Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మునుగోడులో ఆగం కాకండి
- వామపక్షాలతో కలిసి మతోన్మాదులతో కొట్లాడతాం
- అరాచకాలను నిలువరిస్తాం
- పంట కొనడం చేతకాని బీజేపీ... వందల కోట్లతో ఎమ్మెల్యేలను కొంటుంది
- తడిబట్టలతో ప్రమాణం చేయడం రాజకీయమా?
- నా బలగం...శక్తీ మీరే... :చండూరు బహిరంగ సభలో సీఎం కేసీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
''మునుగోడు ప్రజలు ఆగం కావద్దు. ఓ వ్యక్తి స్వార్ధం కోసం వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పండి. రాష్ట్రంలో పండిన పంట కొనడం చేతగాని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అంగట్లో సరుకుల్లా ఎమ్మెల్యేలను వందల కోట్లు పెట్టి కొనేందుకు కుట్రలు చేస్తుంది. ఆపార్టీనీ, ఆ నేతల్ని నమొద్దు. వారివల్ల ఈ దేశం అన్నిరంగాల్లో విఫలమైంది'' అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అన్నారు. మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం బంగారిగడ్డలో జరిగిన బహిరంగ సభలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే, ఉచితాలు బంద్ చేయమని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తున్నదనీ, అదే మోడీ సర్కారు మాత్రం కార్పొరేట్లకు నష్టాలు వచ్చాయనే సాకుతో రూ.14 లక్షల కోట్లు దోచిపెట్టిందని గుర్తుచేశారు. మోటార్లకు మీటర్లు పెట్టాలనే మోడీ సర్కారుకే ప్రజలు మీటర్ పెట్టాలని చెప్పారు. ఎమ్మెల్యేలతో బేరం పెట్టిన పార్టీ నాయకుడొకడు తడి బట్టలతో వచ్చి ప్రమాణం చేస్తావా అంటే..ఇంకొకడు పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా అంటారు...ఇదా రాజకీయం? అని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు అనేకం ఉన్నాయనీ, వాటిపై కొట్లాడకుండా, పనికిరాని ముచ్చట్లతో తప్పుతోవ పట్టిస్తుంటే, ప్రజలెవరూ ఆగం కావద్దన్నారు. వారిపై కొట్లాడేందుకు టీఆర్ఎస్, వామపక్షాలు వంటి ప్రగతిశీల శక్తులు ఉన్నాయని చెప్పారు. మునుగోడులో విద్యాధికులు, కవులు, కళాకారులు, రచయితలు, అన్నదమ్ముళ్లు, అక్కాచెళ్లెల్లు ఇండ్లకు వెళ్లాక చర్చ చేయాలని అన్నారు. దేనికో ఆశపడి, ఎవడో చెప్పిండని మాయమాటలకు లొంగి ఓట్లు వేస్తే మంచి జరుగదని హెచ్చరించారు. ముండ్ల చెట్లు నాటితే పండ్లు రావనీ, గాడిదలకు గడ్డేసి.. ఆవులను పిండితే పాలు రావనీ, ఓటు వేసేటప్పుడు ఆలోచన చేయాలని చెప్పారు. దేశంలో ఏ ప్రధాని కూడా చేయని దుర్మార్గం మోడీ చేశాడనీ, చేనేతపై 5 శాతం జీఎస్టీ వేసి శిక్షిస్తున్నారన్నారు. పోస్టుకార్డు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నారు. వామపక్షాలు, టీఆర్ఎస్ కలిసి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు పోరాటం చేస్తున్నామనీ, ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత శక్తివంతమైనదనీ, అదే ఓటు బలంతో బీజేపీ మనల్నే పోటు పొడిచేందుకు సిద్ధమవుతుందని చెప్పారు. దేశంలోని వనరుల్ని వినియోగించుకోవడం చేతకాక, పాలనపై కేంద్రం చేతులెత్తేసిందంటే విద్యుదుత్పత్తి, ప్రయివేటీకరణ, కార్పొరేటీకరణ వంటి పలు అంశాలను ప్రస్తావించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బంగారిగడ్డ బహిరంగ సభలో లేకపోవడాన్ని ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. 20 ఏండ్లలో ఆయన లేకుండా తాను ఏ సభలోనూ మాట్లాడలేదనీ, ఆయన చేసిన తప్పు ఏంటని ప్రశ్నించారు. యావత్ ప్రభుత్వరంగాన్నీ ప్రయివేటీకరణ చేద్దామనుకునే వాళ్లకు ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని అన్నారు. వ్యవసాయాన్ని కూడా కార్పొరేట్ గద్దలకు అప్పజెప్పే ప్రయత్నం జరుగుతోందనీ, రైతులు గమనించాలని చెప్పారు. ప్రజల్లో అమాయకత్వం ఉన్నన్నాళ్లుదుర్మార్గుల ఆటలు సాగుతాయనీ, ఓటర్లు అలాంటి వాళ్ల చేతుల్లో పడవద్దని విజ్ఞప్తి చేశారు.
ఆత్మగౌరవాన్ని కొంటారా...
'ఇవాళ నాతో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు హైదరాబాద్ నుంచి మునుగోడుకు వచ్చారు. నిన్నామొన్న కొంత మంది ఢిల్లీ బ్రోకర్‌గాళ్లు తెలంగాణ ఆత్మగౌరవాన్నే కొందామని ప్రయత్నించారు. వంద కోట్లు ఇస్తాం.. పార్టీ విడిచి రమ్మన్నారు. వాళ్లను ఎడమకాలి చెప్పుతో కొట్టి తాము అంగట్లో సరుకులం కాదనీ, తెలంగాణ బిడ్డలమంటూ ఆత్మగౌరవ బావుటాను హిమాలయపర్వతం అంత ఎత్తుకు తీసుకెళ్లారు' అని సీఎం కేసీఆర్ చెప్పారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు లాంటివారు రాజకీయాలకు కావాలనీ, మునుగోడులో ఓడిపోయినా ప్రజల మధ్యే ఉన్న కూసుకుంట్ల ప్రభాకరరెడ్డిని గెలిపించాలని కోరారు.
వందల కోట్ల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఇతరులను సంతలో పశువుల్లా కొని ప్రభుత్వాలను కొలగొట్టే అరాచక వ్యవస్థ మంచిదా? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ప్రమేయం లేకుండానే ఆర్ఎస్ఎస్లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్‌కు వచ్చి ఎమ్మెల్యేల కొనుగోళ్లు జరిపేందుకు యత్నించారా అని అడిగారు. ఆ వచ్చిన వాళ్లు ఇప్పుడు వాళ్లు చంచల్‌గూడ జైలులో ఉన్నారనీ, ఈ ఆఫర్లో వందల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో, దీని వెనుక ఉన్నవారెవరో ప్రజలకు తెలియాలన్నారు. అలాంటి వాళ్లుఒక్క క్షణం కూడా పదవుల్లో ఉండడానికి అర్హులు కాదని తీవ్రంగా హెచ్చరించారు. ''75 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇంత అరాచకం జరుగుతుంటే మనం మౌనంగా ఉందామా? ఆలోచించాలి'' అని చెప్పారు.