Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెంటనే అన్ని సౌకర్యాలను కల్పించాలి
- ఒకే దగ్గర కలిసి ఉంటాం
- గంటల పాటు రోడ్డుపై బైటాయింపు
నవతెలంగాణ-తూప్రాన్ రూరల్ (మనోహరాబాద్)
తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించి సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ లబ్దిదారులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో శనివారం సుమారు మూడు గంటలపాటు రాస్తారోకో చేపట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు సర్టిఫికెట్లు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమను కులాలవారీగా విభజించాలని నాయకులు చూస్తున్నారని, కానీ తామంతా ఒకే చోట ఒక కుటుంబంగా కలిసి ఉంటామని తెలిపారు. వెంటనే సర్టిఫికెట్లు అందజేయాలని డిమాండ్ చేశారు. తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం 500 ఇండ్లను మంజూరు చేసిందన్నారు. ఇందులో 321 ఇండ్లు మాత్రమే పూర్తి చేయడంతో నాయకులు హడావుడిగా గత నెలలో మంత్రి హరీశ్రావ్తో ప్రారంభించారని తెలిపారు. ఇండ్లల్లో ఇంకా పనులు పూర్తి కాలేదన్నారు. లబ్దిదారులను కులాలవారీగా విభజించి కేటాయించే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఇండ్లు కేటాయించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు తమకు పట్టా సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్మెన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహసీల్దార్ జ్ఞానజ్యోతి మాట్లాడుతూ.. గురువారంలోగా అందరికీ పట్టా సర్టిఫికెట్లు అందజేస్తామని హామీ ఇవ్వడంతో పేదలు రాస్తారోకో విరమించారు.