Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'కఫం' పరీక్షల బాధ్యత వారికే
- అంటువ్యాధి ప్రబలుతుందని భయం
- నెలకు 10 శాంపిల్స్ తేవాలంటూ ఒత్తిడి
నవతెలంగాణ-నిజామాబాద్ ప్రాంతీయ ప్రతినిధి
టీబీ (క్షయ) వ్యాధి ఫియర్ ఆశాలను వెంటాడుతోంది. టీబీ నిర్ధారణ కోసం చేయాల్సిన కఫం పరీక్షల శాంపిల్స్ బాధ్యతను ఆశాలపై నెట్టారు. గతంలో టీబీ సూపర్ వైజర్లు మాత్రమే కఫం నిర్ధారణ కోసం శాంపిల్స్ సేకరిస్తుండగా.. ఆ బాధ్యతను సైతం ఆశాలపై నెట్టారు. ఒకవేళ టీబీలో పాజిటివ్‌గా తేలితే.. నయం అయ్యే వరకు రోగికి గోళీల సరఫరా నుంచి ఇంజక్షన్లను అందజేసే వరకు ఆశాలతో సమన్వయం చేయిస్తున్నారు. దాంతో ఆశా కార్యకర్తల కుటుంబీకులు భయపడుతున్నారు. ఈ అంటువ్యాధి తమకు ప్రబలుతోందేమోనని భయంతో ఉన్నారు. ఇక కఫం పరీక్షల శాంపిల్స్ నెలకు ఒక్కో ఆశ కార్యకర్త పది సేకరించాలని టార్గెట్ విధిస్తున్నారు. పైగా కలెక్టర్ ఆదేశాలు అంటూ భయపెడుతున్నారు. అయితే ప్రాణాలకు తెగించి ఇంత చేస్తున్నా.. పైసా అదనంగా ఇవ్వడం లేదు.
రాష్ట్ర ప్రభుత్వం ట్యూబర్‌క్యూలోసిస్(టీబీ) క్షయవ్యాధిని 2025 వరకు నిర్మూలించాలని టార్గెట్‌గా విధించుకుంది. ఈ క్రమంలో అనుమానితుల శాంపిల్స్ సేకరించి ముందస్తుగా వ్యాధిని గుర్తించి చికిత్స అందించాలని నిర్ణయించింది. అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. ఈ బాధ్యతను కూడా మళ్లీ ఆశాలపై నెట్టింది. ఇప్పటికే డెలవరీలు, టీకాలు, జ్వర సర్వేలు, హెల్త్ సర్వేలంటూ క్షణం తీరిక లేకుండా ఉన్న ఆశాలపై ఈ భారం నెట్టింది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో సుమారు 25 వేల మంది ఆశా కార్యకర్తలున్నారు. ఈ ఆశాలకు కొత్తగా క్షయ వ్యాధి గుర్తించే బాధ్యతను నెట్టారు. పీహెచ్‌సీల నుంచి కఫం కోసం కప్పులు తీసుకొచ్చి రోగికి రాత్రి అందించాల్సి ఉంటుంది. ఉదయం కఫం శాంపిల్స్ సేకరించి ఆ కఫాన్ని పీహెచ్సీలో అందజేస్తున్నారు. అయితే ఇందుకోసం అవసరమైన కనీస రక్షణ పరికరాలు ఏమీ ఇవ్వడం లేదు. మాస్క్‌లు, గ్లౌజులు సైతం అందజేయకుండా కఫం శాంపిల్స్ తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొంది. దాంతో చాలా మంది ఆశాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే విషయం.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తే 'కలెక్టర్ సార్ ఆదేశాలు. తప్పక పాటించాల్సిందే' అని గద్దించి చెబుతున్నట్టు ఆశాలు వాపోతున్నారు. పైగా నెలకు పది శాంపిల్స్ తప్పక తీసుకురావాలని టార్గెట్ విధించారు. గతంలో టీబీ సూపర్ వైజర్లు ఈ కఫం శాంపిల్స్ అన్ని జాగ్రత్తలతో సేకరించేవారు. లేదా మరీ అత్యవసరమైతే రోగికి నేరుగా పరీక్షలకు వెళ్లేవారు. కానీ ప్రస్తుతం ఆ బాధ్యత కూడా ఆశాలపై నెట్టారు. ఒకవేళ టీబీ పాజిటివ్‌గా తేలితే ఆరు నెలల కోర్సు పాటించాల్సి ఉంటుంది. అందుకు అవసరమైన మందుగోళీలను కూడా ఆశాల ద్వారా ఇప్పిస్తున్నారు. రోగి నేరుగా ఆశాల ఇంటికి వెళ్లి తీసుకువెళ్తున్నారు. ఈ క్రమంలో రోగి దగ్గినా, తుమ్మినా ఆ అంటువ్యాధి తమ కుటుంబీకులకు సోకుతుందని ఆశా కార్యకర్తలు భయపడుతున్నారు. ట్యూబర్‌క్యూలోసిస్ బాక్టీరియా సాధారణంగా దగ్గు, తుమ్ముల సమయంలో గాలిలోకి విడుదలయ్యే చిన్న బిందువుల ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా సాధారణంగా ఊపిరితిత్తులకు సోకుతుంది. ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్. దాంతో తామూ జబ్బుపడతామని ఆశాలు భయపడుతున్నారు.
అందనంగా కష్టపడ్డా ఫలితం శూన్యం
కఫం శాంపిల్స్ పరీక్షల టార్గెట్ విధించిన అధికారులు.. ఆశాలు చేసిన పనికి తగ్గ ప్రతిఫలం మాత్రం ఇవ్వడం లేదు. తమ ఆరోగ్యాలను లెక్కచేయకుండా శాంపిల్స్ సేకరిస్తున్నా.. అదనంగా అణాపైసా ఇవ్వడం లేదు. పైగా డెలవరీల్లో ఒక్కో నెల డెలవరీలు లేకపోతే వచ్చే డబ్బుల్లో కోత విధిస్తున్నారు. అదే సమయంలో ఏదైనా నెలలో ఒకటి కన్నా ఎక్కువగా డెలవరీలు చేయిస్తే మాత్రం ఆ కమీషన్ ఇవ్వడం లేదు. పైగా తొమ్మిది నెలల పాటు గర్భిణితో సమన్వయం చేసినప్పటికీ..చివరి నిమిషంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో సరైన వైద్యం అందక..రోగులు ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తే ఆ కమీషన్ సైతం ఆశాలకు ఇవ్వడం లేదు. ఇటీవల బోధన్ మండలంలో ఓ గర్భిణిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి పంపితే చికిత్స చేయకుండా నిరాకరించారు. దాంతో ఆమె ప్రయివేటు ఆస్పత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇలా ఆశాలు చేసిన పనిలోనూ సరైన న్యాయం చేయడం లేదు. ఇదేంటని అడిగితే సమాధానం ఉండటం లేదు.
కఫం శాంపిల్స్ మాపై నెట్టడం సరికాదు
టీబీ అంటువ్యాధి. రోగి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఇతరులకు చాలా త్వరగా సోకుతుంది. అలాంటి రోగులకు సంబంధించిన కఫం శాంపిల్స్ సేకరించే బాధ్యత మాపై పెట్టడం సరికాదు. ఎందుకంటే ఆశాలు అటు గర్భిణులతో ఇటు చిన్నపిల్లలతో ఉండాల్సి ఉంటుంది. ఈ టీబీ సోకితే అందరూ ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కాబట్టి ఈ బాధ్యతను మా నుంచి తప్పించాలి.
- గైని రాజమణి, ఆశా యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు