Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వికారాబాద్‌లో జిల్లాలో ఘటన
నవతెలంగాణ-వికారాబాద్ ప్రతినిధి
డేంజర్ గేమ్ ఓ యువకుడి ప్రాణాలు తీసింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన కొందరు యువకులు శనివారం సాయంత్రం వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ రిసార్ట్స్‌కు వెళ్లారు. అక్కడ అడ్వంచర్ క్లబ్ ఆధ్వర్యంలో మూన్ లైట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రిసార్ట్ నిర్వహకులు డేంజర్ గేమ్ ఏర్పాటు చేశారు. దాచి పెట్టిన వస్తువులను కనిపెట్టడమే ఈ గేమ్ ఉద్దేశం. గుర్తించాల్సిన వస్తువును నిర్వహకులు బావిలో దాచారు. హైదరాబాద్ నుంచి వెళ్లిన యువకులు ఈ గేమ్స్‌లో పాల్గొన్నారు. సాయికుమార్(24) అనే వ్యక్తి ఆ వస్తువు కోసం బావిలోకి దూకాడు. దాని కోసం వెతుకుతూ ఊపిరాడక బావిలోనే మరణించాడు. వెంటనే గుర్తించిన నిర్వహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని బావిలో నుంచి వెలికి తీశారు. పోస్టుమార్టం నిమిత్తం వికారాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.