురించిందని తెలిపారు. ఆకు, తంబాకు, దారం ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ నెలలో 10 రోజులే పనులు చేయిస్తూ, మిగతా 20 రోజులు వర్ది బిడీలు చేయించుకుంటున్నారన్నారు. బీడీలపైనే ఆధారపడి ఉన్న కుటుంబాలు చిన్నాభిన్నమై పోతున్నాయని చెప్పారు. మూడేండ్లపాటు కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ కటింగ్ చేసుకుంటున్నా పీఎఫ్ కార్యాలయంలో చెల్లించకుంటే అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
టేకేదార్లకు నాలుగు క్వింటాళ్ల మేర ఆకు బాకీ..
తాజ్ బీడీ కంపెనీ ఒక్కో టేకేదార్కు మూడు నుంచి ఐదు క్వింటాళ్ల మేర ఆకు డబ్బులు చెల్లించాల్సి ఉందని తాజ్బీడీ టేకేదార్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి వీరేశం, నరసయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బీడీ కార్మికులకు పని కల్పించాలనే ఉద్దేశంతో బయట నుంచి ఆకును కొనుగోలు చేసి కార్మికులకు అందజేస్తున్నామని వివరించారు.
దిగొచ్చిన కంపెనీ యాజమాన్యం
ఉదయం నుంచి కార్మికులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడంతో ఎట్టకేలకు తాజ్ బీడీ కంపెనీ దిగొచ్చింది. తాజ్ బీడీ యజమాని కంపెనీ మేనేజర్ రాకేష్‌తో ఫోన్లో మాట్లాడారు. కార్మికులకు ఒక నెల వేతనాన్ని (శనివారం), ఇంకో నెల వేతనాన్ని సోమవారం చెల్లిస్తామని, నవంబర్ 10న మూడేండ్లకు సంబంధించిన పీఎఫ్‌కు డబ్బులు జమ చేస్తామని అంగీకరించారు. ఈ విషయమై నూర్జహాన్ సైతం బీడీ కంపెనీ యాజమాన్యంతో ఫోన్లో మాట్లాడారు. ఈ హామీన్ని అమలు చేయకుంటే వచ్చే నెల 11న కార్మికులతో తరలివచ్చి కంపెనీకి తాళం వేస్తామని హెచ్చరించారు. కార్మికులకు ఇబ్బందులు కలిగిస్తే సీఐటీయూ పక్షాన పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని స్పష్టం చేశారు.