Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 31 వరకు సెల్ఫ్రిపోర్టింగ్కు గడువు
- ఉన్నత విద్యామండలి చైర్మెన్ లింబాద్రి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యూ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరానికి సంబంధించి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) ప్రత్యేక డ్రైవ్‌లో 11,602 మంది విద్యార్థులకు ఉన్నత విద్యామండలి సీట్లు కేటాయించింది. ఈ మేరకు కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మెన్, దోస్త్ కన్వీనర్ ఆర్ లింబాద్రి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక డ్రైవ్‌లో సీట్లు పొందిన విద్యార్థులు రూ.500 లేదా రూ.వెయ్యి చెల్లించి ఈనెల 31 వరకు ఆన్లైన్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేందుకు గడువుందని తెలిపారు. అలా చేయకుంటే సీటు రద్దవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, విశ్వవిద్యాలయ కాలేజీలకు కేటాయించిన వారు ఈపాస్ ఫీజు రీయింబర్స్మెంట్ కోసం అర్హత పొందిన విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక డ్రైవ్‌లో 11,964 మంది విద్యార్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు. ఇతర వివరాలకు https://dost.cgg.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో 978 డిగ్రీ కాలేజీల్లో 4.60 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. అయితే డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 25 శాతంలోపు సెక్షన్లు, కోర్సులు, సీట్లు రద్దు చేస్తున్నట్టు ఉన్నత విద్యామండలి, కళాశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో లక్ష వరకు సీట్లు రద్దయ్యే అవకాశమున్నది. అంటే డిగ్రీలో ప్రస్తుత విద్యాసంవత్సరంలో 3.60 లక్షల వరకు సీట్లున్నాయి. ప్రత్యేక డ్రైవ్‌తో కలిపి 1,98,343 మందికి సీట్లు కేటాయించారు. ఈ నేపథ్యంలో డిగ్రీ ప్రథమ సంవత్సరంలో 1,61,657 సీట్లు మిగిలాయి.