Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులే ఉన్నారని సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ (ఎస్జీటీయూ) ఆందోళన వ్యక్తం చేసింది. ఒకరిద్దరు ఉపాధ్యాయులతో తొలిమెట్టు కార్యక్రమాన్ని నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కరివేద మహిపాల్‌రెడ్డి శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రాథమిక స్థాయిలో తెలుగు, గణితం, ఆంగ్ల సబ్జెక్టుల్లో విద్యార్థులు కనీస అభ్యసన సామర్థ్యాల సాధనలో రాష్ట్ర ప్రభుత్వం తొలిమెట్టు కార్యక్రమాన్ని ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. అయితే ఏడేండ్లుగా ఉపాధ్యాయులకు పదోన్నతుల్లేవని పేర్కొన్నారు. మన ఊరు- మనబడి, ఆంగ్లమాధ్యమాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య పెరిగిందని వివరించారు. ఒకరిద్దరు ఉపాధ్యాయులుంటే నాణ్యమైన, గుణాత్మక విద్య ఎలా అందుతుందని ప్రశ్నించారు. తరగతికి ఒక టీచర్, పాఠశాలకు ఒక ప్రధానోపాధ్యాయుడు ఉన్నపుడే తొలిమెట్టు విజయవంతం అవుతుందని తెలిపారు.