Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నవంబర్ 4 వరకు ఆన్లైన్లో అభ్యంతరాల స్వీకరణ
- టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ డిజిటల్ పత్రాలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రూప్-1 ప్రిలిమినరీ రాతపరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శనివారం విడుదల చేసింది. ఈ మేరకు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షను నిర్వహించామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, వారిలో 2,85,916 మంది అభ్యర్థులు హాజరయ్యారని పేర్కొన్నారు. అయితే పరీక్ష నిర్వహించిన రోజు ఫోన్ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా 2,86,051 మంది హాజరైనట్టు ప్రకటించామని గుర్తు చేశారు. పరీక్షకు హాజరైన అభ్యర్థులందరి ఓఎంఆర్ డిజిటల్ పత్రాలను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రాథమిక కీపై వచ్చేనెల నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అభ్యంతరాలను స్వీకరిస్తామని వివరించారు. ఈమెయిల్, వ్యక్తిగతంగా అభ్యంతరాలను స్వీకరించేది లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత వచ్చే అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోబోమని పేర్కొన్నారు. అభ్యంతరాల ఆధారాలను లింక్‌లో పీడీఎఫ్ ద్వారా జతపర్చాలని కోరారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల ఓఎంఆర్ పత్రాలు వచ్చేనెల 29 సాయంత్రం ఐదు గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. 503 పోస్టుల భర్తీకి తెలంగాణ తొలి గ్రూప్-1 నోటిఫికేషన్‌ను టీఎస్పీఎస్సీ ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలను నిపుణులు పరిశీలించి వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశమున్నది. ఆ తర్వాత తుది కీని విడుదల చేస్తారు. అనంతరం గ్రూప్-1 ప్రిలిమినరీ ఫలితాలను విడుదల చేసి 1:50 నిష్పత్తి చొప్పున మెయిన్స్‌కు 25,150 మంది అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇతర వివరాలకు www.tspsc.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదిం చాలని అధికారులు సూచించారు. అయితే హైదరాబాద్‌లో ఎస్ఎఫ్ఎస్ పాఠశాలతోపాటు అబిడ్స్‌లో మరికొన్ని విద్యాసంస్థల్లో ప్రశ్నాపత్రాలు తారుమారు కావడంతో 69 మంది అభ్యర్థులు అదనపు సమయం తీసుకుని పరీక్ష రాశారు. వారికి సంబంధించిన ఓఎంఆర్ డిజిటల్ పత్రాలను సైతం టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పొందుపరచడం గమనార్హం.