Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్పీడీసీఎల్ పరిధిలో ప్రమాదపుటంచున విధులు
- ఇప్పటికీ 60 మంది వరకూ మృతి
- ప్రాణాలు పోయినా పరిహారమివ్వని అధికారులు
- ఆరునెలలకోసారి వేతనాలు.. అందులోనూ కోతలు
- ఉద్యోగ భద్రత.. స్కిల్డ్ వర్కర్లుగా గుర్తించాలని డిమాండ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఎన్పీడీసీఎల్) పరిధిలో అన్ మ్యాన్డ్ వర్కర్ల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఎన్పీడీసీఎల్ సీఎండీగా కార్తికేయ మిశ్రా ఉన్నప్పుడు అన్ మ్యాన్డ్ వర్కర్స్ వ్యవస్థను ప్రవేశ పెట్టారు. వీరు విద్యుత్ లైన్మెన్లకు సహాయకులుగా పని చేస్తుంటారు. ఫ్యూజులు వేయడం, నెలలో 100 ట్రాన్స్ఫార్మర్లు (డీటీఆర్) చేయడం, వెయ్యి సర్వీస్ లైన్లు నిర్వహించాలి. ఎట్టి పరిస్థితుల్లో వీరితో విద్యుత్ స్తంభాలు ఎక్కించొద్దు. ఒకవేళ ఎక్కిస్తే.. ప్రమాదం జరిగితే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలి. కానీ ఉద్యోగం నుంచి తీసేస్తామని బెదిరించి స్తంభాలు ఎక్కించడం, ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతులు, 11కేవీ, 33 కేవీ బ్రేక్డౌన్లు, లూజ్ లైన్లు లాగడం, చెట్లు కొట్టడం.. ఇలా ఇష్టారీతిగా వీరితో కాంట్రాక్టర్లు పనులు చేయిస్తుండటం, రాంగ్ ఎల్సీలు ఇస్తుండటంతోనే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
ప్రాణాలు పణంగా...
ఎన్పీడీసీఎల్ పరిధిలో ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలున్నాయి. ఉమ్మడి ఖమ్మంలో 137, వరంగల్‌లో 613, కరీంనగర్లో 344, నిజామాబాద్‌లో 92, ఆదిలాబాద్ జిల్లాలో 302 మంది వర్కర్లు పనిచేస్తున్నారు. మొత్తం ఎన్పీడీసీఎల్ పరిధిలో 1,488 మంది అన్ మ్యాన్డ్ వర్కర్స్ ఉన్నారు. వీరంతా ప్రాణాలు పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నారు. 2013 లో 1600 వరకు ఉన్న వీరి సంఖ్య ప్రమాదాల కారణంగా తగ్గుతూ వస్తోంది. ఇప్పటి వరకూ 65 మంది వరకూ మృతి చెందగా 50 మందికి పైగా వైకల్యం బారిన పడ్డారు. మృతుల్లో పది మంది వరకూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన వారున్నారు. జిల్లాలోని లింగాల సబ్ డివిజన్ మంచుకొండ సెక్షన్లో పనిచేస్తున్న వాల్యా, నేలకొండపల్లికి చెందిన పసుపులేటి రాజశేఖర్ అనే కార్మికులు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు చేస్తూ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ జిల్లా నర్సంపేట సెక్షన్లో కార్మికుడు మణికుమార్ ఆగస్టు 30న విధి నిర్వహణలో విద్యుద్ఘాతంతో మృతిచెందారు. అదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ సెక్షన్ వర్కర్ నయీమ్ విద్యుత్ స్తంభంపైనే మృ చెందగా, నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సంతోష్ అనే ఆన్ మ్యాన్డ్ వర్కర్ విద్యుత్ స్తంభంపై షాక్‌తో మరణించాడు. మొత్తంగా ఎన్పీడీసీఎల్ పరిధిలో ఇప్పటికీ సుమారు 65 మంది అన్ మ్యాన్డ్ వర్కర్లు విధి నిర్వహణలో మృతి చెందినా సంబంధిత అధికారుల్లో చలనం లేదు. ప్రతి ప్రమాదానికీ... అధికారులు ఈ వర్కర్లను నిబంధనలకు విరుద్ధంగా ఉపయోగిం చడమే కారణమనే ఆరోపణలు ఉన్నాయి.
దినసరి కూలీ కంటే తక్కువ వేతనాలు..
మొదట్లో అన్ మ్యాన్డ్ వర్కర్లకు వేతనంలో కటింగ్స్ లేకుండా రూ.4,000, తర్వాత రూ. 8,000 వేతనం ఇచ్చారు. పోరాటాల ఫలితంగా ప్రస్తుతం రూ.14,727 ఇస్తున్నారు. కటింగ్స్ పోను కేవలం రూ.8,440 మాత్రమే చేతికి వస్తున్నాయి. 24 గంటల పనిలో ఉన్నా కనీసం ఉపాధి కూలీ వేతనం సైతం రావడం లేదని వారు వాపోతున్నారు. అదీ చాలదన్నట్టు కాంట్రాక్టర్లు కమీషన్ పేరిట వీరి వేతనాల నుంచి దోపిడీ చేస్తున్నారు. మూడు నెలలకోసారి వేతనాలు ఇస్తుండటంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సైతం చెల్లించడం లేదు. భవిష్యత్తులోనైనా రెగ్యులరైజ్ అవుతుందని ఐటీఐ చదివిన 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉన్న అన్ మ్యాన్డ్ వర్కర్స్ విధులు నిర్వహిస్తున్నారు. కానీ విద్యుత్ శాఖ అధికారులు రిటైరయిన విద్యుత్ ఉద్యోగులను సబ్ స్టేషన్ ఆపరేటర్లుగా నియమిస్తూ అన్నీ బెనిపిట్స్ వస్తున్న వారికే నెలకు రూ.22వేల వేతనం ఇస్తుండటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.
ఆర్టిజన్లుగా గుర్తించాలి..
ఐటీఐ, డిప్లొమా విద్యార్హతను బట్టి స్కిల్డ్ ఇతర విద్యార్హతల ఆధారంగా అన్ స్కిల్డ్ వర్కర్లుగా విభజించి, ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించాలని అన్ మ్యాన్డ్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వడంతో పాటు సబ్ స్టేషన్లలో ఖాళీగా ఉన్న ఆపరేటర్ పోస్టులను అన్ మ్యాన్డ్ వర్కర్లతో భర్తీ చేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఆపరేటర్లుగా పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులను తొలగించి అన్ మ్యాన్డ్ వర్కర్లకు అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎస్పీడీసీఎల్ (సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్) పరిధిలో అన్ మ్యాన్డ్ వర్కర్లను (కటర్స్) ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించినట్టే, ఎన్పీడీసీఎల్ పరిధిలోనూ గుర్తించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. ప్రమాదంలో మరణించిన అన్ మ్యాన్డ్ కార్మికుల కుటుంబాలకు పరిహారం చెల్లించి, వారి కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రతినెలా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లోనే వేతనాలు వేయాలని, జూనియర్ లైన్మెన్ నియామకాల్లో ఆన్ మ్యాన్డ్ వర్కర్లకు సీనియారిటీ ప్రకారం ప్రాధాన్యత ఇవ్వాలని, వెయిటేజ్ మార్కులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. పది, పదిహేనేండ్లుగా పనిచేస్తున్న కార్మికులకు మేలు చేయాలని కోరుతున్నారు.
అర్హతలున్నా అన్ స్కిల్డ్ వర్కర్లుగానే...
అర్హతలున్నా అన్ స్కిల్డ్ వర్కర్లుగానే అన్ మ్యాన్డ్ వర్కర్స్‌ను పరిగణించి వారికి అరకొర వేతనం ఇస్తూ వెట్టిచాకిరి చేయిస్తున్నారు. 2016 డిసెంబర్లో 23 వేల మందిని ఆర్టిజన్లుగా రెగ్యులరైజ్ చేశారు. అప్పటికే మూడేండ్లుగా విధులు నిర్వహిస్తున్న అన్ మ్యాన్డ్ వర్కర్స్‌ను ఈపీఎఫ్ లేదనే కారణంతో రెగ్యులర్ చేయలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా అన్ మ్యాన్డ్ వర్కర్లను రెగ్యులర్ చేయాలి. విధుల్లో మరణించిన వారికి పరిహారం, బీమా సౌకర్యం కల్పించాలి. వైకల్యం బారిన పడిన వారిని ఆదుకోవాలి.
- ఎం. ప్రసాద్, టీఎస్ యూఈఈయూ, ఎన్పీడీసీఎల్ జనరల్ సెక్రటరీ, ఖమ్మ.