Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జైనూర్
అధిక వర్షాలతో పంట దెబ్బతిని ఆశించిన దిగుబడి రాక గిరిజన రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం జామిని గ్రామంలో జరిగింది. ఎస్ఐ మధుకర్, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
రైతు పెందూర్ నాగోరావు(35) ఐదెకరాలో పత్తి, సోయా పంటలు సాగు చేశారు. ఈ ఏడాది కూడా అప్పులు తీసుకొచ్చి పంట సాగు చేశాడు. అయితే, భారీ వర్షాలు కురవడంతో పంట నష్టపోయాడు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడి తిరిగి రాదేమోనని తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గుస్సాడీ పండుగ కోసం భార్య పెందూర్ సక్రుబాయిని తల్లిగారింటికి పంపించాడు. శనివారం భార్యకు ఫోన్ చేసి సరైన దిగుబడి వచ్చే అవకాశాలు ఆవేదన చెందాడు. అనంతరం ఉరేసుకున్నాడు. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే భార్యకు సమాచారం అందించారు. పంట సాగు కోసం సుమారు రూ.4లక్షల వరకు అప్పులు చేశాడు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. సర్పంచ్ మేస్రం రాహుల్ రైతు కుటుంబసభ్యులను పరామర్శించారు.