Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ సంస్థలను దోస్తులకు అప్పగిస్తున్న బీజేపీ ప్రభుత్వం
- నిరుద్యోగుల మాటెత్తని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
- భారత్ జోడో యాత్ర సభలో రాహుల్ గాంధీ
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి/బాలనగర్
దేశంలో మోడీ పాలన ముగ్గురు దోస్తుల కోసమే కొనసాగుతుందని, ప్రభుత్వ సంస్థలను ఒక్కొక్కటిగా ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తోందని ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో మహిళలు, మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, దేశ ప్రజల సమైక్యతకై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఏఐసీసీ నాయకులు రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆదివారం రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది. శనివారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లిలో బసచేసిన రాహుల్‌గాంధీ యాత్ర ఆదివారం ఉదయం ఐదున్నర గంటలకు అక్కడినుంచి బయలుదేరి బాలనగర్‌కు చేరుకుంది. షాద్‌నగర్‌కు చేరుకున్న యాత్రకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జిల్లాలోని షాద్‌నగర్ వై జంక్షన్ వద్ద రంగారెడ్డి కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ గాంధీ మాట్లాడారు.
ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎండ, వానలను లెక్క చేయకుండా దేశం ప్రజల్లో ఐక్యతను చాటేందుకు సాగుతున్న జోడోయాత్రకు ప్రజల నుంచి లభిస్తున్న ఆధారణ తమకు రెట్టింపు శక్తిని ఇస్తోందని తెలిపారు. యాత్రలో ప్రజల చెప్పే సమస్యలను తాను వింటున్నానని, తెలంగాణలో నిరుద్యోగులు, రైతులు, కార్మికులు తమ సమస్యలు చెబుతున్నారని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వాటి పరిష్కారానికి కాంగ్రెస్ కృషి చేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రయివేటీకరణ చేస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే విద్య, వైద్యాన్ని పూర్తిగా ప్రభుత్వపరం చేస్తామని తెలిపారు. దేశంలో మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన ఎయిర్ ఇండియా, రైల్వే, పోర్టులు ఇలా అన్ని రంగాలను ప్రయివేటు సంస్థలకు అప్పగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల పాలన పక్కన పెట్టి, తమ దోస్తుల వ్యాపార సంస్థలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వాన్ని నడిపిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. జీఎస్టీతో దేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమల మూత పడ్డానని, దేశం ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయిందని తెలిపారు. ఇప్పుడు చేనేత కార్మికులపై జీఎస్టీ బాణం విసురుతుందని, దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రజా సంక్షేమాన్ని రాష్ట్రంలో టీఆర్ఎస్, దేశంలో మోడీ ప్రభుత్వం గాలికి వదిలేశారన్నారు. బీజేపీ, టీఆర్ఎస్లు దొందుదొందేనని ఆరోపించారు. కేవలం ఎన్నికల సమయంలో శత్రువులుగా ఉంటూ.. మిగతా సమయాల్లో దోస్తీ చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో విద్య, వైద్యంపై పెట్టాల్సిన దృష్టి, కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు పెట్టారని ఆరోపించారు. ధరణి పేరుతో పేదలైన దళితులు, గిరిజనుల భూములు లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళితుల, గిరిజనుల భూములు వారికి అప్పగిస్తామన్నారు. కేసీఆర్ రాత్రిలో ధరణి భూముల వ్యవహారాలు, మధ్యాహ్న సమయంలో ప్రాజెక్టుల కమీషన్ల వ్యవహారాలు చూస్తున్నారన్నారు. ఇంకా ప్రజల సమస్యలు చూసే సమయం ఎక్కడ ఉందని ఎద్దేవా చేశారు. పాదయాత్ర అమాంతం డప్పు చప్పుళ్లు, డోలు వాయిద్యాలతో ఉత్సాహంగా సాగింది.
కాగా, మహబూబ్‌నగర్ జిల్లాలో జోడోయాత్ర ముగింపు సందర్భంగా బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో ఏఐసీసీ సభ్యులు మధుయాష్కీగౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రాజగోపాల్‌రెడ్డి.. కాంట్రాక్టుల కోసం బీజేపీలోకి పోయిన ఆయన్ని ప్రజలు నమ్మరాదని తెలిపారు ఈ యాత్రలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాకూర్, టీపీసీసీ మాజీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఏఐసీసీ మెంబర్లు బోసురాజు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు చల్లా నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే సీతక్క, తదితరులు పాల్గొన్నారు.